ఏపీలో గెలిచేది ఆ పార్టీనే...నాదెండ్ల మనోహర్ తండ్రి జోస్యం!
ఏపీలో మళ్లీ వచ్చేది జగనే అని ఆయన తేల్చేశారు. తెలుగు రాష్ట్రాలలో తాజా పరిస్థితులను చూసినపుడు ఏపీలో మళ్లీ జగన్ గెలవడం తధ్యమని నాదెండ్ల భాస్కరరావు కుండబద్ధలు కొట్టారు.
ఏపీలో ఏ పార్టీ గెలుస్తుంది అంటే ప్రత్యర్ధి పార్టీకి చెందిన కీలక నాయకుడి తండ్రి ఏమి చెప్పాడన్నదే ఇక్కడ ఆసక్తికరం. నాదెండ్ల మనోహర్ ఈనాటి తరానికి అందరికీ తెలిసిన వారు. కానీ ఆయన తండ్రి నాదెండ్ల భాస్కరరావు సీనియర్ మోస్ట్ లీడర్. ఆయన 1983లో తెలుగుదేశం పార్టీని పెట్టినపుడు ఒక వెలుగు వెలిగారు. ఎన్టీయార్ పైలెట్ అయితే నాదెండ్ల కో పైలెట్ గా ఉండేవారు.
అలాంటి నాదెండ్ల 1984లో ఎన్టీయార్ ని దించేసి తాను సీఎం అయిపోయారు. అలా ఒక నెల రోజుల పాటు ఆయన ఉమ్మడి ఏపీని పాలించారు. ఆ తరువాత కాంగ్రెస్ లో చేరి కొంతకాలం రాజకీయాలు చేసి విరమించారు. ఆయన కుమారుడు నాదెండ్ల మనొహర్ రాజకీయంగా పుట్టింది కాంగ్రెస్ పార్టీలోనే. ఆయన రెండు సార్లు తెనాలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. డిప్యూటీ స్పీకర్ గా స్పీకర్ గా పేరు తెచ్చుకున్నారు.
ఇక విభజన తరువాత ఆయన టీడీపీలో కానీ వైసీపీలో కానీ చేరుతారు అనుకుంటే జనసేనలో చేరారు. 2019 ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసి ఓడారు. అయితే నాదెండ్ల మనోహర్ 2024 ఎన్నికల మీద కసరత్తు చేస్తూ పవన్ కి రాజకీయ సలహాలు ఇస్తూ ఆ పార్టీలో అత్యంత కీలకం అయిపోయారు. ఇదిలా ఉండగా ఏపీలో మళ్లీ ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటే నాదెండ్ల మనోహర్ తండ్రి అయిన నాదెండ్ల భాస్కరరావు సహజంగా చెప్పాల్సింది జనసేన గురించే.
కానీ ఆయన చెప్పిన పార్టీ పేరు వింటే జనసేన చీఫ్ పవన్ కళ్యాణే షాక్ తింటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ని మళ్లీ సీఎం చేయనివ్వను అని శపధం చేసి వారాహి రధమెక్కి తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్. ఆయన వెంట మనోహర్ ఉన్నారు. ఈ ఇద్దరికీ బిగ్ షాక్ తగిలేలా తాజాగా నాదెండ్ల భాస్కరరావు కీలక కామెంట్స్ చేశారు.
ఏపీలో మళ్లీ వచ్చేది జగనే అని ఆయన తేల్చేశారు. తెలుగు రాష్ట్రాలలో తాజా పరిస్థితులను చూసినపుడు ఏపీలో మళ్లీ జగన్ గెలవడం తధ్యమని నాదెండ్ల భాస్కరరావు కుండబద్ధలు కొట్టారు. ఏపీలో జగన్ బాగా పనిచేస్తున్నారని కూడా భాస్కరరావు కితాబు ఇచ్చారు. అంతే కాదు వెనకడిన వర్గాలు అంతా జగన్ వెంటే ఉన్నారని కూడా చెప్పుకొచ్చారు. ఇక ఏపీ పాలిటిక్స్ లో రెడ్డి కమ్మ డివైడ్ అయినా బ్రాహ్మిన్స్, వైశ్యాస్, సహా మిగిలిన వర్గాలు అన్నీ కూడా జగన్ తోనే ఉన్నారని భాస్కరరావు అంచనా కట్టారు. జగన్ వైపు ఉన్న సెక్షన్లు అన్నీ చంద్రబాబుని అసలు ఇష్టపడరని నాదెండ్ల అనడం విశేషం.
ఇదిలా ఉంటే తన కుమారుడు మనోహర్ ఉన్నత చదువులు చదువుకున్నారని, ఆయన రాజకీయాల్లోకి రావడం తనకు ఇష్టం లేదని అన్నారు. అయితే ఆయనే సొంతంగా నిర్ణయం తీసుకుని వచ్చారని, అసెంబ్లీ స్పీకర్ గా బాగా పనిచేశారని అన్నారు. ప్రస్తుతం తన కుమారుడు ఒక సినిమా యాక్టర్ తో రాజకీయంగా తిరుగుతున్నారని, తానేమీ వెళ్ళమనలేదని చెప్పుకొచ్చారు. మొతానికి జనసేనకు షాక్ తగిలేలా సీనియర్ నాదెండ్ల కామెంట్స్ ఉన్నాయని అంటున్నారు.