ముద్రగడకు షాకింగ్ కౌంటర్ ఇచ్చిన కుమార్తె
అవసరం లేకున్నా అనవసరంగా జనసేనాని పవన్ కల్యాణ్ పై అదే పనిగా విమర్శలు గుప్పించే ముద్రగడ పద్మనాభం తనకున్న పేరు ప్రఖ్యాతుల్ని తనకు తానే దెబ్బ తీసుకుంటున్నారు.
అవసరం లేకున్నా అనవసరంగా జనసేనాని పవన్ కల్యాణ్ పై అదే పనిగా విమర్శలు గుప్పించే ముద్రగడ పద్మనాభం తనకున్న పేరు ప్రఖ్యాతుల్ని తనకు తానే దెబ్బ తీసుకుంటున్నారు. నిజానికి ఏ రోజున కూడా ముద్రగడ పద్మనాభాన్ని పవన్ కల్యాణ్ పల్లెత్తు మాట అనలేదు. తనను ఎంతలా విమర్శించినా.. మరెంతలా తిట్టిపోసినా.. చులకన చేసినా.. నిందలు వేసినా.. పెద్దాయన ఏదో కోపంతో అని ఉంటారంటూ సర్దుబాటు మాటలే పవన్ నోటి నుంచి వచ్చాయే కానీ.. తనను అన్నేసి మాటలు అన్నందుకు ప్రతిగా ఒక్క మాట పవన్ నోటి నుంచి వచ్చి ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవి.
అదే పనిగా పవన్ పై విమర్శనాస్త్రాల్ని సంధించే ముద్రగడ.. గత ఎన్నికల వేళ పవన్ పై సంచలన వ్యాఖ్య చేయటం.. ఎన్నికల్లో గెలిస్తే తన పేరు మార్చుకుంటానని సవాలు విసరటం తెలిసిందే. ఎన్నికల్లో ఘన విజయాన్ని పవన్ సొంతం చేసుకున్న వేళ.. ముద్రగడపై పెద్ద ఎత్తున ట్రోల్ చేయటంతో పాటు.. పేరు ఎప్పుడు మార్చుకుంటారంటూ వ్యాఖ్యలు చేశారు.
అనూహ్యంగా తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటూ గెజిట్ సైతం పబ్లిష్ చేయించుకొని.. దాన్ని అందరికి షేర్ చేయటం ద్వారా సర్ ప్రైజ్ చేశారు ముద్రగడ. అక్కడితో ఆగినా బాగుండేది. కానీ.. ఆయన తన తీరును మార్చుకోలేదు. పవన్ మద్దతుదారులు తనను చాలా మాటలు అంటున్నారని.. బూతులు తిడుతున్నారంటూ మండిపడుతూ.. పవన్ పై విరుచుకుపడ్డారు. ఇలాంటి వేళ.. ముద్రగడ కుమార్తె తెర మీదకు వచ్చారు.
తన తండ్రి ముద్రగడ పద్మనాభం ఇటీవల తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నప్పటికి.. ఆయన ఆలోచనా విధానం మాత్రం మార్చుకోలేదంటూ ఆయన కుమార్తె క్రాంతి మండిపడ్డారు. తాజాగా ఎక్స్ లో ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడూ ప్రశ్నించని తన తండ్రి పవన్ కల్యాణ్ ను మాత్రం ఎందుకు ప్రశ్నిస్తున్నారు? అంటూ సూటి ప్రశ్న వేశారు.
సమాజానికి ఏం చేయాలన్న దానిపై పవన్ కల్యాణ్ కు ఒక స్పష్టత ఉందని.. ఆ విషయంలో తన తండ్రికి అలాంటిదేమీ లేదన్నట్లుగా అనిపిస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి తన శేష జీవితాన్ని ఇంటికే పరిమితం చేసి విశ్రాంతి తీసుకోవాలని తాను సలహా ఇస్తున్నట్లుగా ముద్రగడ పద్మనాభం కుమార్తె పేర్కొన్నారు. అదే సమయంలో తన తండ్రికి హెచ్చరింపు దోరణిలో ఒక వ్యాఖ్య చేశారు.
ఇంకోసారి పవన్ కల్యాణ్ ను విమర్శిస్తే తాను గట్టిగా ప్రతిఘటిస్తానని ఆమె పేర్కొనటం గమనార్హం. సమయం.. సందర్భం లేకుండా.. తనను ఎప్పుడూ గౌరవించే పవన్ ను తాను అన్నేసి మాటలు అన్నప్పుడు.. అందుకు ప్రతిగా తనను పవన్ అభిమానులు తిట్టిపోశారంటూ ముద్రగడ ఆరోపించటంలో అర్థముందా? అన్నది ప్రశ్న. అదే విషయాన్ని ఆయన కుమార్తె సైతం సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించటం ఇప్పుడు సంచలనంగా మారింది.