మైనంపల్లి రూటు ఇక అటే!
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మరోసారి అధికారంలోకి రావాలని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు.
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మరోసారి అధికారంలోకి రావాలని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలో అన్ని పార్టీల కంటే ముందుగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించారు. ఈ క్రమంలో మల్కాజిగిరి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకే సీటు లభించింది. అయితే మెదక్ నుంచి తన కుమారుడు రోహిత్ కు సీటు ఆశించిన మైనంపల్లికి నిరాశే ఎదురైంది.
ఈ నేపథ్యంలో మైనంపల్లి హన్మంతరావు.. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు లక్ష్యంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర కాక రేపాయి. హరీశ్ అంతం చూస్తానని... మెదక్ జిల్లాలో హరీశ్ ఆధిపత్యాన్ని అణగదొక్కుతానని మైనంపల్లి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత.. మైనంపల్లి వ్యాఖ్యలను ఖండించారు. బీఆర్‌ఎస్.. హరీశ్ రావుకు తోడుగా ఉంటుందని తేల్చిచెప్పారు.
మరోవైపు మైనంపల్లి హన్మంతరావు తన కుమారుడికి కావాలని ఆశిస్తున్న మెదక్ సీటు సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికే దక్కింది. హరీశ్ రావుపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మైనంపల్లిని పార్టీ నుంచి బహిష్కరిస్తారని చర్చ జరిగింది. అయితే ఇప్పటివరకు అలాంటిదేమీ జరగలేదు. మైనంపల్లి ఏం చేయబోతారో చూసి దానికనుగుణంగా ఎత్తులు వేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో మైనంపల్లి హన్మంతరావు సెప్టెంబర్ 17న కాంగ్రెస్ నేతల సమక్షంలో ఆ పార్టీలో చేరతారని చెబుతున్నారు. ఈసారి కాంగ్రెస్ అత్యున్నత విధాన నిర్ణాయక విభాగం.. సీడబ్ల్యూసీ సమావేశం హైదరాబాద్ లో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా భారీ బహిరంగ సభను కూడా కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోతోంది. ఈ కార్యక్రమంలోనే మైనంపల్లి హన్మంతరావుతోపాటు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావు కూడా బీఆర్‌ఎస్ లో చేరతారని చెబుతున్నారు.
ప్రస్తుతం మైనంపల్లి హన్మంతరావు ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజిగిరితోపాటు ఆయన తన కుమారుడికి ఆశిస్తున్న మెదక్ సీటును కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వడానికి అంగీకరించిందని సమాచారం. మరోవైపు కుటుంబంలో ఒకరికే సీటును కాంగ్రెస్ పార్టీ ఇవ్వనుందని అంటున్నారు.
తన కుమారుడికి సీటు ఇచ్చినా, ఇవ్వకపోయినా మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 17న కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీల సమక్షంలో హైదరాబాద్ లో కాంగ్రెస్ లో చేరతారని గట్టిగా ప్రచారం జరుగుతోంది.