మోడీ మూడో టర్మ్ లో నాలుగో యూటర్న్... ఏమిటీ ల్యాటరల్ ఎంట్రీ బిల్?

అవును... మూడోసారి అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్ ప్రస్తుతం రోల్ బ్యాక్ మోడ్ లో ఉందంటూ విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి.

Update: 2024-08-21 06:04 GMT

మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమి ఇప్పటివరకూ సుమారు నాలుగు బిల్లులపై యూటర్న్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది! ఇప్పుడు ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇది మోడీ సర్కార్ బలహీనతను ఎత్తి చూపుతుందని.. ప్రస్తుతం మోడీ సర్కార్ రోల్ బ్యాక్ మోడ్ లో ఉందని విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి.

అవును... మూడోసారి అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్ ప్రస్తుతం రోల్ బ్యాక్ మోడ్ లో ఉందంటూ విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. అందుకు వరుసగా పలు బిల్లుల విషయంలో యూటర్న్ తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురవ్వడమే అని అంటున్నారు. ఇప్పటికే మూడు బిల్లులు వెనక్కి వెళ్లగా.. తాజాగా ల్యాటరల్ ఎంట్రీ విషయంలోనూ వెనక్కి తగ్గింది.

ల్యాటరల్ ఎంట్రీ ప్రక్రియ ద్వారా జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారులు, ఇతర కీలక స్థానాల నియామకం కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) జారీ చేసిన ప్రకటనను రద్దు చేయాలని ప్రధాని నరేంద్రమోడీ ఆగస్టు 20న డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ)ని ఆదేశించారు.

ప్రతిపక్షాలతోపాటు నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే)లోని కొన్ని భారతీయ జనతా పార్టీ విమత్రపక్షాల విమర్శలు కూడా తోడవ్వడంతో మోడీ సర్కార్ ఈ విషయంలో యూటర్న్ తీసుకుందని చెబుతున్నారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన లేటరల్ ఎంట్రీ మోడ్ ద్వారా 45 పోస్టులను భర్తీ చేయాలని యూపీఎస్సీ ఆగస్టు 18న ప్రకటన చేసింది.

దీని ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన లేదా డిప్యుటేషన్ ద్వారా కొన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలలో మల్టీ టాస్కింగ్ కోసం అధికారులను నియమించాలనే ఆలోచనలో ఉంది! ఇందులో 10 జాయింట్ సెక్రటరీలు, 35 డైరెక్టర్ / డిప్యూటీ సెక్రటరీ పోస్టులతో సహా 24 మంత్రిత్వ శాఖల్లోనూ రిక్రూట్మెంట్ జరగాల్సి ఉంది. ఈ పోస్టులను సెప్టెంబర్ 17లోగా భర్తీ చేయాల్సి ఉంది.

అయితే... ఈ ప్రకటన ప్రతిపక్షాల నుంచి తీవ్ర నిరసనలకు దారి తీసింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి సహా అనేక మంది నాయకులు.. షెడ్యూల్డ్ కేస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, ఇతర వెనుకబడిన తరగతుల అభ్యర్థుల రిజర్వేషన్స్ లేని ప్రభుత్వ నియామక విధానాన్ని నిందించారు.

ఇదే క్రమంలో ఎన్డీయే మిత్రపక్షాలు అయినా జనతాదళ్ (యునైటెడ్), లోక్ జనశక్తి పార్టీ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేశాయి. దీంతో యూపీఎసీ ప్రకటన జారీ చేసిన మూడు రోజుల తర్వాత ఆగస్టు 20న ప్రభుత్వం రద్దు చేయవలసి వచ్చింది. ఈ నేపథ్యంలోనే విపక్షాలు.. ప్రభుత్వాన్ని ఎద్దేవా చేస్తున్నారు.

ఇప్పటికే వెనక్కి తీసుకున్న పలు బిల్లులను ప్రస్థావిస్తూ... ప్రభుత్వం ఇప్పటికే "రోల్ బ్యాక్" మోడ్ లో ఉందని అంటున్నాయి. పైగా ఈ లేటరల్ ఎంట్రీ విషయంలో ఈ రోల్ బ్యాక్ విమర్శలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఎందుకంటే... ఈ నిర్ణయం నేరుగా ప్రధానమంత్రి నియంత్రణలో ఉండే సిబ్బంది మంత్రిత్వ శాఖకు సంబంధించినది.

కాగా... ఇప్పటికే మూడు బిల్లులపై మోడీ సర్కార్ యూటర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... బ్రాడ్ కాస్టింగ్ సర్వీసెస్ (రెగ్యులేషన్) బిల్లు, వక్ఫ్ బోర్డు బిల్లు, ఇండెక్సేషన్ ప్రయోజనాలు పునరుద్ధరించే బిల్లుల విషయంలో ఇప్పటికే మోడీ సర్కార్ యూటర్న్ తీసుకుంది!

Tags:    

Similar News