జాతీయ విపత్తుగా మోడీ ప్రకటిస్తారా ?
ఏపీలో కనీ వినీ విపత్తు సంభవించింది. అసలే మూలిగే నక్క అన్నట్లుగా ఉన్న పరిస్థితిలో తాటిపండు మాదిరిగా ప్రళయం వచ్చి పడింది.
ఏపీలో కనీ వినీ విపత్తు సంభవించింది. అసలే మూలిగే నక్క అన్నట్లుగా ఉన్న పరిస్థితిలో తాటిపండు మాదిరిగా ప్రళయం వచ్చి పడింది. ఏపీకి వచ్చిన వరదలు మరీ ముఖ్యంగా ఏపీ వాణిజ్య రాజధానిగా పేరున్న బెజవాడ నడ్డి విరిగేలా వచ్చి పడిన భారీ వరదలతో అంతా అతలాకుతలం అవుతోంది.
ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ ఆస్తులు అన్నీ కూడా వరదలో కొట్టుకుని పోయాయి. మళ్లీ అంతా మామూలు పరిస్థితికి రావాలి అంటే చాలా కాలమే పట్టేట్లు ఉంది. అందుకే చంద్రబాబు ఈ వరదలను ఆ బీభత్సాన్ని చూసి జాతీయ విపత్తు అని అన్నారు. ఆ విధంగా గుర్తించమని కేంద్రాన్ని ఆయన కోరారు. ఆయన వరదల తరువాత మొత్తం పరిస్థితిని వివరిస్తూ ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడారు.
ఆదుకోవాలని కూడా విన్నపం చేశారు. ఈ నేపధ్యంలో ఏపీకి కేంద్ర బృందం వస్తోంది. ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ బృందం మొతం తిరిగి నష్టాన్ని అంచనా వేస్తుంది. ఆ మీదట కేంద్రానికి నివేదిక ఇస్తుంది. ఈ బృందంలో నిపుణులు కూడా ఉంటారు.
ఇదిలా ఉంటే వరద ఇంకా ఉండగానే కేంద్ర బృందం రావడం అంటే మంచి పరిణామమే. పూర్తి వాస్తవాలు అన్నీ వారికి కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తాయి. అయితే ఏపీ సీఎం కోరినట్లుగా జాతీయ విపత్తుగా కేంద్రం ప్రకటిస్తుందా అన్న చర్చ అయితే ఉంది.
ఇక చంద్రబాబు అయితే ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షానే ఏపీలో పర్యటించమని కోరారు. భారీ వరదలతో ఏపీ ఎంత దెబ్బ తిన్నది అన్నది కళ్లారా చూసేందుకు అయినా ఏపీకి రావాలని సీఎం చంద్రబాబు కోరారు. ఏరియల్ సర్వే చేయాలని కూడా వినతి చేశారు.
మరి హోం మంత్రి వస్తారా అన్నది కూడా చూడాల్సి ఉంది. అయితే ఏపీలో వరద పరిస్థితి మీద తాము పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తున్నామని కేంద్రం చెబుతోంది. ఏపీని అన్ని విధాలుగా ఆదుకుంటామని అంటోంది. ఇక జాతీయ విపత్తు అంటే ఏపీ ఆ విధంగా నిబంధనలను సరిపోతుందా ఏపీలో వరదలు జాతీయ విపత్తు కిందకు వస్తాయా అన్నది కూడా కేంద్రం చూస్తుంది అని అంటున్నారు.
ఏది ఏమైనా కేంద్రం మీదనే ఏపీ పూర్తి ఆశలు పెట్టుకుంది. వేల కోట్ల రూపాయాలు నష్టం వాటిల్లింది. బాధితులకు ముందు ఎంతో కొంత న్యాయం చేయాలన్నా కేంద్రం ఆర్థికంగా ఆదుకోవాల్సి ఉంది. ఇప్పటికే ఏపీ అప్పుల కుప్పలా ఉంది. ఈ సమయంలో విరుచుకుని పడ్డ భారీ జల ప్రళయం తో ఏపీ పూర్తిగా చతికిలపడింది అని అంటున్నారు.
కేంద్ర బృందాన్ని తొందరగా పంపించిన కేంద్రం అంతే తొందరగా ఏపీకి నిధులు ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే ఏపీలో వరద పరిస్థితులపై సత్వరమే స్పందించారంటూ ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.
అదే సమయంలో వరద బాధితులకు తక్షణ సాయం కోసం కేంద్రం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం రాకను స్వాగతిస్తున్నామని, వారు చేసే సిఫారసుల కోసం ఎదురు చూస్తున్నామని వెల్లడించారు. వరద బాధితులకు సత్వర ఉపశమనం కలిగించేందుకు వస్తున్న కేంద్ర బృందానికి ఏపీ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు.
ఇక చూస్తే కనుక రాష్ట్రంలోని వరద ప్రభావిత జిల్లాలైన కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు తదితర జిల్లాల్లో కేంద్ర బృందం గురువారం పర్యటించనుంది. కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వంలోని కేంద్ర బృందం వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి వరద నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి వరద బాధితులతో నేరుగా మాట్లాడుతుందని అధికార వర్గాలు తెలిపాయి.
ఇక ఈ బృందంలో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సలహాదారు కల్నల్ కేపీ సింగ్, సెంట్రల్ వాటర్ కమిషన్ డైరెక్టర్ సిద్ధార్థ్ మిత్ర, సీడబ్ల్యూసీ హైదరాబాద్ ఎస్ఈ రమేష్ కుమార్, ఎన్డీఎస్ఏ సదరన్ జోన్ డైరెక్టర్ ఆర్ గిరిధర్ లతో కూడిన కేంద్ర బృందం అలాగే, ఎన్డీఆర్‌ఎఫ్ 10వ బెటాలియన్ కమాండెంట్ వీవీఎన్ ప్రసన్న వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్నారు.