ఉక్రెయిన్ రక్షణ మంత్రిని మార్చిన జెలెన్ స్కీ.. ట్విస్టు తెలిస్తే మాత్రం?
మనకు తెలిసిన రాజకీయానికి ప్రపంచ రాజకీయానికి వ్యత్యాసం బోలెడంత ఉంటుంది.
మనకు తెలిసిన రాజకీయానికి ప్రపంచ రాజకీయానికి వ్యత్యాసం బోలెడంత ఉంటుంది. మనలో ఉండదా అంటే.. గతంలో ఉండేది . రాజకీయాలు.. అధికారం అన్నది వ్యక్తిగత స్థాయికి వెళ్లిపోయి.. జాతి ప్రయోజనాలు లాంటి మాటలు కాలం చెల్లిన అంశాలుగా మారిన తర్వాత మనం ఇలా మారాం. పీవీ నరసింహరావు లాంటి వారు ప్రధానిగా ఉన్నప్పుడు విపక్షానికి చెందిన వాజ్ పేయ్ లాంటి వారిని అంతర్జాతీయ వేదిక మీద భారత్ కు ప్రాతినిధ్యం వహించేలా చేయటం ఉండేది. ఇప్పుడున్న మోడీ లాంటి అద్భుత ప్రధాని హయాంలో అలాంటివి ఆశించటం అత్యాశే అవుతుంది.
అప్పట్లో పీవీ తరహాలో ఇప్పటి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తన రాజకీయ చతురతను ప్రదర్శించారు. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని చూసినప్పుడు అబ్బురపడకుండా ఉండలేం. సమకాలీన రాజకీయాల్లో ఇలాంటి వారు ఇంకా ఉన్నారా? అన్న భావన కలుగుతుంది. తన కేబినెట్ లోని రక్షణ మంత్రిని మార్చేస్తూ నిర్ణయం తీసుకున్న జెలెన్ స్కీ.. యుద్ధవేళ ఆ కీలక పదవిని విపక్షానికి చెందిన ఒక నేతకు కట్టబెట్టటం ద్వారా పలువురిని అబ్బురపరిచారు.
ప్రస్తుతం రక్షణ మంత్రిగా ఉన్న అలెక్సీ రెజ్నికోవ్ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆ మాట కంటే కూడా రాజీనామా చేయించారు జెలెన్ స్కీ. కారణం.. సైనికులు ధరించే జాకెట్ల కొనుగోలులో అవినీతి చోటు చేసుకున్నట్లుగా ఆరోపణలు రావటమే. ఇలాంటి వేళ.. రక్షణ మంత్రి బాధ్యతల్ని అప్పగించే విషయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు ఊహించని రీతిలో రాజకీయ చతురతను ప్రదర్శిస్తూ.. ప్రతిపక్ష హోలోస్ పార్టీ నేత ఉమరోవ్ కు అప్పగిస్తున్నట్లుగా ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.
ఇప్పుడున్న సంక్లిష్ట పరిస్థితుల్లో దేశంలోని విపక్ష పార్టీల చేత వేలెత్తి చూపించే అవకాశాన్ని ఇవ్వకుండా.. వారిలో సమర్థుడైన వ్యక్తికి బాధ్యతలు అప్పగించటం ద్వారా దేశ ప్రజల మనసుల్ని దోచుకునే వీలుంటుంది. తాజాగా బాధ్యతలు అప్పగించిన ఉమరోవ్ కు 2022 సెప్టెంబరు నుంచి ఉక్రెయిన్ ప్రభుత్వ ఆస్తుల నిధికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ ప్రాశ్చాత్య దేశాల నుంచి సానుకూలతను సొంతం చేసుకున్నారు.
ఇలాంటి సమర్థమైన నేతకు రక్షణమంత్రి బాధ్యతల్ని అప్పగిస్తూ ప్రాశ్చాత్య దేశాల నుంచి మరింత ఆయుధ సాయం అందటంలో సక్సెస్ అవుతామన్నది జెలెన్ స్కీ ఆలోచనగా చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఉక్రెయిన్ నుంచి ఆహార ఎగుమతుల్ని అడ్డుకునే రష్యాకు చెక్ చెప్పాలన్నది కూడా మరో ఆలోచనగా చెబుతున్నారు. ఉక్రెయిన్ కు కు మద్దతుదారుగా వ్యవహరిస్తున్న తుర్కియే అధ్యక్షుడితో రష్యా చర్చలు జరుపుతున్న వేళ జెలెన్ స్కీ తీసుకున్న నిర్ణయంలో అదిరే ట్విస్టు ఉందంటున్నారు. అదేమంటే.. కొత్తగా రక్షణ మంత్రిగా బాధ్యతలు అప్పగించిన ఉమరోవ్ తుర్కియే దేశాధ్యక్షుడికి అత్యంత సన్నిహితుడిగా చెబుతున్నారు. ఇలాంటి వేళ.. రష్యా ఎత్తుకు జెలెన్ స్కీ వేసిన పైఎత్తు అందరి అభినందనలు పొందేలా చేస్తోంది.