ఎవరీ అన్వేష్...వైసీపీ టీడీపీల మధ్య కొత్త చిచ్చు ...!

అన్వేష్ అన్న యువకుడు ఇపుడు ఏపీ రాజకీయాల్లో అగ్గి రాజేస్తున్నారు. ఈయన ప్రపంచాన్ని చుట్టాలన్న ఆశయంతో ప్రపంచ యాత్రికుడుగా మారి అనేక దేశాలు చుట్టి వస్తున్నారు.

Update: 2023-11-24 13:59 GMT

అన్వేష్ అన్న యువకుడు ఇపుడు ఏపీ రాజకీయాల్లో అగ్గి రాజేస్తున్నారు. ఈయన ప్రపంచాన్ని చుట్టాలన్న ఆశయంతో ప్రపంచ యాత్రికుడుగా మారి అనేక దేశాలు చుట్టి వస్తున్నారు. ప్రస్తుతం అన్వేష్ జింబాబ్వేలో ఉన్నారు. జింబాబ్వేలో ఉన్న పరిస్థితులను ఏపీ పరిస్థితులతో సరిపోల్చుతూ అన్వేష్ తాజాగా యూ ట్యూబ్ లో పెట్టిన ఒక వీడియో అయితే రాజకీయాలను వేడెక్కిస్తోంది.


ఇంతకీ అన్వేష్ ఏమి పెట్టాడు అంటే ఉచితాలు చాలా ప్రమాదం అని. జింబాబ్వే దేశం ఇలాగే ఉచితాలు అంటూ చేసిన ప్రయోగాల వల్ల తీవ్రంగా నష్టపోయిందని ఆంధ్రప్రదేశ్ కి కూడా సమీప భవిష్యత్తులో ఆ ప్రమాదం పొంచి ఉందని ఆందోళన చెందుతూ ఆ వీడియో పెట్టారు. ఈసారి ఓటు వేసే ముందు ఏపీ ప్రజలు అంతా అన్ని విషయాలూ ఆలోచించాలని ఆయన కోరడం విశేషం.

ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు పైన నా అన్వేషణ అంటూ అన్వేష్ పెట్టిన ఈ వీడియో అయితే తనకు బాగా నచ్చిందని టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ ప్రశమించడం విశేషం. అంతే కాదు ఈ వీడియో బాగా ఉందని కితాబు కూడా ఇచ్చారు. దాంతోనే ఇపుడు ఈ వీడియోతో పాటు అన్వేష్ కూడా రాజకీయ ఉచ్చులో చిక్కుకున్నారు.

నిజానికి అన్వేష్ చాలా వీడియోలు చేస్తూ ఉంటారు. కానీ మొదటిసారి ఆయన ఏపీ ఫ్యూచర్ అంటూ చేసిన ఈ వీడియో రాజకీయాల్లో పడి కొట్టుకుంటోంది. పైగా అన్వేష్ కి అయిదు కోట్ల రూపాయలు నారా లోకేష్ ఇచ్చారని కూడా ప్రత్యర్ధులు చేస్తున్న ఆరోపణల నేపధ్యంలో లోకేష్ దాన్ని తిప్పికొట్టారు. తాను ఎవరికీ ఏమీ ఇవ్వలేదని అదంతా తప్పుడు ప్రచారం అన్నారు.

మరో వైపు చూస్తే సోషల్ మీడియా వేదికగా అన్వేష్ వీడియోని వైసీపీ కార్యకర్తలు చీల్చి చెండాడుతున్నారు. ఆయన ఒక పార్టీకి అనుకూలం అన్నట్లుగా మాట్లాడుతున్నారు. అసలు అన్వేష్ కి ఏపీ రాజకీయల గురించి ఏమి తెలుసు అని ప్రశ్నిస్తున్నారు. ఇంకో వైపు చూస్తే జింబాబ్వే దేశం అని ఏపీ రాష్ట్రం అని అంటున్న వారూ ఉన్నారు.

జింబాబ్వే తీసుకున్న సొంత నిర్ణయాల వల్లనే పతనం అయిందని ఏపీ ఒక రాష్ట్రం అని ఏపీ చేసిన అప్పులకు హద్దులు లెక్కలు ఉంటాయని అంటున్నారు. కేంద్రం అన్నీ చూసి రుణాలు తీసుకోవడానికి అనుమతి ఇస్తుందని, రుణ పరిమితి కూడా ఉంటుందని గుర్తు చేస్తున్నారు. ఇక ఉచిత పధకాలు కేవలం ఏపీలోనే లేవని దేశమంతా ఉన్నాయని ప్రతీ రాజకీయ పార్టీ ఎన్నికల్లో హామీ ఇస్తూ ఉంటాయని అది పెద్ద డిబేటబుల్ ఇష్యూ అని దాన్ని పట్టుకుని ఏపీకి ఒక రాజకీయ పార్టీకి పులమడం వెనక రాజకీయ వ్యూహాలు ఉన్నాయని వైసీపీ నేతలు అంటున్నారు.

ప్రపంచ యాత్రికుడికి రాజకీయాలు ఎందుకు అందులో ఆయనకు ఉన్న అవగాహన ఎంత అన్న చర్చ కూడా ముందుకు తెస్తున్న వారూ ఉన్నారు. ఇదిలా ఉంటే అన్వేష్ ఉచిత పథకాలు వద్దు అవి ఒక్క రోజు మాత్రమే కడుపు నింపుతాయి అని చెబుతున్నారు. మరి ఆయనకు మద్దతు ఇస్తున్న టీడీపీ రేపటి రోజున ఏపీలో ఉచిత పధకాలు ఇవ్వకుండా తమ ఎన్నికల ప్రణాళికను ప్రకటిస్తుందా అని వైసీపీ నుంచి ప్రశ్నలు వస్తున్నాయి.

ఏది ఏమైనా ఈ ప్రపంచ యాత్రికుడు ఏపీలో కొత్త చిచ్చు పెట్టేశారు అని అంటున్నారు. మొత్తానికి సోషల్ మీడియాను అన్వేష్ కేంద్రంగా ఒక ఊపు ఊపేస్తున్నారు అనే అంటున్నారు. తాను ఏ రాజకీయ పార్టీకి చెందిన వారిని కాను అని యూ ట్యూబర్ అన్వేష్ చెబుతున్నారు. కానీ ఇది ఎక్కడా ఆగడంలేదు.

Tags:    

Similar News