ఏమిటీ ఇన్శాట్ 3 డీఎస్? ఇస్రో కీర్తి కిరీటంలో మరో ఉపగ్రహం
వరుస అంతరిక్ష ప్రయోగాలతో దూసుకెళుతున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది
వరుస అంతరిక్ష ప్రయోగాలతో దూసుకెళుతున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. తన కీర్తి కిరీటంలోకి మరో ఉప గ్రహం ప్రకాశించనుంది. మరికొద్ది రోజుల్లో ఇన్శాట్ 3డీఎస్ పేరుతో ఒక శాటిలైట్ ను అంతరిక్షంలోకి పంపనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఇస్రో చేస్తోంది. ఇప్పటికే కక్ష్యలో పరిభ్రమిస్తున్న ఇన్శాట్ 3డీ.. ఇన్శాట్ 3డీఆర్ శాటిలైట్లకు కొనసాగింపుగా దీన్ని ప్రయోగించనున్నారు.
వాతావరణ రంగంలో సేవలు అందించేందుకు వీలుగా ఈ ఉపగ్రహాన్ని సిద్ధం చేస్తున్నారు. శ్రీహరికోట నుంచి దీన్ని ప్రయోగించనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఎర్త్ సైన్సెస్ శాఖ కోసం ఈ ప్రయోగాన్ని జరుపుతున్నారు. ఫిబ్రవరి 17 -మార్చి 17 మధ్యన ఎప్పుడైనా ఈ శాటిలైట్ ను ప్రయోగించనున్నారు. బెంగళూరులోని ప్రొఫెసర్ యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ లో ఇప్పటికే కీలక పరీక్షల్ని విజయవంతంగా పూర్తి చేశారు. త్వరలో దీన్ని శ్రీహరికోటకు చేర్చనున్నారు.
వాతావరణ సంబంధమైన అంశాల్నిఅధ్యయనం చేసేందుకు ప్రయోగిస్తున్న ఈ ఉపగ్రహం బరువు 2275 కేజీలుగా ఉంటుంది. వాతావరణ అంచనాలు.. విపత్తుల్ని ముందే హెచ్చరించటానికి వీలుగా దీన్ని రూపొందించారు. ఈ ప్రయోగానికి కాస్త ముందుగా ఇస్రో ఆధ్వర్యంలో నిసార్ ఉపగ్రహ ప్రయోగం జరగనుంది. నాసా- ఇస్రో సింథటిక్ ఆపెర్చర్ రాడార్. అమెరికా అంతరిక్ష సంస్థ నాసాతో పాటు.. మన ఇస్రో కలిసి ప్రయోగిస్తున్న ఉమ్మడి ఉపగ్రహంగా దీన్ని చెప్పాలి.
నిసార్ అనేది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎర్త్ ఇమేజింగ్ శాటిలైట్ గా చెప్పాలి. ఈ ప్రాజెక్టు అంచనా సుమారు రూ.12,500 కోట్లు. ఈ ప్రయోగం ద్వారా భూమి సంబంధ మార్పుల్ని పరిశీలించటంతో పాటు.. చిత్తడి నేలల స్థితిగతులు.. అగ్నిపర్వతాల కారణంగా నేల రూపురేఖల్లో సంభవించే మార్పుల్ని ఇది గుర్తిస్తుంది. భూమిపై శీతలావరణానికి సంబంధించిన మంచు ఫలకలు.. హిమనీ నదాలు.. సముద్ర మంచులో కలిగే మార్పుల్ని ఈ ప్రయోగం ద్వారా గుర్తించే వీలుందని చెబుతున్నారు. ఈ రెండు ప్రతిష్టాత్మక ప్రయోగాల్లో ఇస్రో కీలక భూమిక పోషించటం విశేషంగా చెప్పాలి.