ఆ ప్రశ్నతో బీజేపీ, కాంగ్రెస్ నేతలను ఇబ్బందిపెట్టిన కవిత!
తమ పార్టీ సీఎం అభ్యర్థి కేసీఆర్ అని కవిత తెలిపారు. మరి బీజేపీ, కాంగ్రెస్ లకు సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలని సవాల్ విసిరారు
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో గెలిచి మరోసారి అధికారంలోకి రావాలని ఆశిస్తోంది.. బీఆర్‌ఎస్ పార్టీ. ఇప్పటికే ఆ పార్టీ అధినేత వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించేశారు. మరోవైపు కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత అప్పుడే ప్రచార రంగంలోకి కూడా దూకేశారు. తాజాగా ఆర్మూరులో పర్యటించిన కవిత.. కాంగ్రెస్, బీజేపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
తమ పార్టీ సీఎం అభ్యర్థి కేసీఆర్ అని కవిత తెలిపారు. మరి బీజేపీ, కాంగ్రెస్ లకు సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలని సవాల్ విసిరారు. వ్యవసాయానికి మూడు గంటలు మాత్రమే కరెంట్ చాలంటున్న కాంగ్రెస్ కావాలా లేదా 24 గంటల నిరంతర విద్యుత్తు అందిస్తున్న సీఎం కేసీఆర్ కావాలా అన్నది రైతులు తేల్చుకోవాలన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు మీటర్ల పెట్టమంటున్నదని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్ కంపెనీలకు రూ. 15 లక్షల కోట్ల రుణమాఫీ చేసిన బీజేపీ ప్రభుత్వం రైతు రుణమాఫీకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏవేవో పెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవసాయానికి కేవలం మూడు గంటల విద్యుత్తు సరిపోతుందని అంటున్నారని గుర్తు చేశారు. వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ సరిపోతుందా అని కవిత ప్రశ్నించారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. 2014లో ఆశన్న గారి జీవన్ రెడ్డిని టీఆర్‌ఎస్ మొదటి అభ్యర్థిగా ప్రకటించామని కవిత గుర్తు చేశారు. 'ఎ ఫర్ ఆర్మూర్.. ఎ ఫర్ ఆశన్నగారి జీవన్ రెడ్డి' అని తెలిపారు.
2014లో మొదటిసారి ఎమ్మెల్యే గా గెలుపొంది జీవోల జీవన్ రెడ్డిగా పేరు తెచ్చుకున్నారని చతురోక్తులు విసిరారు. రెండో సారి 2018లో 30 వేల మెజారిటీతో ప్రజలు ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించారని గుర్తు చేశారు. ఇప్పుడు ముచ్చటగా మూడో సారి సీఎం కేసీఆర్ టికెట్ ఇచ్చారని, ఈ సారి కచ్చితంగా 60 వేల మెజారిటీ తో గెలిపించాలని కార్యకర్తలకు, ప్రజలకు కవిత విజ్ఞప్తి చేశారు.
గత ఏడాదిన్నర కాలం నుంచి జీవన్ రెడ్డి సీఎం కేసీఆర్ తోనే ఉంటున్నారని, నీడలాగా నిరంతరం సీఎంతో కలిసి పనిచేస్తున్నారని కవిత అభినందించారు. అలాగే, ఆకుల లలిత పార్టీలో చేరిన తర్వాత ఆమెను గౌరవించుకున్నామని గుర్తు చేశారు. ఆమెకు భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు ఇస్తామన్నారు. జీవన్ రెడ్డిని ఆశీర్వదించిన ఆకుల లలిత మరింత ఉన్నత స్థానంలో ఉంటారని భరోసా ఇచ్చారు.
కాంగ్రెస్ వాళ్లేమో మూడు గంటల కరెంట్ చాలంటే..బీజేపీ వాళ్లేమో మోటార్లకు మీటర్లను పెట్టమంటున్నారని కవిత మండిపడ్డారు. బీజేపీ మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొస్తే వాటిపై జరిగిన పోరాటంలో 850 మంది రైతులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మనకు దోస్తులు కాదన్నారు. ప్రజలతో కొనసాగే ఒకే ఒక వ్యక్తి సీఎం చంద్రశేఖర్ రావు అని కల్వకుంట్ల కవిత కొనియాడారు.
రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా 100కు పైగా ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంటామని కవిత ధీమా వ్యక్తం చేశారు. మరోమారు బీఆర్‌ఎస్ పార్టీని ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రైతుల కోసం నిలబడ్డ కేసీఆర్ కావాలా లేక కాంగ్రెస్, బీజేపీ నేతలు కావాలా అని ప్రశ్నించారు.
కవిత తాజా వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ ఎలా స్పందిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఈ రెండు పార్టీల్లో ఎన్నికల ముందుగానే సీఎం అభ్యర్థులను ప్రకటించే సంస్కృతి లేదు. ఎన్నికల్లో గెలిచాక ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సీట్లు సాధిస్తే ఎమ్మెల్యేల అభిప్రాయంతోనే సీఎంను ఎంపిక చేస్తారు. ఈ నేపథ్యంలో కవిత వ్యాఖ్యలకు ఈ రెండు పార్టీలు ఎలాంటి కౌంటర్లు ఇస్తాయో వేచిచూడాలి.