మొహమాటం లేదు.. ముక్కుమీద గుద్దినట్టు చెప్పేసిన మోడీ!
ఎలాంటి మొహమాటం లేదు.. ఎలాంటి జంకూ లేదు. దాపరికం అంతకన్నాలేదు.
ఎలాంటి మొహమాటం లేదు.. ఎలాంటి జంకూ లేదు. దాపరికం అంతకన్నాలేదు. అంతా ఓపెన్. ఇదీ.. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ అవలంభిస్తున్న తీరు. సార్వత్రిక ఎన్నికల నాలుగు దశల పోలింగ్ కు ముందు.. తర్వాత.. ఆయన స్వరంలో మార్పులు కనిపిస్తున్నాయి. ఎన్నికల పోలింగ్ ప్రారంభానికి ముందు.. కొన్నికొన్ని విషయాలపై పెద్దగా స్పందించని మోడీ ఆయన పరివారం.. నాలుగు దశల పోలింగ్ తర్వాత.. ఏం జరిగిందో ఏమో.. అంతా ఓపెన్ అయిపోతున్నారు. ముఖ్యంగా ఐదో దశ(సోమవారం) పోలింగ్ జరుగుతున్న క్రమంలో ప్రధానినరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాము ఎన్నికల వేళ ఇచ్చిన మేనిఫెస్టోకు కట్టుబడి ఉంటామని మోడీ చెప్పారు. అంతేకాదు.. మతపరమైన రిజర్వేషన్లను ఎట్టి పరిస్థితిలోనూ కొనసాగించేది లేదన్నారు. ``రాజ్యాంగానికి వ్యతిరేకంగా మేం వెళ్లలేం. మీరే చెప్పండి. రాజ్యాంగంలో మత పరమై న రిజర్వేషన్లు ఎక్కడ ఉన్నాయి. దీనినే మేం వద్దంటున్నాం. మేం రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నామని చెప్పడానికి ఇంత కన్నా రుజువు ఏం కావాలి. రాజ్యాంగాన్ని మేం కాదు..కాంగ్రెస్ పరివార పార్టీలు(కుటుంబ పార్టీలు) అవహేళన చేస్తున్నాయి. మేం రాజ్యాంగాన్ని నెత్తిన పెట్టుకుంటున్నాం`` అని మోడీ తనదైన వివరణ ఇచ్చారు.
అంతేకాదు.. జమిలి ఎన్నికలపైనా ఆయన స్పందించారు. ``ఎస్. జమిలి ఎన్నికలు తప్పవు. మేం అధికారంలోకి వస్తే.. ఖచ్చితంగా చేయాల్సిన వాటిలో ఇది కూడా ఉంది. దీనివల్ల ప్రజల సమయం, డబ్బులు కూడా పొదుపవుతాయి. ఇప్పుడు చూడండి ప్రతి సంవత్సరం ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. దీనివల్ల పనులు నిలిచిపోయి.. ప్రభుత్వ కార్యక్రమాలు ఆగిపోతున్నాయి. అందుకే.. మేం వస్తే.. జమిలి ఎన్నికలకు అడుగులు పడతాయి`` అని మొహమాటంలేకుండా చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ పార్టీకి ఒక విధానం అనేది లేదన్న మోడీ.. చిన్నా చితకా పార్టీలను వెంటేసుకుని.. దేశాన్నితిరోగమనంలోకి నడిపించేం దుకు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి, ఆ కూటమికి తగిన బుద్ధి చెబుతారని విమర్శించారు. వచ్చేది ఎన్డీయే కూటమి ప్రభుత్వమేనని.. వచ్చేవి 400 సీట్ల పైమాటేనని.. ఈ విషయంలో ప్రజలే సాక్ష్యమని మోడీ చెప్పుకొచ్చారు. ``ఎక్కడికి వెళ్లినా.. ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన ఉంది. ఈ దేశ బిడ్డను(మోడీ) మళ్లీ గెలిపించుకోవాల ని.. ఈ దేశాన్నిప్రపంచ పటంలో ముందుంచేవారిని ఎన్నుకోవాలని వారు కోరుకుంటున్నారు. అందుకే మేం వస్తున్నామని చెబుతున్నాం`` అని మోడీ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఓ జాతీయ ఛానెల్‌కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.