అప్పట్లోనే ట్రైలర్ చూపించాం.. ఇప్పుడు సినిమా చూపిస్తాం!
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ కు ట్రైలర్ చూపించామని.. తాజా ఎన్నికల్లో ఆయనకు సినిమా చూపిస్తామని కేసీఆర్ వ్యాఖ్యానించటం గమనార్హం.
తెలంగాణ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు కానీ.. తర్వాత కానీ ఆ మాటకు వస్తే పది రోజుల క్రితం కాని లేని జోష్.. తాజాగా కమలనాథుల్లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. మొన్నటివరకు తెలంగాణ అధికారపక్షం బీఆర్ఎస్ కు బి టీంగా ఆరోపణలు ఎదుర్కోవటం.. క్యాడర్ సైతం కమలనాథుల వెంట ఉండేందుకు వెనుకాడటంతో పాటు.. పలు సమస్యలు ఎదురైన పరిస్థితి. ఇదిలా ఉంటే.. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో.. ప్రచార గడువు ముగియటానికి వారం ముందునుంచి బీజేపీఅధినాయకత్వం తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టటం.. పార్టీకి చెందిన అధినాయకత్వం పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రాన్ని మొహరించటం చూస్తే.. పక్కా ప్లాన్ తోనే ఇదంతా చేస్తున్నారా? అన్న సందేహం కలుగక మానదు.
సోమవారం మహబూబ్ నగర్.. కరీంనగర్ లో జరిగిన సకల జనుల విజయ సంకల్ప సభల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారటేమ కాదు.. సంచలనంగా మారింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను నేరుగా గురి పెట్టి మోడీ నోటి నుంచి వచ్చిన మాటలు నిప్పు రవ్వల్లా మారాయి. అంతేకాదు.. ఆ మధ్య జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ కు ట్రైలర్ చూపించామని.. తాజా ఎన్నికల్లో ఆయనకు సినిమా చూపిస్తామని కేసీఆర్ వ్యాఖ్యానించటం గమనార్హం.
అంతేకాదు.. ప్రస్తుత ఎన్నికలతో అధికార బీఆర్ఎస్ ఆట ముగుస్తుందన్న మాట చెప్పిన నరేంద్ర మోడీ.. తొలిసారి తెలంగాణలో బీజేపీ సర్కారు ఏర్పడుతోందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అవినీతిపరుల్ని జైలుకు పంపాలన్న సంకల్పాన్ని తీసుకున్నట్లుగా వెల్లడించారు.
"భూములు.. సాగునీటి ప్రాజెక్టులు.. మద్యం స్కాంలకు పాల్పడిన వారు.. పేపర్ లీకేజీ దోషులు.. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని చెప్పి మోసం చేసిన వారిని జైలుకు పంపుతాం" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ను తమ దరిదాపుల్లెకి కూడా రానివ్వమన్న మోడీ.. ‘బీజేపీ బలం తెలిసి కేసీఆర్ మాతో స్నేహం చేయాలనుకున్నారు. ఢిల్లీకి వచ్చి ఆయన కొడుకును సీఎంను చేస్తే ఎన్డీయేలో చేరుతామని చెప్పారు. మేం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఉండబోమని చెప్పాం. అప్పటి నుంచి నన్ను.. మా పార్టీని గులాబీ నేతలు టార్గెట్ చేసుకున్నారు" అని మండిపడటం గమనార్హం.
సంప్రదాయం.. సాంకేతికతల మేళవింపుగా ఉన్న తెలంగాణను కేసీఆర్ మూఢనమ్మకాల రాష్ట్రంగా మార్చారన్న మోడీ.. "సచివాలాయాన్ని కూల్చి ప్రజాధనం వేస్టు చేశారు. నీళ్లు.. నిధులు.. నియామకాల నినాదంతో తెలంగాణలో అధికారాన్ని దక్కించుకున్న కేసీఆర్.. రాష్ట్రానికి కన్నీళ్లు.. మోసాలు.. నిరుద్యోగాన్ని మిగిల్చారు. అవినీతి చేసిన బీఆర్ఎస్ నేతలకు తగిన శిక్ష పడాలా? వద్దా? ఇలాంటి ప్రభుత్వాన్ని పేదలంతా కలిసి శిక్షించాలి. మద్యం కేసు దర్యాప్తును వేగవంతం చేస్తాం. కేసీఆర్ కు చెమటలు పట్టిస్తాం. మా పార్టీ మాత్రమే బీఆర్ఎస్ కు బుద్ధి చెబుతుంది. కరీంనగర్ ను లండన్ చేస్తామని చెప్పి కేసీఆర్ అరచేతిలో వైకుంఠం చూపారు" అని మండిపడ్డారు. కుటుంబ పార్టీలతో ప్రతిభకు ఎంత అన్యాయం జరుగుతుందో తెలంగాణ గడ్డను చూస్తే తెలుస్తుందన్న మోడీ వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
ఆ మాట చెప్పి.. కేసీఆర్ ను నేరుగా అటాక్ చేసిన మోడీ
నిజానికి మోడీ నోటి నుంచి వచ్చిన ఆ మాటలో నిజం ఎంతన్న ప్రశ్నతో పాటు.. మోడీ చేసిన సదరు వ్యాఖ్యపై సీఎం కేసీఆర్ తప్పనిసరిగా కౌంటర్ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. ఇంతకూ మోడీ అన్న మాట ఏమంటే.. ‘‘మోడీ నీడ పడితే నీ సంపద మొత్తం పోతుందని కేసీఆర్ కు ఎవరో చెప్పారు. అందుకే నాకు ఎదురుపడటం లేదు. నేను ఎప్పుడు వచ్చినా 50 కీలోమీటర్ల దూరంలో ఉంటున్నారు’’ అంటూ చురకలు అంటించారు.
మోడీ మాటలకు తగ్గట్లే.. ఏదో ఒక కారణం చూపించి మోడీతో కలిసి వేదికను పంచుకోవటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ససేమిరా అనటం తెలిసిందే. ఇలాంటి వేళ.. ప్రధాని మోడీ నోటి నుంచి వచ్చిన మాటలో నిజం ఎంతన్న విషయంపై గులాబీ బాస్ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది. కేసీఆర్ ను మూఢ నమ్మకాలను నమ్మే వ్యక్తిగా పంచ్ లు వేసే ప్రధాని మోడీ.. తాజా వ్యాఖ్యపై మాత్రం కేసీఆర్ స్పందించాలన్న మాట బలంగా వినిపిస్తోంది.ఒక రకంగా ఇది పబ్లిక్ డిమాండ్ అని.. మోడీ కోసం కాకున్నా.. సగటు తెలంగాణ వ్యక్తికి మోడీ చెప్పిన మాటల్లో నిజం ఎంతన్నది తెలుసుకోవాలన్న మాట వినిపిస్తోంది.