వైసీపీపై మంత్రి లోకేశ్ మాస్ అటాక్.. వీర లెవెల్లో ఇచ్చిపడేశాడు..
క్యాడర్ ఆలోచనలకు తగ్గట్టు మాట్లాడుతున్న మంత్రి లోకేశ్ టీడీపీపై బలమైన ముద్ర వేయడంతోపాటు ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నట్లు చెబుతున్నారు.;
మంత్రి లోకేశ్ మాస్ అటాక్ మామూలుగా ఉండటం లేదు. ముఖ్యంగా అసెంబ్లీ, శాసనమండలి, బహిరంగ సభ ఇలా వేదిక ఏదైనా అనర్గళంగా మాట్లాడటమే కాకుండా అవేశపూరిత ప్రసంగాలతో క్యాడరులో జోష్ నింపుతున్నారు మంత్రి లోకేశ్. తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయోత్సవ సంబరాల్లోనూ వైసీపీని మంత్రి లోకేశ్ ఉతికి పారేశారు. క్యాడర్ ఆలోచనలకు తగ్గట్టు మాట్లాడుతున్న మంత్రి లోకేశ్ టీడీపీపై బలమైన ముద్ర వేయడంతోపాటు ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నట్లు చెబుతున్నారు.
ఇక తాజాగా ఈవీఎం అయినా.. బ్యాలెట్ అయినా.. గెలుపు కూటమిదే అంటూ మంత్రి లోకేశ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈవీఎంలపై నిందమోసిన వైసీపీని తీవ్రంగా తప్పుబట్టారు మంత్రి లోకేశ్. గత కొంతకాలంగా కూటమి గెలుపును ఈవీఎం గెలుపుగా వైసీపీ ప్రచారం చేయడం తెలిసిందే. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, రోజాతోపాటు మాజీ సీఎం జగన్ సైతం ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ప్రజలు ఆ వాదనను తిరస్కరిస్తూ బ్యాలెట్ ద్వారా నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమికే పట్టం కట్టారని మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్సీ ఆలపాటి రాజా విజయోత్సవ సంబరాల్లో పాల్గొన్న మంత్రి లోకేశ్ వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారు. ఇక ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాజా ప్రసంగిస్తుండగా, పలుమార్లు క్యాడర్ ఆనందంతో గెంతులేశారు. అయితే కార్యకర్తల సంబరాలు తన ప్రసంగానికి అడ్డుగా భావించిన ఎమ్మెల్సీ ఆలపాటి కూర్చోవాలని కార్యకర్తలను అభ్యర్థించారు. ఈ విషయంలో జోక్యం చేసుకున్న మంత్రి లోకేశ్ కార్యకర్తలను మరింత ఉత్సాహపరిచారు. ‘‘కూర్చోమంటే.. కూర్చోంటామా’’ అని లోకేశ్ అనడంతో కార్యకర్తలు మరింత ఆనందంతో ఉప్పొంగిపోయారు.
మరోవైపు అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన తొలి ప్రత్యక్ష ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు రికార్డు మెజార్టీతో గెలవడం కూటమి పాలనను ప్రజలు స్వాగతిస్తున్నారని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. తొమ్మిది నెలలుగా సంక్షేమ పథకాలు నిలిపివేయడంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమికి వ్యతిరేక ఫలితాలు వస్తాయని ఊహించిన వైసీపీకి షాక్ తగిలినట్లైంది. వైసీపీ ఆశిస్తున్నట్లు ప్రజా వ్యతిరేకత కనిపించకపోగా, మరింత ఆదరణ పెరిగిందనే విషయం స్పష్టమైందని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు.