రాజమండ్రిలో తమ్ముళ్ల రచ్చ... ఫ్లైఓవర్ శిలాఫలకం ధ్వంసం!

ఏపీలో పోలింగ్ రోజు మొదలైన అవాంఛనీయ ఘటనలు ఫలితాలు వచ్చి మూడు రోజులు అవుతున్నా కూడా కంటిన్యూ అవుతున్నాయి

Update: 2024-06-07 11:36 GMT

ఏపీలో పోలింగ్ రోజు మొదలైన అవాంఛనీయ ఘటనలు ఫలితాలు వచ్చి మూడు రోజులు అవుతున్నా కూడా కంటిన్యూ అవుతున్నాయి. నాడు ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నప్పుడు పలు ఘర్షణలు జరగ్గా... ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందు మరింత దారుణంగా దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శిలాపలకాలను ధ్వంసం చేస్తున్న ఘటనలు తెరపైకి వస్తున్నాయి.

అవును.. ఏపీలో అరాచక కాండ కొనసాగుతోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులే లక్ష్యంగా పలు దాడులు జరగ్గా... తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీల ఇళ్లపైనా దాడులు జరిగాయి. దీంతో... ఆయా ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయని తెలుస్తుంది. ఈ క్రమంలో తాజాగా రాజమండ్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఇందులో భాగంగా... రాజమండ్రి మోరంపూడి ఫ్లైఓవర్ శిలాపలకంపై వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ పేరు ఉండటంతో ఆ శిలాఫలకాలను టీడీపీ శ్రేణులు ధ్వంసం చేశాయి. ఈ సమయంలో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ టీడీపీ శ్రేణులు వినిపించుకోలేదు. ఈ క్రమంలోనే పోలీసులను లైట్ తీసుకున్న కార్యకర్తలు.. అనుకున్నపని పూర్తి చేశారు. సుత్తితో ఆ శిలాపలకాన్ని పగలగొట్టి నేలమట్టం చేశారు.

ఈ క్రమంలో సమాచారం అందుకున్న మాజీ ఎంపీ మార్గాని భారత్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంతకాలం ప్రశాంతంగా ఉన్న రాజమండ్రిలో గతంలో ఇలాంటి ఘటనలు ఏనాడూ జరగలేదని.. ఇలాంటి ఘటనలు ఏమాత్రం సరికాదని టీడీపీ శ్రేణుల్ని ఉద్దేశించి హితవు పలికారు. అలజడులు సృష్టించడం ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు.

కాగా... రెండేళ్ల కిందట ఈ ఫ్లై ఓవర్ కు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, స్థానిక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మార్గాని భరత్ లు శంకుస్థాపన చేశారు. రూ.53.13 కోట్లతో చేపట్టిన ఈ పనులు దాదాపు పూర్తికావొస్తున్నాయి!

Tags:    

Similar News