అబుదాబిలో మోడీ ఓపెన్ చేస్తున్న హిందూ టెంపుల్ ప్రత్యేకతలేంటి?
దాదాపు 27 ఎకరాల విస్తీర్ణంలో హిందూ ధర్మం ఉట్టిపడేలా నిర్మించిన ఈ దేవాలయాన్ని ‘బాప్స్ స్వామినారాయణ్’ సంస్థ నిర్మించింది.
ఒక ముస్లిం దేశంలో అతి పెద్ద హిందూ ఆలయాన్ని నిర్మించటం.. దాన్ని పక్కా హిందుత్వ వాదిగా పేరున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ప్రారంభించటం తెలిసిందే. తొలుత విన్నంతనే ఇదేదో సాధ్యమయ్యే పనేనా? అనుకున్నప్పటికీ.. ఇలాంటి వాటిని రియాలిటీలోకి తీసుకొచ్చే సామర్థ్యం మోడీ సొంతంగా చెప్పాలి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో నిర్మించిన అతి పెద్ద హిందూ ఆలయం ఈ రోజు (బుధవారం, ఫిబ్రవరి 14న) ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
దాదాపు 27 ఎకరాల విస్తీర్ణంలో హిందూ ధర్మం ఉట్టిపడేలా నిర్మించిన ఈ దేవాలయాన్ని ‘బాప్స్ స్వామినారాయణ్’ సంస్థ నిర్మించింది. ఇందులో దేవతా విగ్రహాల ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ యూఏఈకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో.. ఆ ఆలయం ప్రత్యేకతలేమిటి? అన్న విషయానికి వస్తే.. బోలెడన్నిగా చెప్పాలి. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ హిందూ ఆలయంలో విశేషాలకు కొదవ లేదు.
- అరబ్ ఏమిరేట్స్ 7 దేశాల సమాహారమన్న విషయం తెలిసిందే. అందుకు తగ్గట్లే 7 గోపురాలతో ఏమిరేట్స్ ప్రతీకగా నిర్మించారు.
- దుబాయి - అబుదాబి మార్గంలో 55 వేల చదరపు మీటర్ల పరిధిలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం పశ్చిమాసియాలోనే అత్యంత పెద్దది.
- 108 అడుగుల ఎత్తు.. 262 అడుగుల పొడవు.. 180 అడుగుల వెడల్పుతో ఆలయ నిర్మాణం సాగింది.
- ఆలయ నిర్మాణం కోసం రాజస్థాన్ నుంచి దిగుమతి చేసుకున్న పాలరాయిని వినియోగించారు. లోపల మాత్రం ఇటాలియన్ మార్బుల్ ను వినియోగించారు.
- వేలాది మంది శిల్పులు.. కార్మికులు దాదాపు మూడేళ్లుగా శ్రమించి ఈ అద్భుత కట్టడంలో భాగస్వామ్యులయ్యారు.
- మొత్తం 402 పాలరాతి స్తంభాల్ని అమర్చారు. ఒక్కో స్తంభంపై దేవతామూర్తులు.. నెమళ్లు.. ఏనుగులు.. ఒంటెలు.. సూర్యచంద్రులు.. సంగీత పరికరాల్ని వాయిస్తున్న విద్వాంసులు.. ఇలా అనేకరకాలుగా శిల్పాలుగా చెక్కారు. అన్నింటిలోనూ హైందవ ధర్మం ఉట్టిపడేలా శిల్పాలు ఉంటాయి.
- ఈ ఆలయ నిర్మాణం కోసం దాదాపు రూ.700 కోట్లు ఖర్చు చేశారు. రాజస్థాన్.. గుజరాత్ కు చెందిన 2వేల మందికి పైగా పని చేశారు. ఆలయ నిర్మాణంలో అయోధ్య రామాలయం మాదిరి స్టీల్.. కాంక్రీట్.. సిమెంట్ వాలేదు. అత్యాధునిక సాంకేతికత సాయంతో రాళ్ల వరసలను నేర్పుగా కలుపుతూ నిర్మించారు.
- ఆలయం మొత్తాన్ని 25వేలకు పైబడి విడి భాగాలు భారత్ లో నిపుణులైన పనోళ్లతో చేయించి యూఏఈలో అసెంబుల్ చేసి..నిర్మించారు. ఆలయ ప్రాంగణంలో 5వేల మంది పట్టే రెండు కమ్యూనిటీ హాళ్లను ఏర్పాటు చేశారు. భక్తులు బస చేసేందుకు వీలుగా ఆలయం సమీపంలో మరో భవనాన్నిఏర్పాటు చేశారు. దీన్ని అరేబియన్.. ఇస్లామిక్ వాస్తు రీతుల్లో నిర్మించారు.
- అక్కడ ఏర్పాటు చేసిన ఫలకాలపై రామాయణం.. శివపురాణం.. భాగవతం.. మహాభారతం.. జగన్నాథుడు.. స్వామి నారాయణుడు.. శ్రీ వేంకటేశ్వర స్వామి.. స్వామి అయ్యప్ప కథల్ని చెక్కారు.
- టెంపుల్ కింది భాగంలో పవిత్ర గంగా.. యమునా నదీ ప్రవాహాన్ని గుర్తు చేసేలా క్రత్రిమ ప్రవాహాన్ని.. ప్రత్యేక ఫోకస్ లైట్లను ఏర్పాటు చేవారు.
- ఆలయ ప్రాంగణంలో సందర్శకుల కేంద్రాలు.. ప్రార్థనా మందిరాలు.. ఎగ్జిబిషన్లు.. లెర్నింగ్ ఏరియా.. పిల్లలు ఆడుకునే ప్రాంతాలు.. ఉద్యానవనాలు.. వాటర్ ఫీచర్లు.. ఫుడ్ కోర్టులు.. పుస్తకాల షాపులు ఉంటాయి. ఈ ఆలయాన్ని నిర్మించే వేళలో వాతావరణంలో వచ్చే మార్పులు తెలిపేలా భారీ ఎత్తున సెన్సార్లను ఏర్పాటు చేశారు.
- 2015లో ప్రధాని హోదాలో మోడీ పర్యటన వేళ.. యూఏఈకి యువరాజుగా ఉన్న షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో పలు అంశాలపై లోతైన చర్చలు జరిపారు. ఆ వెంటనే ఆలయ నిర్మాణానికి యూఏఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 13.5 ఎకరాల భూమిని కేటాయించింది. 2019లో మరోసారిఈ ఆలయానికి మరో 13.5 ఎకరాల భూమిని ప్రకటించారు. దీంతో.. ఈ ఆలయానికి 27 ఎకరాలు సమకూరినట్లైంది.