మల్కాజ్ గిరి రోడ్ షోలో ఒక్క మాట మాట్లాడని మోడీ.. అందుకేనా?
అందుకు తగ్గట్లే రెండు ప్రాంతాల్లో ప్రధాని మోడీ మాట్లాడేందుకు వీలుగా వేదికల్ని నిర్మించారు.
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఒక రోజు ముందుగా హైదరాబాద్ మహానగరంలోని మల్కాజ్ గిరిలో రోడ్ షోలో పాల్గొన్నారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఒకటిన్నర కిలోమీటర్ల నిడివి ఉన్న మార్గాన్ని ఆయన తన రోడ్ షో కోసం వినియోగించారు. ఈ క్రమంలో ఆయన ఒకచోట తప్పనిసరిగా మాట్లాడతారన్న ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్లే రెండు ప్రాంతాల్లో ప్రధాని మోడీ మాట్లాడేందుకు వీలుగా వేదికల్ని నిర్మించారు.
అయినప్పటికీ ప్రధాని మోడీ మాత్రం నోటి విప్పి ఒక్క మాట అంటే ఒక్క మాట మాట్లాడలేదు. మల్కాజ్ గిరికి చెప్పిన షెడ్యూల్ కంటే ఆలస్యంగా చేరుకున్నారు. తన కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు అభివాదం చేసుకుంటూ నెమ్మదిగా ముందుకు సాగారు. మోడీ.. మోడీ అంటూ అక్కడకు చేరిన జనసందోహం నినాదాలు చేసింది. మల్కాజిగిరి మిర్జాలగూడ నుంచి మొదలైన ఈ రోడ్ షో మొత్తంగా 43 నిమిసాల పాటు సాగింది.
బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న శుక్రవారం సాయంత్రం 5.40 గంటలకు చేరుకున్న ఆయన రోడ్ షో ప్రారంభ స్థలి వద్దకు 6.16 గంటలకు చేరుకున్నారు. వెంటనే రోడ్ షోను షురూ చేశారు. అదే సమయంలో ఎమ్మెల్సీ కవిత అరెస్టు అంశం హాట్ టాపిక్ గా మారింది. ప్రధాని మోడీ రోడ్ షోకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న జూబ్లిహిల్స్ లోని కవిత నివాసంలో ఆమెను అరెస్టు చేసి.. ఢిల్లీకి తరలించేందుకు వీలుగా ఏర్పాట్లు సాగుతున్నాయి.
సరిగ్గా 6.59 గంటలకు ప్రధాని మోడీ రోడ్ షో ముగిసింది. సరిగ్గా అదే సమయంలో.. ఇటువైపు కవితను కారులో ఎక్కించి ఎయిర్ పోర్టుకు చేరుకున్న పరిస్థితి. హైదరాబాద్ లో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారని చెబుతున్నారు. రోడ్ షోలో ఎక్కడ మాట్లాడినా ఆయన బీఆర్ఎస్ అధినేత మీదా.. కేసీఆర్ కుటుంబం మీదా మాట్లాడాల్సి ఉంటుంది. అలా జరిగితే.. చోటు చేసుకునే పరిణామాలు అంచనాలకు భిన్నంగా సాగే వీలుంది. అందుకే.. అలాంటి అవకాశం ఏదీ ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయి.. కేవలం ప్రజలకు అభివాదం చేయటంతోనే రోడ్ షోను పూర్తి చేసి ఉంటారని చెబుతున్నారు. మోడీ మాట్లాదతారని భావించిన కమలనాథులు.. అభిమానులు.. కార్యకర్తలు మోడీ ఏమీ మాట్లాడకుండానే రోడ్ షోను పూర్తి చేయటంపై నిరాశకు గురయ్యారు.