మోడీ సార్ మాటలకు అర్ధాలే వేరు నా ?

ఒక వైపు చూస్తే ఎన్డీయే కూటమికి నాలుగు వందల సీట్లకు పైగా రావాలన్నది బీజేపీ ఎప్పటి నుంచో పాడుతున్న పాట.

Update: 2024-05-26 15:30 GMT

ఒక వైపు చూస్తే ఎన్డీయే కూటమికి నాలుగు వందల సీట్లకు పైగా రావాలన్నది బీజేపీ ఎప్పటి నుంచో పాడుతున్న పాట. ఈ బిగ్ నంబర్ ఉంటే కనుక దేశాన్ని 2047 నాటికి ఎక్కడికో తీసుకుని వెళ్తామని చెబుతున్నారు. బీజేపీకి నాలుగు వందలు సీట్లు ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మోడీ చెబుతున్నారు.

కౌంటింగ్ అన్నది లాంచనమని జూన్ 4న మరోసారి బీజేపీ సర్కారు కేంద్రంలో కొలువుదీరడం ఖాయమని నరేంద్ర మోదీ అంటూ వస్తున్నారు. ఇప్పటికే ముగిసిన ఆరు దశల ఎన్నికల పోలింగ్‌లో దేశం ఈ మేరకు నిర్ణయించిందని అంటున్నారు. ఎన్డీయే కూటమి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ధీమా వ్యక్తం చేశారు. సదుద్దేశాలు, విధానాల కారణంగా ఎన్డీయే ప్రభుత్వాన్ని మూడోసారి ఏర్పాటు చేయాలని దేశం నిర్ణయించుకుందని ఆయన వ్యాఖ్యానించారు.

అదే టైంలో ఇండియా కూటమి మతపరమైనదిగా, కులపరమైనదిగా దేశం అర్థం చేసుకుందని ప్రధాని మోదీ ఆరోపించారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించేందుకు గాను రాజ్యాంగాన్ని మార్చాలని వారు నిర్ణయించుకున్నారని మోదీ ఆరోపించారు. ఇలా విపక్షాల మీద తీవ్ర విమర్శలు చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న నరేంద్ర మోడీ ఇంటర్వ్యూలలో మాత్రం బలమైన ప్రతిపక్షం కావాలని కోరుకుంటున్నట్లుగా చెబుతున్నారు.

దేశలో గట్టి విపక్షం లేకపోవడమే తనకు అదే ఒక వెలితిగా ఉందని కూడా అంటున్నారు. 2014 నుంచి ఈ రోజు వరకూ బలమైన ప్రతిపక్షం లేకపోవడం బాధాకరం అని ఆయన చెప్పుకొస్తున్నారు. ప్రస్తుత ప్రతిపక్షం అంటే కాంగ్రెస్ తమ ప్రభుత్వానికి ఎన్నడూ ఉపయోగపడలేదని ఆయన విమర్శించారు. దేశ ప్రయోజనాలను కోరి తీసుకున్న అనేక నిర్ణయాలను రాజకీయ లబ్ది కోసం వ్యతిరేకించింది అని ఆయన అంటున్నారు.

అదే సమయంలో ప్రతిపక్షాలు తనకు శత్రువులు కాదు అని మోడీ చెప్పడం విశేషం. తాను ప్రతిపక్షాలతో కలసి పనిచేయాలని చూస్తానని వారిని ఏ మాత్రం తక్కువ అంచనా వేయడం లేదని అన్నారు. దేశాన్ని డెబ్బై ఏళ్ల పాటు పాలించిన వారి నుంచి ఏదైనా మంచిని గ్రహించేందుకే చూస్తాను అని మోడీ అంటున్నారు.

ఇలా ప్రతిపక్షం బలంగా ఉండాలని కోరుకుంటున్న మోడీ మరో వైపు వారిని ఏ వంద సీట్లకో పరిమితం చేయాలని చూడడం ఏమిటి అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. ఎన్డీయేకు 400 కి పైగా ఎంపీలు వస్తే వందాకు పై సీట్లతోనే విపక్షం ఉండాలి. అపుడు గట్టి ప్రతిపక్షం ఎలా వస్తుందో మోడీయే చెప్పాలని అంటున్నారు.

పార్లమెంట్ లో ఉన్న మొత్తం సీట్లలో ఎనభై శాతం పైగా ఎన్డీయే కైవశం చేసుకోవాలని ఆరాటపడుతూ విపక్షం బలంగా ఉండాలని చెప్పడం వెనక ద్వంద్వ నీతి లేదా అని ఇండియా కూటమి నేతలు విమర్శిస్తున్నారు. నిజంగా మోడీ విపక్షాలు బలంగా ఉండాలని చూస్తే పార్లమెంట్ లో వారిని నియంత్రించే వైఖరిని మానుకోవాలని అంటున్నారు.

ఏకంగా రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వం మీద అనర్హత వేటు వేయించిన తీరుని కూడా గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వానికి మద్దతుగా విపక్షాలు ఎందుకు ఉంటారు అన్నది కూడా ఇండియా కూటమి నుంచి వస్తున్న మరో ప్రశ్న. విపక్షాలు ప్రభుత్వ విధానాలు విమర్శిస్తే రాజకీయ లబ్ది కోసమే అని ప్రచారం చేయడం సమంజసం కాదని అంటున్నారు.

విపక్షాలు శత్రువులు కాదు అన్న వైఖరిని బీజేపీ తీసుకుంటే గడచిన రెండు లోక్ సభలలో బీజేపీ తీరు మరోలా ఉండేది కదా అని అంటున్నారు. ఏది ఏమైనా మోడీ బలమైన ప్రతిపక్షం కావాలి అన్న దానికి అర్ధాలు వేరులే అన్నట్లుగానే ఉందని అంటున్నారు నిజానికి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం బలంగా ఉండాలి. అలాగే అధికార పక్షానికే మొత్తం సీట్లు అప్పగించకూడదు.

అలా అయితేనే బ్యాలెన్స్ గా ఉంటుంది. అపుడే ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయి. కానీ తమకు బండ మెజారిటీ ఇవ్వాలని అధికార పక్షాలు కోరుకుంటూ విపక్షాలను తగ్గించాలని చూస్తున్నాయి. కానీ మాటవరసకు మాత్రం బలమైన విపక్షం కావాలని నినదిస్తున్నాయని అంటున్నారు. అయితే ఈసారి మాత్రం బలమైన విపక్షమే కేంద్రంలో వస్తుందని అంటున్నారు. ఇండియా కూటమి అధికార పక్షంలోకి వచ్చినా బీజేపీ బలమైన విపక్షం అవుతుందని వారు అంటున్నారు. చూడాలి మరి మోడీ సార్ మాటలకు అర్థాలు ఏమిటి అన్నది.

Tags:    

Similar News