కమలానికి 'కమల్' ఎఫెక్ట్.. ఒకేసారి వాలిపోయిన మోడీ, షా!!
బిజీ షెడ్యూల్ ఉన్న ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాలు సోమవారం మధ్యప్రదేశ్‌లోని పారిశ్రామిక నగరం భోపాల్‌లో పర్యటిస్తున్నారు.
ఎన్నికలు అనగానే సహజంగానే పార్టీల దూకుడు ఉంటుంది. నాయకుల ప్రసంగాల జోరు కూడా జోరుగానే సాగుతుంది. అయితే.. ఒకే రోజు ఒకే సమయంలో ఒకే రాష్ట్రం, ఒకే జిల్లాలో రెండు ప్రధాన పార్టీలకు చెందిన అగ్రనేతల ప్రచారం మాత్రం అరుదుగానే ఉంటుంది. ఇలాంటి సందర్భమే ఇప్పుడు మధ్యప్రదేశ్ ఎన్నికల్లో చోటుచేసుకుంది. ఇక్కడ ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో బీజేపీ సర్కారు ఉంది.
అయితే.. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ పాగా వేయాలని ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా పార్టీ నాయకుడు, పీసీసీ చీఫ్, మాజీ సీఎం కమల్‌నాథ్ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని అనేక సర్వేలు చెబుతున్నాయి. దీంతో సహజంగానే పాలిత బీజేపీకి దడ పుట్టుకొస్తోంది. ఈ నేపథ్యంలో ఒకే రోజే ఒకే జిల్లాలోనివేర్వేరు ప్రాంతాల్లో బీజేపీ అగ్రనాయకులు వాలిపోయారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని వారు కోరుతున్నారు. మరి ఇంతగా బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు చూస్తూ కూడా కాంగ్రెస్ ఊరుకుంటుందా? అది కూడా అగ్రనేతను దింపేసింది.
ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్న ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాలు సోమవారం మధ్యప్రదేశ్‌లోని పారిశ్రామిక నగరం భోపాల్‌లో పర్యటిస్తున్నారు. రోడ్ షోలు నిర్వహించనున్నారు. అదేవిధంగా ఈ జిల్లాలోని ఉత్తర ప్రాంతంలో మోడీ, దక్షిణ భాగాన షాలు ప్రసంగాలతో దంచికొట్టనున్నా రు. ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోను ప్రజలకు రిలీజ్ చేసిన నేపథ్యంలో వాటిలోని అంశాలను మరింత విపులంగా వివరించనున్నారు.
ఇక, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా భోపాల్‌లో నే పర్యటించనున్నారు. ఆయన కూడా రోడ్ షో, బహిరంగ సభల్లోపాల్గొననున్నారు. వచ్చే ఎన్నికల్లోఎట్టి పరిస్థితిలోనూ విజయావకాశాలను చేజార్చుకోరాదన్న గట్టి పట్టుదలతో కాంగ్రెస్ దూకుడు ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. సర్వేలన్నీ.. కూడా కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండడంతో పార్టీ ఎక్కువ మందిని ప్రచారానికి వినియోగిస్తోంది.