బీజేపీకి కొత్త అర్థం చెప్పిన రోజా
ఈ వైసీపీ మహిళా మంత్రి ఒకేసారి చంద్రబాబు నాయుడు, జనసేన పవన్ కల్యాణ్, పురందేశ్వరిని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు.
ఫైర్ బ్రాండ్ రోజా మరోసారి ఫైరయ్యారు. ఈ వైసీపీ మహిళా మంత్రి ఒకేసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరిని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. అమరావతి నిర్మాణాల సబ్ కాంట్రాక్టుల్లో అవినీతిపై చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపైనే మంత్రి రోజా స్పందించారు. చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని, అందుకే తనను అరెస్టు చేస్తారంటూ ఆయన సింపతీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని రోజా వ్యాఖ్యానించారు. అంతే కాకుండా బీజేపీకి కొత్త అర్థాన్ని కూడా ఆమె చెప్పారు.
పురందేశ్వరి బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా అయిన తర్వాత బీజేపీ అనేది.. బాబు జనతా పార్టీలా మారిపోయిందని రోజా ఎద్దేవా చేశారు. అందుకే మరిది విషయంలో పురందేశ్వరి సైలెంట్గా ఉన్నారని రోజా విమర్శించారు. అలాగే బాబు అమరావతిని అవినీతి రాజధానిగా మార్చేశారని, సీఆర్డీఏ అంటే చంద్రబాబు రియల్ దోపీడిగా మారిపోయిందని రోజా ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్ కానీ పురందేశ్వరి కానీ ఈ అవినీతి ఆరోపణలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పవన్ ఎక్కడ దాక్కున్నారని ఆమె అన్నారు.
చంద్రబాబుకు ఐటీ నోటీసులు అందించడం వైసీపీ నాయకులకు మంచి అవకాశంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నోటీసుల పేరు చెప్పి బాబుపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పనిలో పనిగా సైలెంట్గా ఉన్నా పురందేశ్వరి, పవన్ కల్యాణ్ పైనా విరుచుకుపడేందుకు వైసీపీ నాయకులకు ఈ నోటీసులు అస్ర్తంగా మారిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.