మోడీ3.0 బుల్లెట్ ట్రైన్ ను సీన్లోకి తీసుకొచ్చేశారుగా?
ఇందులో భాగంగా తాను అనుకున్నది అనుకున్నట్లుగా జరిగేందుకు తాజాగా ఆయన సర్కారు బుల్లెట్ ట్రైన్ ఎపిసోడ్ ను తెర మీదకు తీసుకొచ్చింది.
పక్కా స్క్రిప్టు అన్న మాటకు నిలువెత్తు రూపంగా నిలుస్తారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. తాను చేయాల్సిన పనుల్ని పుస్తకంలో రాసుకున్న చందంగా ఆయన ఒకటి తర్వాత ఒకటి చొప్పున చేసుకుంటూ పోవటం ఒక ఎత్తు అయితే.. అందుకు తగ్గట్లే పరిస్థితులు కూడా కలిసి రావటం ఆయనకు మాత్రమే చెల్లిందని చెప్పాలి. సార్వత్రిక ఎన్నికలు వారాల్లోకి వచ్చేసిన వేళలో.. అందుకు సిద్ధమవుతున్న మోడీ సర్కారు తన ప్లాన్ లో భాగంగా ఒక్కొక్క పని చేసుకుంటూ ముందుకు వెళుతోంది.
ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావటం ద్వారా హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా చరిత్రలో నిలిచిపోవాలని భావిస్తున్న నరేంద్ర మోడీ.. అందుకు తగ్గట్లే పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. అంతేకాదు.. హ్యాట్రిక్ ప్రధానిగా ఎన్నికయ్యే వేళలో మరోఅరుదైన రికార్డుకు గురి పెట్టినట్లుగా తెలుస్తోంది. 400 సీట్లను తమ కూటమి గెలుచుకోవటంతో పాటు.. ఇందిరమ్మ హయాంలో అత్యధిక సీట్లు సాధించిన రికార్డును బ్రేక్ చేయాలన్నది ఆయన లక్ష్యంలో అతి ముఖ్యమైనదిగా చెబుతున్నారు.
ఇందులో భాగంగా తాను అనుకున్నది అనుకున్నట్లుగా జరిగేందుకు తాజాగా ఆయన సర్కారు బుల్లెట్ ట్రైన్ ఎపిసోడ్ ను తెర మీదకు తీసుకొచ్చింది. భారత ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న బుల్లెట్ ట్రైన్స్ కు సంబంధించిన ప్రాజెక్టు ఇప్పటికే మొదలై.. చకచకా పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే. గంటకు 350కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ ట్రైన్ పట్టాల మీద పరుగులు తీస్తే బోలెడంత సమయం ఆదా అవుతుంది. దీని కోసం దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇలాంటి వేళలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న బుల్లెట్ ట్రైన్ కు సంబంధించిన ఒక వీడియోను ట్వీట్ చేశారు. అదిప్పుడు వైరల్ గా మారింది. గంటకు 320 కి.మీ. వేగంతో దూసుకెళ్లే ట్రైన్ ఎలా ఉంటుందో తెలియజేయటంతో పాటు.. దాని నిర్మాణంలో ఉన్న క్లిష్టత కళ్లకు కట్టినట్లుగావివరించేలా వీడియోను కట్ చేశారు. మోడీ3.0 టార్గెట్ లో భాగంగా ఈ వీడియోను విడుదల చేశారని చెప్పాలి.
ముంబయి -అహ్మదాబాద్ మధ్యనున్న 508 కి.మీ. దూరాన్ని కవర్ చేసే ఈ మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ పుణ్యమా అని ప్రయాణ సమయం కేవలం 2 గంటలు కానుంది. బుల్లెట్ ట్రైన్ ట్రాక్ కోసం 24 రివర్ బ్రిడ్జిలు.. 28 స్టీల్ బ్రిడ్జ్ లు.. 7 పర్వత ప్రాంతాల్లో టన్నెల్స్.. 7 సముద్ర మార్గాన టన్నెల్స్ తో పాటు మొత్తం 12 స్టేషన్ల నిర్మాణం సాగుతోంది. ‘‘మోడీ 3.0లో బుల్లెట్ రైలు కోసం వెయిట్ చేయండి’’ అంటూ కేంద్ర మంత్రి చేసిన ట్వీట్ లో భాగంగా బుల్లెట్ ట్రైన్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
మన దేశంలో మొదటి బుల్లెట్ ట్రైన్ రైలు గుజరాత్ లోని బిలిమోరా - సూరత్ మధ్య ఉన్న 50కి.మీ. దూరానికి ఆగస్టు 2026 నాటికి పూర్తి అవుతుందని అంచనా వేస్తున్నారు. రైల్వే కార్యకలాపాలను ప్రారంభించే సమయానికి రోజుకు 70 ట్రిప్పులతో 35 బుల్లెట్ రైళ్లను నడపాలన్నది ప్లాన్ గా చెబుతున్నారు. 2050 నాటికి ఈ సంఖ్యను 150కు పెంచాలన్నది లక్ష్యం. దేశంలోని మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం రూ.1.08 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఆగస్టు 2026 నాటికి సూరల్ - బిలిమోరా మధ్యనున్న 63 కిమీ దూరంలో ట్రయల్ రన్ ను చేపట్టాలన్న లక్ష్యంగా పనులు జరుగుతున్నాయి. అంటే.. మోడీ 3.0 బుల్లెట్ ట్రైన్ తో దూసుకెళ్లనున్నదన్న మాట.