ఏపీలో నోట్ల పంపిణీకి వేళాయెరా?

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోలింగ్ తేదీ దగ్గరపడుతుంది. మరో రెండు రోజుల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోలింగ్ ప్రారంభం కాబోతుంది.

Update: 2024-05-10 05:32 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోలింగ్ తేదీ దగ్గరపడుతుంది. మరో రెండు రోజుల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోలింగ్ ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఎన్నికల ప్రచారం పీక్స్ కి చేరింది. ఈ ఎన్నికల్లోనూ గెలిచి తీరాలని జగన్ భావిస్తుండగా.. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని టీడీపీ - జనసేన భావిస్తున్నాయని అంటున్నారు! ఏది ఏమైనా... అటు వైసీపీ, ఇటు కూటమి లక్ష్యం.. ఏది ఏమైనా గెలవాలని!

అవును... వాడుక భాషలో.. ఆరు నూరైనా - నూరు ఆరైనా అన్నట్లుగా.. అటు కూటమి, ఇటు వైసీపీ ఈ ఎన్నికల్లో గెలుపును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవాలని ఒకరనుకుంటుంటే.. గెలిస్తేనే నిలుస్తామని మరొకరు భావిస్తున్నారు. అందుకు అవసరమైన ఏ చిన్న విషయాన్ని వారు వదులుకునే ఆలోచనలో లేరని అంటున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో నోట్ల పంపిణీ మొదలైపోయిందనే చర్చ మొదలైంది!

వాస్తవానికి పోలింగ్ కి ముందు రోజు రాత్రి గ్రామాల్లో డబ్బుల పంపిణీ ఉంటుందని అంటుంటారు. ఇరు పక్షాలు కూడా గంటల వ్యవధిలో దాదాపుగా అదే రోజు ఈ కార్యక్రమం చేస్తారని చెబుతుంటారు. అయితే... తాజా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో గురువారం రాత్రి నుంచే నోట్ల పంపిణీ ప్రారంభమైందని అంటున్నారు.

ప్రధానంగా కొన్ని కీలక నియోజకవర్గంల్లో గురువారం రాత్రి.. అంటే పోలింగ్ కి సుమారు నాలుగు రోజుల ముందే నగదు పంపిణీ జరుగుతుందని తెలుస్తుంది. ఇందులో భాగంగా కొన్ని నియోజకవర్గాల్లో 1000 - 2000 మధ్య పంపిణీ జరుగుతుందని చెబుతుండగా.. మరికొన్ని కీలక నియోజకవర్గాల్లో మాత్రం అది 5 - 10 వేల మధ్య నడుస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు, ఎన్నికల అధికారులు పూర్తి నిఘా పెట్టి ఉన్నారని చెబుతున్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... గతంలో లాగా అందరికీ డబ్బులు పంచకుండా.. వీరు కచ్చితంగా మనకు ఓటు వేసే వారే అని భావిస్తేనే ఇస్తున్నారని.. చీకట్లో బాణాలు వేయడం లేదనే చర్చా తెరపైకి వచ్చింది! ఏది ఏమైనా... ఈ సారి మాత్రం పోలింగ్ కి నాలుగు రోజుల ముందే ఈ సందడి మొదలవ్వడం గమనార్హం.

Tags:    

Similar News