మైలవరం...ఎవరి పరం ?

ఒక విధంగా చెప్పాలంటే కమ్మలకు బలమైన సీటు ఇది. ఈ సీట్లో వైసీపీ సామాజిక సమీకరణలతో సరికొత్త ప్రయోగమే చేసింది

Update: 2024-05-22 03:51 GMT

ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో మైలవరం అసెంబ్లీ సీటుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ నియోజకవర్గంలో మొదటి నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలే ఎపుడూ ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వస్తున్నారు. పార్టీలు వేరు అయినా సామాజిక వర్గం నేతలు మాత్రం వారే ఉంటూ విజయం సాధిస్తున్నారు. అది 1952 నుంచి అలాగే కొనసాగుతోంది.

ఒక విధంగా చెప్పాలంటే కమ్మలకు బలమైన సీటు ఇది. ఈ సీట్లో వైసీపీ సామాజిక సమీకరణలతో సరికొత్త ప్రయోగమే చేసింది. మైలవరంలో బీసీలు ఎక్కువగా ఉన్నారు. అందుకే జడ్పీటీసీ సభ్యుడిగా ఉన్న నర్నాల తిరుపతి యాదవ్ కి టికెట్ ఇచ్చింది. అయితే మైలవరంలో గౌడ సామాజిక వర్గం కూడా ఎక్కువగా ఉంది.

కానీ వైసీపీ యాదవులకు టికెట్ ఇవ్వాలనుకుని ఇచ్చింది. సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత క్రిష్ణ ప్రసాద్ ని పార్టీ దూరం చేసుకుంది. ఆయనకే టికెట్ అని చెప్పి ఉన్నా ఆయననే పోటీకి దించినా ఈ సీటు కచ్చితంగా వైసీపీ ఖాతాలోనే పడేది అని అంటున్నారు.

చిత్రంగా ఈ సీటు విషయంలో పోటీ పడిన మంత్రి జోగి రమేష్ కి అయినా వైసీపీ అధినాయకత్వం ఇవ్వలేదు. ఆయన్ని పెనమలూరుకు పంపింది. కానీ జోగి రమేష్ కి ఈ సీటు ఇచ్చి ఉంటే గట్టి పోటీ ఇచ్చి గెలుపు అంచులకు తీసుకుని వచ్చేవారు అన్న మాట ఉంది. 2014లో ఆయన మైలవరం నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తే 87 వేల ఓట్లను తెచ్చుకున్నారు.

అక్కడ ఆయనకు బలమైన అనుచర గణం ఉంది. కాబట్టే ఆయన మంత్రిగా ఉంటూ మైలవరంలో వేలు పెట్టారు. కానీ వైసీపీ హై కమాండ్ మాత్రం జడ్పీటీసీ సభ్యుడిగా ఉన్న నర్నాల తిరుపతి యాదవ్ ను తమ పార్టీ అభ్యర్థి గా ప్రకటించింది. ఆయన వసంతతో సరితూగలేదని అంటున్నారు. పోలింగ్ అనంతరం వచ్చిన అంచనాలు విశ్లేషణలు చూసుకుంటే వసంత కృష్ణ ప్రసాద్ ఈ సీటు నుంచి రెండవ మారు గెలిచి జెండా ఎగురవేస్తారు అని అంటున్నారు.

ఆయనకు పూర్తిగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సహకారం అందించడం నిజంగా గ్రేట్ అని అంటున్నారు. టీడీపీ అంతా ఐక్యంగా పనిచేసింది. దాంతో వసంత గెలుపు ఖాయమని ఆ పార్టీ చెబుతోంది. అయితే వైసీపీ కూడా గెలుపు ఆశలను వదులుకోవడం లేదు. మహిళలు వృద్దులు పెద్ద ఎత్తున పోలింగ్ బూతులకు వచ్చారని వారి ఓట్లు అన్నీ కూడా తమకే అని భావిస్తున్నారు.

అవన్నీ కనుక పడితే తప్పకుండా వైసీపీ గెలుస్తుంది అని లెక్క వేసుకుంటున్నారు. పైగా బీసీ సామాజిక వర్గం కూడా తమకు కలసి వస్తుందని విశ్లేషించు కుంటున్నారు. అయితే ఎవరి అంచనాలు ఎలా ఉన్నా దాదాపుగా డెబ్బై ఏళ్ళుగా కమ్మలకు స్థావరంగా ఉన్న మైలవరం అంత ఈజీగా వేరే వారికి వెళ్లదని అంటున్నారు. దాంతో పాటు వసంత క్రిష్ణ ప్రసాద్ బలమైన అభ్యర్థి అని ఆయనకు మంచి పేరు ఉందని అన్నీ చూసుకునే చంద్రబాబు ఆయనకు అవకాశాన్ని ఇచ్చారని అంటున్నారు. మొత్తానికి మైలవరం ఎవరి పరం అంటే జూన్ 4 వరకూ వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News