రాత్రిళ్లు నిద్రపోని రేవంత్.. అంత మాట అనేసిందెవరంటే?
''వారిలో ఎవరికి ఎవరి మీదా నమ్మకం లేదు. వాళ్ల మంత్రుల మీద వారికి నమ్మకం లేదు. ఏ మంత్రి ఎప్పుడు.. ఎక్కడ.. ఎవరికి ఎసరు పెడతారో అర్థం కాని పరిస్థితి ఉంది.
సాధారణంగా అసెంబ్లీ ఎన్నికలు ముగిసి.. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఆర్నెల్ల పాటు రాజకీయ వాతావరణం స్తబ్దుగా ఉంటుంది. అందుకు భిన్నంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రశాంతంగా పది రోజులు పాలన చేసింది లేదు. నిత్యం ఏదో ఒక చిక్కుముడి.. సమస్య.. లేదంటే ఇష్యూతోనే సరిపోతున్న పరిస్థితి. రేవంత్ ప్రభుత్వం కొలువు తీరిన నాటి నుంచి ఏదో ఒక రాజకీయ పరిణామం చోటు చేసుకోటం తెలిసిందే.
ప్రభుత్వం కుదురుకోనప్పటికీ.. ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని.. పడిపోతుందన్న ప్రచారం పెరుగుతోంది. అదే సమయంలో లోక్ సభ ఎన్నికలు వచ్చాయి. దీంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. తమకు తోచినట్లుగా ప్రచారాలు పెరిగిపోయాయి. ఇలాంటి సవాళ్లను.. ప్రచారాల్ని తట్టుకొని పాలన చేస్తూ.. అందులో తన మార్క్ వేసేందుకు కసరత్తు చేస్తున్నారు రేవంత్ రెడ్డి. అయినప్పటికీ ఆయనపై విమర్శలు వెంటాడుతూనే ఉన్నాయి.
తాజాగా ఇదే తరహాలో విమర్శలు చేశారు బీజేపీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు. తెలంగాణ ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున పోరు జరుగుతోందన్నారు. ఎవరికి వారు సీఎం అయిపోవాలన్న ఆశ కాంగ్రెస్ నేతల్లో ఎక్కువైనట్లుగా బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. పారపాటున ఓటుకు నోటు కేసు.. లేదంటే మరేదైనా అంశం తెర మీదకు వచ్చి.. రేవంత్ స్థానం ఖాళీ అయితే పరిస్థితేంటన్నది ఆసక్తికరంగా మారిందని వ్యాఖ్యానిస్తున్నారు.
''వారిలో ఎవరికి ఎవరి మీదా నమ్మకం లేదు. వాళ్ల మంత్రుల మీద వారికి నమ్మకం లేదు. ఏ మంత్రి ఎప్పుడు.. ఎక్కడ.. ఎవరికి ఎసరు పెడతారో అర్థం కాని పరిస్థితి ఉంది. ఏ మంత్రి టార్గెట్ కారణంగా తన పదవి పోతుందన్న భయంతో రాత్రిళ్లు సీఎం రేవంత్ నిద్రపోవట్లేదట. ముఖ్యమంత్రి రేవంత్ సీటు మీద పది మంది మంత్రులు కన్నేసి పెట్టుకున్నారు. ఎవరికి ఎవరి మీదా నమ్మకం లేదు'' అంటూఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
ఈ వ్యాఖ్యలు ఇలా ఉంటే.. పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కీలక పదవుల్ని చేపట్టిన పలువురు ప్రముఖులు వెనుకా ముందు చూసుకోకుండా గులాబీ కారు దిగేసి.. హస్తం గూటికి చేరుకోవాలన్న ఆత్రుత అంతకంతకూ ఎక్కువ అవుతోంది. దీంతో.. రాజకీయం రసకందాయంలో పడింది. ఓవైపు లోక్ సభ ఎన్నికలు.. మరోవైపు టార్గెట్ గులాబీ పార్టీ అన్నట్లుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు తెలంగాణ పొలిటికల్ సీన్ ను ప్రభావితం చేస్తున్నాయి.