దేశంలో నైట్ బుకింగ్స్ లో ముంబయి దూకుడు
కాలగర్భంలో మరో ఏడాది మెమరీగా మిగిలిపోనుంది. మరో రెండు రోజుల్లో వర్తమానంగా ఉన్న 2023 గతంగా మారిపోనుంది
కాలగర్భంలో మరో ఏడాది మెమరీగా మిగిలిపోనుంది. మరో రెండు రోజుల్లో వర్తమానంగా ఉన్న 2023 గతంగా మారిపోనుంది. ఏడాదిలో చోటు చేసుకున్న విషయాలు.. విశేషాలకు సంబంధించి ప్రతి రంగం నుంచి రిపోర్టులు వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ట్యాక్సీ సర్వీసులు అందించే ఉబర్ సైతం ఒక రిపోర్టును విడుదల చేసింది. ఇందులో ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది.
తమ సంస్థకు సంబంధించి 2023లో తాము గుర్తించిన విషయాల్ని ఒక నివేదిక రూపంలో బయటపెట్టింది. ఈ ఏడాది తమ సర్వీసుల్ని ఎక్కువగా వినియోగించిన నగరాలుగా ఢిల్లీ (ఎస్ సీఆర్).. బెంగళూరు.. హైదరాబాద్.. ముంబయి.. కోల్ కతా.. ఫుణెల్లో ఎక్కువ మంది రైడ్ బుక్ చేసినట్లుగా తెలిపింది. రాత్రి వేళ.. బుక్ అయిన బుకింగ్స్ విషయానికి వస్తే దేశ వాణిజ్య రాజధానిగా పేర్కొనే ముంబయి మహానగరం ముందు ఉందని తెలిపింది.
అయితే.. వీకెండ్ లో మాత్రం కోల్ కతా ప్రజలు ఎక్కువగా తమ సర్వీసుల్ని వినియోగించుకున్నారని.. ఎక్కువగా బుక్ చేసుకున్నట్లు చెప్పింది. 2023లో ఉబర్ రైడ్స్ రికార్డు స్థాయిలో 6800 కోట్ల కిలోమీటర్ల మేర సేవలు అందించినట్లుగా తెలిపింది. ఈ ప్రయాణ దూరం దేశంలోని మొత్తం రోడ్ నెట్ వర్కులో వెయ్యి రెట్లు ఎక్కువగా చెప్పిన ఉబర్.. తమ రైడ్స్ లో ఎక్కువ భాగం సాయంత్రం 6-7గంటల మధ్యలోనే జరిగాయని వెల్లడించింది.
శనివారం ఉబర్ ఫేవరెట్ డే అని.. ఆ రోజే అధికంగా బుకింగ్స్ వస్తాయని చెప్పింది. ఎక్కువగా రైడ్ బుక్ చేసిన ట్రిప్ ల విషయానికి వస్తే.. దసరా.. క్రిస్మస్ రోజుల్లో ఎక్కువని చెప్పింది. మొత్తం ఏడాదిలో డిసెంబరులో అత్యధిక సంఖ్యలో రైడ్ లు బుక్ అయినట్లుగా తెలిపింది. ఎయిర్ పోర్టుకు వెళ్లే ట్రిప్పుల్లో అత్యధికం తెల్లవారుజామున 4-5 గంలల మధ్య జరిగాయని వెల్లడించింది.