ముత్తిరెడ్డి వర్సెస్ పల్లా.. స్టేషన్ లో కేసులు పెట్టే వరకు వెళ్లింది!
ముత్తిరెడ్డి వర్సెస్ పల్లా వర్గీయుల మధ్య తాజా పంచాయితీ ఎక్కడ మొదలైంది? పోలీస్ స్టేషన్ వరకు ఎందుకు వెళ్లింది?
చిలికి చిలికి గాలివానలా మారింది గులాబీ నేతల పంచాయితీ. జనగామ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వర్సెస్ రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు కమ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్గీయుల మధ్య గొడవలు అంతకంతకూ పెరిగి పెద్దవై.. పోటాపోటీగా కేసులు పెట్టే వరకు వెళ్లింది. అధికార పార్టీకి చెందిన రెండు వర్గాలు ఢీ అంటే ఢీ అన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో పోలీసులకు ఇప్పుడో తలనొప్పిగా మారింది. పార్టీ క్రమశిక్షణను బజారున పెట్టే ఈ ఉదంతాలపై అధినాయకత్వం సీరియస్ గా రియాక్టు కావాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఇలాంటివి మొగ్గలోనే తుంచకుంటే మరిన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితే నెలకొంటుందని వ్యాఖ్యానిస్తున్నారు.
ముత్తిరెడ్డి వర్సెస్ పల్లా వర్గీయుల మధ్య తాజా పంచాయితీ ఎక్కడ మొదలైంది? పోలీస్ స్టేషన్ వరకు ఎందుకు వెళ్లింది? అన్న వివరాల్లోకి వెళితే ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తాయి. రాఖీ పర్వదినాన మహిళా ప్రజాప్రతినిధులను తన ఇంటికి ఆహ్వానించారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. దీనిపై ముత్తిరెడ్డి వర్గానికి చెందిన గులాబీ నేత తిప్పారపు విజయ్ కుమార్ సోషల్ మీడియాలో మండిపడుతూ.. రాఖీ రోజున మహిళా ప్రజాప్రతినిధులను పిలవాల్సిన అవసరం ఏమిటి? అంటూ ప్రశ్నిస్తూ పోస్టు పెట్టారు.
దీంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పల్లా వర్గీయుడు పోస్టు పెట్టిన విజయ్ కుమార్ పై కంప్లైంట్ చేశారు. దీనికి స్పందించిన పట్టణ సీఐ విజయ్ కుమార్ ను స్టేషన్ కు పిలిపించి విచారణ చేశారు. అనంతరం స్టేషన్ బయట.. ముత్తిరెడ్డి క్యాంపు ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ పల్లా మీద విమర్శలు చేశారు. పల్లా మీద తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్న ఆయన.. ఎమ్మెల్సీగా గెలిచినా జనగామకు చేసిందేమీ లేదన్నారు.
దళితుడైన తనపై పల్లాదాడి చేయిస్తున్నారని.. తన వర్గీయుల చేత వార్నింగ్ ఇప్పిస్తున్నారని మండిపడ్డారు. ముత్తిరెడ్డి వర్గీయుల మీద పల్లా వర్గీయులు కేసు పెట్టటంపై వారు గుర్రుగా ఉన్నారు. ప్రతిగా కేసు పెట్టాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అధికార పార్టీ నేతల మధ్య నడుస్తున్న పంచాయితీ ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది.