నాయకుడు మోసం చేశాడు.. న్యాయం చేయండంటూ నటి ఆవేదన!

ఒక రాజకీయ పార్టీ వ్యవస్థాప అధ్యక్షుడు, నాయకుడు తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ... ఒక సినీనటి కోర్టుకెక్కిన వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది.

Update: 2023-09-02 08:41 GMT

ఒక రాజకీయ పార్టీ వ్యవస్థాప అధ్యక్షుడు, నాయకుడు తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ... ఒక సినీనటి కోర్టుకెక్కిన వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఒకరితో సహజీవనం.. మరొకరితో వివాహం ఈయన నైజం అంటూ ఆమె కోర్టుకు విన్నవించింది.

అవును... నామ్‌ తమిళర్‌ కట్చి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, సినీ నటుడు సీమాన్‌.. తనను వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశారని సినీనటి విజయలక్ష్మి ఆరోపించారు. ఈ క్రమంలో తాజాగా తిరువళ్లూరు మహిళా కోర్టు న్యాయమూర్తి పవిత్ర ఎదుట హాజరై వాగ్మూలం ఇచ్చారు. ఇదే సమయంలో పలు ఆధారాలు సమర్పించి తనకు న్యాయం చేయాలని కోరారు.

వివరాళ్లోకి వెళ్తే... నామ్‌ తమిళర్‌ కట్చి పార్టీ నేత సీమాన్‌.. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారనేది తన సహచర నటి అయిన విజయలక్ష్మి చేస్తున్న ప్రధాన ఆరోపణ. అయితే సీమాన్‌ మరో యువతిని వివాహం చేసుకున్నాడు! దీంతో.. ఆమె కోర్టును ఆశ్రయించింది.

అయితే ఈ వ్యవహారం 2011లోనే జరిగింది. అప్పట్లోనే విజయలక్ష్మి పోలీస్‌ స్టేసన్‌ లో సీమాన్‌ పై ఫిర్యాదు చేసింది. తనను లైంగికంగా వేధించాడని.. అత్యాచారం చేశాడని ఆ ఫిర్యాదులో పేర్కొంది. ఆ ఫిర్యాదు ఇచ్చి ఇప్పటికి 12 ఏళ్లు గడుస్తున్నా.. పెండింగ్‌ లోనే ఉందని ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ నేపథ్యంలోనే పది రోజుల క్రితం విజయలక్ష్మి ఆందోళన బాటపట్టారు. తనకు అన్యాయం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా సీమాన్ ని అరెస్టు చేయలేదని ఆమె ఆరోపించింది. ఇదే సమయంలో... సంవత్సరాల పాటు తానూ, సీమాన్‌ సహజీవనం చేశామని, చివరకు అతడు తనను మోసం చేశాడని ఆమె మీడియాకు వివరించారు.

దీంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇందులో భాగంగా విజయలక్ష్మిని స్టేషన్ కు పిలిపించారు. ఈ క్రమంలో డిప్యూటీ కమిషనర్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌, సీఐలు కలిసి ఆమెను సుమారు ఆరు గంటల పాటు విచారించారు.

ఇలా సుమారు ఆరుగంటల విచారణ అనంతరం... విజయలక్ష్మిని తిరువళ్లూరు మహిళా కోర్టు న్యాయమూర్తి పవిత్ర ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి పవిత్ర.. విజయలక్ష్మిని రెండు గంటల పాటు విచారించారు. ఇందులో భాగంగా... ఆరోపణలకు ఆధారాలను ఇవ్వాలని కోరారు.

ఈ సమయంలో స్పందించిన విజయలక్ష్మి... తనకు సీమాన్‌ నుంచి ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించడంతో పాటు అతనిపై చర్యలు తీసుకోవాలని కంటతడిపెడుతూ న్యాయమూర్తిని కోరారు. అనంతరం ఆమెవద్ద ఉన్న ఆధారాలు కోర్టుకి సమర్పించారు.

Tags:    

Similar News