యుద్ధ భూమిలో మోదీ.. ఉక్రెయిన్ లో తొలి భారత ప్రధాని.. ఏం చూస్తారో?

1991లో సోవియట్ యూనియన్ నుంచి విడిపోయి సొంత దేశంగా ఏర్పడిన ఉక్రెయిన్ లో ఇప్పటివరకు ఏ భారత ప్రధాని పర్యటించలేదు

Update: 2024-08-23 08:33 GMT

1991లో సోవియట్ యూనియన్ నుంచి విడిపోయి సొంత దేశంగా ఏర్పడిన ఉక్రెయిన్ లో ఇప్పటివరకు ఏ భారత ప్రధాని పర్యటించలేదు.. 33 ఏళ్లలో తెలుగువారైన పీవీ నరసింహారావు నుంచి ప్రస్తుత నరేంద్ర మోదీ వరకు పలువురు ప్రధానులుగా పనిచేశారు. వీరెవరూ ఉక్రెయిన్ వెళ్లలేదు. కానీ.. రెండున్నరేళ్లుగా యుద్ధంతో నలుగుతున్న ఉక్రెయిన్ లో అడుగుపెట్టారు మోదీ. దాదాపు 10 గంటలు రైలు ప్రయాణం చేసి.. శుక్రవారం ఉదయం 7.30 (మనకు 10.30)కు ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో కాలుమోపారు. పోలండ్ రాజధాని వార్సా నుంచి ఆయన ప్రత్యేక రైలులో బయల్దేరారు. బహుశా 70కి పైగా దేశాలను విమానంలో చుట్టివచ్చిన మోదీకి.. రైలులో చేసిన ఈ పర్యటన కొత్త అనుభూతి మాత్రమే కాదు అనుభవం కూడా.

ఏడు గంటల పర్యటనలో ఏం చూస్తారో

యుద్ధం మొదలైన తర్వాత పలు దేశాల అధినేతలు ఉక్రెయిన్ లో పర్యటించారు. అయితే, వీరంతా కీవ్ ఆ సమీపంలో రష్యా దళాలు సాగించిన మారణకాండ, అత్యాచారాలను పరిశీలించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ వారికి దగ్గరుండి చూపించారు. ఇప్పుడు మోదీకి ఏం చెబుతారు?? అనేది చర్చనీయాంశం. ఎందుకంటే మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ఇప్పటికే సమావేశమై వచ్చారు. కీవ్ లో రష్యా దళాలు సాగించిన అరాచకాలు, విధ్వంసం గురించి మోదీకి జెలెన్ స్కీ వివరిస్తే అది పెద్ద విషయం అవుతుంది.

రష్యాకు మద్దతు లేదనందుకే.?

యుద్ధం సమయంలో రష్యాను సందర్శించిన మోదీ విమర్శలకు అవకాశం ఇచ్చారు. అయితే, భారత్‌ ఈ సంక్షోభంలో ఎవరికీ మద్దతు ఇవ్వదని.. శాంతి స్థాపనే ముఖ్యమని చెప్పేందుకు మోదీ ఉక్రెయిన్ కు వెళ్తున్నారు. వాస్తవానికి ఈ పర్యటన రష్యా పర్యటన తర్వాతనే ఖరారైనదిగా తెలుస్తోంది. ఇందులో మోదీ ఏం చేస్తారనేది భద్రతా కారణాల కారణంగా గోప్యంగా ఉంచారు. కాగా, కీవ్‌ లో మోదీకి భారత సంతతి ప్రజలు రైల్వే స్టేషన్‌ వద్ద స్వాగతం పలికారు. ఉక్రెయిన్‌ ఇస్కాన్‌ బృందం సభ్యులు కూడా దీనికి హాజరయ్యారు. మోదీ.. కీవ్ లోని ఏవీ ఫొమిన్‌ బొటానికల్‌ గార్డెన్‌ లో ఉన్న గాంధీజీ విగ్రహానికి నివాళి అర్పించనున్నారు. 2020లో గాంధీ 151వ జయంతి సందర్భంగా దీన్ని ఏర్పాటుచేశారు.

ఉక్రెయిన్‌ నేషనల్‌ మ్యూజియంలో మోదీ.. రష్యా దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులకు నివాళి అర్పిస్తారు. ఉక్రెయిన్‌ ఎదుర్కొన్న అతిపెద్ద సంక్షోభాల ఆనవాళ్లను పరిశీలించనున్నారు. కాగా, మోదీ-జెలెన్ స్కీ నేరుగా సమావేశం కావడం ఇదే మొదటిసారి. ఇటలీలో జరిగిన జి-7 సదస్సులో వీరు భేటీ అయ్యారు. హ్యాట్రిక్‌ విజయం సాధించిన మోదీకి జెలెన్ స్కీ ఫోన్‌ చేసి అభినందించారు. తమ దేశంలో పర్యటించాలని కోరారు. అప్పటి ఆహ్వానాన్నే మోదీ పరిశీలించినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News