ఆర్కే రోజా. తొంబై దశకంలో వెండితెరను ఏలిన గ్లామర్ క్వీన్. దశాబ్దం పాటు అగ్ర తారగా రాణించిన మీదట రాజకీయ రంగ ప్రవేశం చేసి గత రెండు దశాబ్దాలుగా ఆ రంగంలోనూ తన సక్సెస్ ని చాటుకుంటూ వస్తున్న నిన్నటి హీరోయిన్, నేటి నాయకురాలు.
రోజా తన రాజకీయ జీవితంలో రెండు పార్టీలను చూశారు. తెలుగుదేశంలో ఆమె రాజకీయ అరంగేట్రం చేసి రెండు సార్లు అంటే 2004, 2009లలో పోటీ చేసి ఓడారు. మరో రెండు సార్లు అంటే వైసీపీలో 2014, 2019లలో గెలిచారు. ఇక ఆమె రాజకీయంగా అనుకున్న విధంగా మంత్రి పదవిని సైతం దక్కించుకున్నారు. టీడీపీలో తెలుగు మహిళా అధ్యక్షురాలిగా కీలక బాధ్యతలు నెరపిన రోజా వైసీపీలోని స్టేట్ మహిళా ప్రెసిడెంట్ గా పనిచేశారు.
ఇలా మహిళా శక్తిగా ఒక బలమైన నేతగా ముద్ర వేసుకున్న రోజా ఏ పార్టీలో ఉన్నా ఒంటరిగానే ఉంటారా అన్నది చర్చకు వస్తోంది. టీడీపీలో తాను ఒంటరి అయ్యాయని ఆమె కన్నీరు పెట్టుకుని పార్టీని వదిలారు. ఇక వైసీపీలో జగన్ ఆమెను అన్ని విధాలుగా ప్రోత్సహించినా మంత్రి పదవి ఇచ్చినా పార్టీ బలం మాత్రం ఆమెకు దక్కడంలేదా అన్నదే చర్చగా ఉంది.
ఆమె గురించి దారుణమైన అనుచితమైన అసలు మీడియాలో రాయలేని చూపించలేని ఎవరితోనూ చెప్పలేని నీచమైన కామెంట్స్ ని టీడీపీకి చెందిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి చేస్తే వైసీపీ నుంచి ఆమెకు కనీస మద్దతు దక్కలేదు. ఆమె శీలాన్ని కూడా తక్కువ చేసి మాజీ మంత్రి మాట్లాడితే ఒక్క మహిళా నేత నుంచి కూడా ఖండన రాలేదు. ఆమె సాధారణ నేత కాదు, రెండు సార్లు ఎమ్మెల్యే, ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు.
అలాంటి నేత మీద నోరు పారేసుకుని చిత్తం వచ్చినట్లుగా బండారు రెచ్చిపోతే అధికారంలో ఉన్న వైసీపీ ఏమి చేసింది అన్నది కీలకమైన ప్రశ్న. తన ప్రభుత్వంలోని మహిళా మంత్రి మీదనే దారుణమైన వ్యాఖ్యలు చేసి ఆమె శీల హననానికి మాజీ మంత్రి బండారు పాల్పడితే తక్షణ చర్యగా ప్రభుత్వం స్పందించాల్సింది పోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
వివాదాస్పద దర్శకుడు అని ముద్ర ఉంటే ఉండొచ్చు కాక కానీ రాం గోపాల్ వర్మ మాత్రం ఈ ఇష్యూని టేకప్ చేసి జాతీయ మహిళా కమిషన్ కి అలాగే ఏపీ మహిళా కమిషన్ కి ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేసి దాని సీరియస్ నెస్ ఏంటో జనాలకు చెప్పారు. ఇక మీడియా డిబేట్లలో ఆయన పాల్గొని ఏపీ ప్రభుత్వం తీరు మీద కూడా విమర్శలు చేశారు.
ఆయన సంధించిన కొన్ని సూటి ప్రశ్నలకు ప్రభుత్వం జవాబు మాత్రం చెప్పాల్సి ఉంది. ఒక మంత్రి మీదనే ఇంతలా దారుణమైన అధార రహితమైన ఆరోపణలు నిర్లజ్జగా ఒక మాజీ మంత్రి చేస్తూ అపహాస్యం చేస్తే ఈ దేశంలో మహిళలకు విలువ ఏమి ఉంటుంది అన్నది ఆయన ప్రశ్న. రేపటి రోజున ఒక సగటు సాధారణ మహిళ మీద ఎవరైనా ఈవ్ టీజింగ్ చేసినా దిక్కు తెన్నూ ఏమిటీ అని ఆయన అడిగిన దానిలోనూ లాజిక్ ఉంది.
రాజకీయ విమర్శలకు రాజకీయ ప్రతి విమర్శలు లేకుండా వ్యక్తిగతంగా విమర్శలు చేయడం అది కూడా పాతాళానికి దిగజారిపోయి ఆమె గురించి నీచంగా మాట్లాడిన బండారు తీరు తప్పు అని ఆ వెంటనే ఏపీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసి ఉంటే ప్రభుత్వం గురించి అందరికీ తెలిసేది అలాగే విశాఖలో ఎంతో మంది మహిళా నేతలు ఉన్నారు. వైసీపీలో సీనియర్ నేతలు మహిళా మంత్రులు ఉన్నారు. వీరిలో ఒక్కరు కూడా ఇది తప్పు అని బండారు మీద కౌంటర్ కామెంట్స్ చేయకపోవడం వైసీపీ ప్రభుత్వానికే ఇబ్బందిగా మారిందని అంటున్నారు.
ఆర్కే రోజా ప్రభుత్వం పక్షాన డిఫెండ్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఆమె సొంతంగా ఎవరితోనూ పంచాయతీ పెట్టుకోలేదు. అలాంటపుడు డేరింగ్ గా ఒక మహిళ మంత్రి విపక్షాలకు ధీటైన కౌంటర్లు ఇస్తూ మాట్లాడుతున్నపుడు ఆమె మీద సోషల్ మీడియాలో అసభ్య పోస్టింగులు పెడుతూ వచ్చారు.
ఇపుడు మంత్రిగా పనిచేసిన ఒక సీనియర్ పొలిటీషియన్ అనరాని మాటలు అంటూ సమాజంలో ఆమె పరువు తీశారు మరి తన మంత్రి మీద మహిళ మీద ఇలాంటి దాడి జరుగుతున్నపుడు ప్రభుత్వం కానీ పార్టీ కానీ స్పందించకపోతే రేపటి రోజున ఏపీ మహిళల ఉద్ధరణకు భద్రతకు కట్టుబడి ఉంటామని చెప్పే మాటలకు విలువ ఏమి ఉంటుంది అన్నది కీలకమైన ప్రశ్నగా అందరూ ముందుకు తెస్తున్నారు.
ఏది ఏమైనా వైసీపీలో రోజా ఒంటరి అయ్యారా లేక ఆమె విషయంలో పార్టీ మౌనం వెనక వ్యూహాత్మక రాజకీయం ఉందా ఇవన్నీ ఇతర విషయాలు కానీ. రోజా మాత్రం మంత్రిగా ఉన్నత పదవిలో ఉంటూ కూడా బాధితురాలిగా మారడం వర్తమానంలో చోటుచేసుకుంటున్న దుర్మార్గపు రాజకీయ పోకడలకు నిదర్శనంగా చూడాలని అంటున్నారు.