మా ఎమ్మెల్యే సారు ఎక్కడున్నారండీ.. గుంటూరు జనాల గగ్గోలు...!
ఏ నలుగురు కలిసినా.. ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి గురించే చర్చ సాగుతోంది
ఔను! ఇది నిజమే. మా ఎమ్మెల్యే సారు ఎక్కడున్నారండీ.. అంటూ.. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బాపట్ల నియోజకవర్గం ప్రజలు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఏ నలుగురు కలిసినా.. ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి గురించే చర్చ సాగుతోంది. వరుస విజయాలు అందించినా.. తమకు ఏమీ చేయలేక పోతున్నారనే వాదన, ఆవేదన కూడా ఈ నియోజకవర్గం ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
అంతేకాదు.. గతంలో 2014లో విజయం దక్కించుకున్నప్పుడు. ప్రతిపక్షంలో ఉన్నామని, అందుకే ఏమీ చేయలేకపోతున్నామని చెప్పిన రఘుపతి.. తర్వాత 2019లో గెలిచిన తర్వాత.. తాను డిప్యూటీ స్పీకర్ పదవి లో ఉన్నానంటూ రెండున్నరేళ్లు తమకు అందుబాటులో లేకుండా వ్యవహరించారని స్థానికులు చెబుతున్నారు. పోనీ.. ఈ పదవి పోయిన తర్వాత అయినా.. తమకు అందుబాటులో ఉండడం లేదని వారు చెబుతున్నారు.
కొన్ని రోజులు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి హాజరైనా.. తర్వాత మాత్రం ఆయన ప్రజలను పట్టించుకోవడం లేదనే టాక్ ఇటువైసీపీలోనూ వినిపిస్తోంది. ''మాకు కూడా ఆయన కనిపించడంలేదు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందో లేదో.. మాకే అర్థం కావడం లేదు'' అని కోనకు అత్యంత సన్నిహితంగా ఉండే నాయకులు కూడా చెబుతున్నారు. సీఎం జగన్ దగ్గర మంచి మార్కులే ఉన్నప్పటికీ.. ఆయన టికెట్ ఇచ్చినప్పటికీ.. ప్రజల్లో మాత్రం మంచి మార్కులు లేవని అంటున్నారు.
''ప్రజలకు ఏం చేశారు? ఇప్పటికి వరుసగా రెండు సార్లు గెలిపించారు. పాపం.. వారిని ఏమీ అనేందుకు లేదు. మా నాయకుడు ఇక్కడ కనీసం బిందెడు నీళ్లిచ్చే పని కూడా చేయలేక పోతున్నారు. ఇది ప్రతిపక్ష నేతలకు అడ్వాంటేజ్ గా మారకుండా ఉంటుందా? రేపు మేం మాత్రం ఏ మొహం పెట్టుకుని వెళ్లి .. వోటేయాలని ప్రజలను కోరతాం'' అని వైసీపీ సీనియర్ నాయకుడు.. నియోజకవర్గం కార్యకలాపాలు చూస్తున్న ఓ కీలక సామాజిక వర్గం నాయకులు వ్యాఖ్యానించారు. సో.. ఇదీ.. పరిస్థితి..!