ఏంది బాసూ.. రేవంత్ కంటే సీతక్కకు అంత క్రేజా?
వారి నిరీక్షణ ఫలించింది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు అధికారాన్ని ఇచ్చిన వేళ.. ప్రమాణస్వీకారోత్సవాన్ని గ్రాండ్ గా ఎల్ బీ స్టేడియంలో నిర్వహించారు
సగటు కాంగ్రెస్ పార్టీ అభిమానితో పాటు.. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు కోసం.. కాంగ్రెస్ కోసం.. రేవంత్ కోసం ఓటు వేసిన వారంతా గురువారం నాటి ప్రమాణస్వీకారం రోజు కోసం ఎదురుచూస్తున్నారు. వారి నిరీక్షణ ఫలించింది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు అధికారాన్ని ఇచ్చిన వేళ.. ప్రమాణస్వీకారోత్సవాన్ని గ్రాండ్ గా ఎల్ బీ స్టేడియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ తో పాటు మంత్రులంతా ప్రమాణస్వీకారాన్ని పూర్తి చేశారు.
ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం.. సీతక్కకు తెలంగాణలో ఉన్న క్రేజ్ ఎంతన్న విషయం ఎల్ బీ స్టేడియం సాక్షిగా నిరూపితమైంది. ఆ మాటకు వస్తే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయటానికి రేవంత్ వచ్చిన సమయంలోనూ కనిపించని సందడి.. సీతక్క ప్రమాణస్వీకారం చేసేందుకు వచ్చినప్పుడు చోటు చేసుకుంది.
దాదాపు ఒకటిన్నర నిమిషం కంటే ఎక్కువగా ఆమె ప్రమాణస్వీకారాన్ని చేయలేని పరిస్థితి. అంతలా స్టేడియంలోని వారంతా ఆమెకు జైజేలు కొట్టటంతోపాటు కేరింతలు కొట్టారు. చివరకు గవర్నర్ సైతం ‘.. అనే నేను’’ అంటూ మూడు సార్లు అనటమే కాదు.. ప్రమాణస్వీకారం చేయాలని చేతలతో సంకేతాలు ఇవ్వటం కనిపించింది. ఇదంతా చూసినప్పుడు సీతక్కకు ఉన్న క్రేజ్ ఎంతన్నది అర్థమవుతుంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. మంత్రులు ప్రమాణస్వీకారం చేసిన అనంతరం.. ముఖ్యమంత్రి వద్దకు వెళ్లటం.. ఆ తర్వాత గవర్నర్ కు అభివాదం చేసిన తర్వాత.. పార్టీ చీఫ్ సోనియమ్మకు.. రాహుల్ కు.. ప్రియాంకకు అభివాదం చేయటం తెలిసిందే. మిగిలిన మంత్రులకు భిన్నంగా సీతక్క ప్రమాణస్వీకారం చేసి తన వద్దకు వచ్చినంతనే.. సోనియాగాంధీ లేచి నిలబడి.. ఆమెను ఆత్మీయ ఆలింగనం చేసుకోవటం ఆసక్తికరంగా మారింది. అధినేత్రి మనసులో సీతక్కకు ఉన్న స్పెషల్ ప్రయారిటీ కనిపించింది. ఆమె తర్వాత మరో మహిళా మంత్రి కం వరంగల్ ఫైర్ బ్రాండ్ కొండా సురేఖ ప్రమాణస్వీకారం చేసి.. సోనియాగాంధీ వద్దకువచ్చి ఏదో చెప్పటం.. ఆ వెంటనే ఆమె లేచి.. కొండా సురేఖను ఆత్మీయ ఆలింగనం చేసుకోవటం గమనార్హం.
ఇదంతా ఒకఎత్తు అయితే.. కొందరు మంత్రులు ప్రమాణస్వీకారం చేసిన అనంతరం తన వద్దకు వచ్చినప్పుడు.. సోనియా పెద్దగా స్పందించకపోవటం.. కొందరికి మాత్రం ఆమె రియాక్టుకావటం చూస్తే.. మంత్రుల్లో ఎవరికి ఎంత విలువ ఉందన్న విషయం తనచేతల్లో సోనియాగాంధీ చూపించేశారని చెప్పక తప్పదు.