దేశ‌ద్రోహినా.. దేశ భ‌క్తుడినా.. : బీజేపీ ఎంపీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

అదేవిధంగా మైసూరు చాముండేశ్వ‌రి, త‌ల్లి కావేరీ(న‌ది) నా నిజాయితీని తేలుస్తార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు

Update: 2023-12-25 03:40 GMT

''నేను దేశ‌ద్రోహినా.. దేశ భ‌క్తుడినా.. అనేది 2024 ఏప్రిల్లో జ‌ర‌గ‌నున్న పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లే తేలుస్తారు'' అని బీజేపీ మైసూరు నియోజ‌క‌వ‌ర్గం లోక్‌స‌భ స‌భ్యుడు ప్ర‌తాప్ సింహా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ నెల 13న లోక్‌స‌భ‌లో పొగ‌బాంబు ఘ‌ట‌న జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఇది దేశ‌వ్యాప్తంగా తీవ్ర క‌ల‌క‌లం సృష్టించింది. పార్ల‌మెంటులోకి విజిట‌ర్స్ పాస్‌తో వ‌చ్చిన దుండ‌గులు.. హ‌ఠాత్తుగా గ్యాల‌రీ నుంచి స‌భ్యుల బెంచీల‌పైకి దూకి.. పొంగ‌బాంబులు అమ‌ర్చిన కాలి బూట్ల‌ను రిలీజ్ చేసి అల‌జ‌డి సృష్టించారు. అయితే.. వీరికి పాస్ ఇచ్చింది మైసూరు బీజేపీ ఎంపీ ప్ర‌తాప్ సింహానే కావ‌డంతో తీవ్ర నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌య్యాయి.

ఈ క్ర‌మంలోనే పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌ల్లో కాంగ్రెస్ స‌హా విప‌క్షాలు నిర‌స‌న‌లు చేప‌ట్టాయి. దీంతో భార‌త చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని విధంగా శీతాకాల స‌మావేశాల్లో 148 మంది ప్ర‌తిప‌క్ష స‌భ్యుల‌ను స‌స్పెండ్ చేయ‌డం కూడా అంతే సంచ‌ల‌నం సృష్టించింది. ఈ క్ర‌మంలో ఎంపీ సింహాపై కాంగ్రెస్ స‌హా విప‌క్షాలు ''ద్రోహి'' అనే ముద్ర వేశాయి. దీనిపై ఎట్ట‌కేల‌కు స్పందించిన ప్ర‌తాప్ సింహా.. దాడి ఘ‌ట‌న‌కు సంబంధించి మాట్లాడ‌కుండా.. త‌న‌పై విప‌క్షాలు చేసిన విమ‌ర్శ‌ల‌పై మాత్రం త‌న‌దైన శైలిలో స్పందించారు. ''నేను ద్రోహినంటూ కొంద‌రు ముద్ర వేశారు. నేను దేశ ద్రోహినా, దేశ భ‌క్తుడినా? అనేది మైసూరు, కొడ‌గు నియోజ‌క‌వ‌ర్గాల ప్ర‌జ‌లు తేలుస్తారు. '' అని వ్యాఖ్యానించారు.

అదేవిధంగా మైసూరు చాముండేశ్వ‌రి, త‌ల్లి కావేరీ(న‌ది) నా నిజాయితీని తేలుస్తార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. జాతీయ భావం, ధ‌ర్మం నిండుగా ఉన్న తాను.. గ‌త 20 ఏళ్లుగా.. అనేక వ్యాసాల‌తో పాఠ‌కుల‌కు చేరువ‌య్యాన‌ని, వారి అభిమానాన్ని సైతం చూర‌గొన్నాన‌ని.. వారు కూడా.. తాను ద్రోహినో కాదో నిర్ణ‌యిస్తార‌ని అన్నారు. త‌న‌పై చేసిన వ్యాఖ్య‌ల‌కు ఇంత క‌న్నా తానేమీ స్పందించలేన‌న్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మైసూరు ప్ర‌జ‌లు త‌న‌కు సంబంధించి తీర్పు వెల్ల‌డిస్తార‌ని చెప్పారు. అప్పుడు, కాంగ్రెస్ స‌హా విప‌క్షాల క‌ళ్లు తెరుచుకుంటాయ‌ని వ్యాఖ్యానించారు.

కాగా, పార్ల‌మెంటు ఘ‌ట‌న‌కు సంబంధించి ఓ వ్య‌క్తికి లోక్‌సభ‌ పాస్ ఇచ్చిన మాట వాస్త‌వ‌మేన‌న్నారు. అయితే, అత‌ను మైసూరుకు చెందిన వ్య‌క్తికావ‌డంతో పాస్ ఇచ్చాన‌ని ప్ర‌తాప్ సింహా వెల్ల‌డించారు. ఇంత‌కుమించి దీనిపై ఏమీ మాట్లాడ‌బో న‌న్నారు. ప్ర‌స్తుతం ఈ కేసు విచార‌ణ ద‌శ‌లో ఉన్నందున తానేం మాట్లాడినా విచార‌ణ‌పై ప్ర‌భావం ప‌డుతుంద‌ని చెప్పారు. కాగా, పార్ల‌మెంటు ఘ‌ట‌న‌పై బీజేపీ ఎంపీలు, మంత్రులు ఎక్క‌డా వ్యాఖ్య‌లు చేయ‌రాదంటూ.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఇటీవ‌ల ఆదేశాలు జారీ చేసిన విష‌యం తెలిసిందే.

Tags:    

Similar News