తొలిసారి బాధితురాలు ఇచ్చిన వీడియో క్లిప్ ను షేర్ చేయలేకపోయారు

సత్యవేడు ఎమ్మెల్యే లైంగిక దాడులతో తాను హడలిపోతున్నట్లుగా చెప్పిన బాధితురాలు.. అందుకు తగ్గ వీడియో క్లిప్పులను మీడియాకు అందజేశారు.

Update: 2024-09-06 05:22 GMT

రోటీన్ కు భిన్నమైన సీన్ తాజాగా చోటు చేసుకుంది. సోషల్ మీడియా ఎంట్రీ తర్వాత మీడియా కాస్త దూకుడుగా ముందుకెళుతున్న సంగతి తెలిసిందే. అయితే.. అందుకు భిన్నంగా తన వరకు తాను బాధ్యతగా వ్యవహరిస్తానన్నట్లుగా స్వీయ సెన్సార్ తో వ్యవహరించిన తీరు ఇప్పుడుఆసక్తికరంగా మారింది. దీనికి హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్ వేదికగా మారింది.

సత్యవేడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలం తనను శారీరకంగా.. మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారంటూ బాధితురాలు గురువారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముందుగానే.. ఏపీ అధికార పార్టీ ఎమ్మెల్యే వేధింపులపై మీడియా మీట్ ఉంటుందని సమాచారం ఇచ్చారు. దీంతో.. మిగిలిన ప్రెస్ మీట్లకు మించి ఎక్కువమంది మీడియా ప్రతినిధులు హాజరయ్యారు.

సత్యవేడు ఎమ్మెల్యే లైంగిక దాడులతో తాను హడలిపోతున్నట్లుగా చెప్పిన బాధితురాలు.. అందుకు తగ్గ వీడియో క్లిప్పులను మీడియాకు అందజేశారు. ఇలాంటి వాటి విషయంలో దూకుడుగా వ్యవహరించే మీడియా.. బాధితురాలు ఇచ్చిన వీడియోక్లిప్పులను చూసి షాక్ తిన్నారు. అత్యంత సున్నితమైన కంటెంట్ ఉండటంతో.. వెంటనే బాధ్యతను గుర్తుకు తెచ్చుకొని మరీ.. స్వీయ సెన్సార్ షిప్ కు తెర తీశారు. ఒక విధంగా ఈ పరిణామం మంచిదేనని చెప్పాలి.

బాధితురాలు విడుదల చేసిన వీడియో క్లిప్పుల్లో వాస్తవం నగ్నంగా దర్శనమిచ్చినప్పటికి.. తమకున్న సామాజిక బాధ్యతను గుర్తు చేసుకున్న మీడియా ప్రతినిధులు వీలైనంతవరకు తగిన జాగ్రత్తలు పాటించారు. తమ చేతికి వచ్చిన సమాచారాన్ని గుడ్డిగా వైరల్ చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కొందరు మాత్రం అందుకు మినహాయింపుగా వ్యవహరించారు. మొత్తంగా చూస్తే.. మిగిలిన సందర్భాల్లో రెచ్చిపోయే తీరును తాజా ఎపిసోడ్ లో మాత్రం ప్రదర్శించలేదని మాత్రం చెప్పక తప్పదు. ఈ మాత్రం జాగ్రత్తలు తీసుకోవటం అభినందించాల్సిన అంశంగా చెప్పక తప్పదు.

Tags:    

Similar News