ఎన్నికల సిత్రం.. ఒకే నియోజకవర్గం.. భార్య, భర్త, కొడుకు!

తెలంగాణ అసెంబ్లీకి నవంబర్‌ 30న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. డిసెంబర్‌ 3న ఫలితాలు వెలువడతాయి.

Update: 2023-11-18 04:52 GMT

తెలంగాణ అసెంబ్లీకి నవంబర్‌ 30న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. డిసెంబర్‌ 3న ఫలితాలు వెలువడతాయి. కాగా ఈ ఎన్నికలకు సంబంధించి ఒక నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కారణం గతంలో ఆ నియోజకవర్గం నుంచి భార్య, భర్త పోటీ చేసి ఉండటమే. అంతేకాదు ఇప్పుడు వారి కుమారుడు సైతం బరిలో నిలబడ్డారు. దీంతో భార్య, భర్త, కొడుకు పోటీ చేసిన నియోజకవర్గంగా మెదక్‌ నియోజకవర్గం రికార్డు సృష్టిస్తోంది.

ప్రస్తుతం మల్కాజిగిరి నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా ఉన్న మైనంపల్లి హన్మంతరావు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ లో చేరిన సంగతి తెలిసిందే. వాస్తవానికి బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో మైనంపల్లి మరోసారి తొలి విడతలోనే అవకాశం దక్కించుకున్నారు. అయితే తన కుమారుడు రోహిత్‌ కు కూడా మెదక్‌ టికెట్‌ ఇవ్వాలని కోరారు. అయితే కేసీఆర్‌ పట్టించుకోలేదు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మైనంపల్లి హన్మంతరావు తీవ్ర విమర్శలు చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

తనకు, తన కొడుకు రోహిత్‌ కు ఇద్దరికీ సీట్లు దక్కించుకున్నారు. ఈ క్రమంలో మైనంపల్లి హన్మంతరావు మల్కాజిగిరి నుంచి, ఆయన కొడుకు రోహిత్‌ మెదక్‌ నుంచి పోటీ పడుతున్నారు.

కాగా గతంలో రామాయంపేట నియోజకవర్గం 2009లో రదై్ద మెదక్‌ నియోజకవర్గంలో కలిసిపోయింది. 2004లో రామాయంపేట నుంచి మైనంపల్లి హన్మంతరావు భార్య మైనంపల్లి వాణి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మా దేవేందర్‌ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక 2009లో టీడీపీ అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు మెదక్‌ నుంచి గెలిచారు. ఆయన పద్మా దేవేందర్‌ రెడ్డిపై విజయం సాధించారు. 2014, 2018 ఎన్నికల్లో పద్మా దేవేందర్‌ రెడ్డి మెదక్‌ నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గెలుపొందారు. ఇక మైనంపల్లి హన్మంతరావు మల్కాజిగిరి నుంచి 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గెలిచారు.

ఇక ఇప్పుడు మైనంపల్లి హన్మంతరావు మరోసారి మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్‌ మెదక్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పద్మా దేవేందర్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ నుంచి మెదక్‌ నుంచి తలపడుతున్నారు. ఇలా 2004, 2009, 2023 ఎన్నికల్లో పద్మా దేవేందర్‌ రెడ్డితోనే మైనంపల్లి కుటుంబం తలపడుతోంది.

Tags:    

Similar News