ఫొటో స్టోరీ... పవన్ ని చూసి మురిసిపోతోన్న మోడీ!

ఇది పవన్ మేనియానా.. లేక, పవన్ పై మోడీకున్న ఇష్టం, అభిమానం.. అంతకు మించి హోపా అనేది మాత్రం తెలియదు!

Update: 2024-10-18 05:18 GMT

వేదిక ఏదైనా.. ప్రదేశం ఎక్కడైనా.. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ని చూస్తే ప్రధాని మోడీ ముఖంలో చిక్కటి చిరునవ్వు కనిపిస్తుంటుంది. పవన్ ని కలిసి, కరచాలనం సమయంలో.. మోడీ మనసారా, సంతృప్తిగా నవ్వుతున్నట్లుగా కనిపిస్తుంటారు. ఇది పవన్ మేనియానా.. లేక, పవన్ పై మోడీకున్న ఇష్టం, అభిమానం.. అంతకు మించి హోపా అనేది మాత్రం తెలియదు!


అవును... వేదిక ఏదైనా, సందర్భం మరేదైనా.. పవన్ కల్యాణ్ - మోడీ కలిసిన ఫోటోలు ఏవైనా ఇద్దరి ముఖ్యాల్లో చిక్కటి చిరునవ్వులతోనే ఉంటుంటాయి. ఆ సమయంలో గౌరవంతో కూడిన బాడీ లాంగ్వేజ్ లో పవన్ ఉంటే.. తనకున్న అభిమానంతో కూడిన చనువుతో మోడీ బాడీ లాంగ్వేజ్ ఉన్నట్లు కనిపిస్తుంటుంది. తాజాగా మరోసారి అలాంటి దృశ్యమే కనిపించింది. ఈ పిక్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.


చండీగఢ్ లో గురువారం ఎన్డీయే నేతల మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్డీయే కూటమికి చెందిన ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు హాజరయ్యారు. వీరిద్దరూ ప్రధానితో చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

ఈ కార్యక్రమంలో వికసిత్ భారత్ - 2047పై చర్చల్లో భాగంగా.. ఆత్మనిర్భర్ భారత్, పేదరికం లేని సమాజం, పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన, తక్కువ ధరకే విద్యుత్, జనాభా నిర్వహణ, నైపుణ్యం ఉన్న మానవ వనరులు, నదుల అనుసంధానం, సాంకేతికతల సమ్మేళనం మొదలైన విషయాలపై చర్చించారు.

ఈ సందర్భంగా... మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ఒకే ఫ్రేమ్ లో ఉన్న ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. మీటింగ్ హాలులో పవన్ ని చూసిన మోడీ ఆయనతో చిరునవ్వులు చిందిస్తూ ఆప్యాయంగా మాట్లాడుతున్నట్లు కనిపించింది. పక్కనే చంద్రబాబు కూడా ఉండటంతో ముగ్గురి మధ్యా ఆసక్తికర సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది.

మరోపక్క ఏపీలో బీజేపీకి భవిష్యత్ ఆశాకిరణం పవన్ కల్యాణ్ అనే చర్చా ఇటీవల బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది! ఏది ఏమైనా... చంద్రబాబుపై మోడీకి ఉన్న గౌరవం.. పవన్ పై ఉన్న అభిమానం, ఇష్టం.. వెరసి అవి ఏపీ అభివృద్ధికి కేంద్రం నుంచి అందే సహాయసహకారాలకు ఉపయోగపడాలని ఆంధ్రులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ మాత్రం నెట్టింట వైరల్ గా మారుతున్నాయి!

Tags:    

Similar News