అస్వస్థతతో ప్రత్యర్థి.. ఫోన్ చేసి పరామర్శించిన మోడీ
మిగిలిన రాజకీయ అధినేతలకు భిన్నంగా వ్యవహరించే విషయంలో మోడీ టాలెంట్ వేరు.
మిగిలిన రాజకీయ అధినేతలకు భిన్నంగా వ్యవహరించే విషయంలో మోడీ టాలెంట్ వేరు. ఆయన్ను అంచనా వేయటం సాధ్యం కాదని అంటారు కానీ.. కొన్ని విషయాల్లో మాత్రం ఆయనేం చేస్తారో ఇట్టే అర్థమైపోతుంటుంది. మిగిలిన వారి విషయంలో ఎలా ఉన్నా.. ప్రత్యర్థి విషయంలో మోడీ మాష్టారు ఎంత కఠినంగా ఉంటారన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే సమయంలో సదరు ప్రత్యర్థి అనారోగ్యం బారిన పడినా.. అస్వస్థతకు గురైనా ఆయన మనసు ఊరుకోదు.
ప్రత్యర్థి స్వస్థత చేకూరే వరకు వారిని పరామర్శిస్తుంటారు. అదేదో నాలుగు గోడల మధ్య ఫోన్ మాట్లాడటంతో సరి పెట్టకుండా.. ఆ అంశాల్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవటం కనిపిస్తుంది. తాజాగా అలాంటి చర్యనే చేపట్టారు ప్రధాని మోడీ. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. ఒక సభలో ప్రసంగిస్తున్న వేళ అస్వస్థతకు గురయ్యారు.
దీనికి సంబంధించిన సమాచారం అందుకున్న ప్రధాని మోడీ వెంటనే.. ఆయనకు ఫోన్ చేశారు. ఖర్గే ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఖర్గే త్వరగా కోలుకోవలని ప్రధాని ఆకాంక్షిస్తున్న విషయాన్ని ప్రభుత్వ వర్గాలు వెల్లడించటం గమనార్హం. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. అస్వస్థతకు కాస్త ముందుగా.. మోడీ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
తాను ఇంకా ఎనభైలలోనే ఉన్నానని.. తానిప్పుడే చనిపోనన్న ఖర్గే.. ప్రధానమంత్రి పదవి నుంచి మోడీని దించే వరకు తాను బతికే ఉంటానని వ్యాఖ్యానించారు. జమ్ముకశ్మీర్ లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరువా జిల్లాలో ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో ఖర్గే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సొమ్మసిల్లి పడ్డారు.
ఇదే సమయంలో ఆయన పక్కనే ఉన్న భద్రతా సిబ్బంది.. సహచరులు ఆయన్ను పట్టుకొని నీళ్లు తాగించారు. సేదతీరిన అనంతరం ఆయన మళ్లీ తన స్పీచ్ ను కంటిన్యూ చేశారు. ఈ సందర్భంగానే ప్రధాని మోడీ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యుల టీం.. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లుగా పేర్కొన్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి.