నాడు అల్లు అరవింద్...నేడు నాగబాబు...!?

మెగా ఫ్యామిలీ నుంచి మరోసారి అనకాపల్లి నుంచి పోటీకి సిద్ధపడుతున్నట్లుగా కనిపిస్తోంది.

Update: 2024-02-08 03:44 GMT

మెగా ఫ్యామిలీ నుంచి మరోసారి అనకాపల్లి నుంచి పోటీకి సిద్ధపడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఉన్నట్లుండి మెగా బ్రదర్ జనసేన నేత నాగబాబు అనకాపల్లి జిల్లా పర్యటన పెట్టుకున్నారు. ఆయన ఆ జిల్లా పరిధిలో పార్టీ నేతలతో సమీక్షలు నిర్వహించారు. నర్శీపట్నం లో ఆయన కలియతిరిగారు.

ఇటీవల వార్తలు వచ్చిన మేరకు చూస్తే అనకాపల్లి సీటు జనసేనకు ఇస్తారు అని అంటున్నారు. జనసేనకు ఈ సీటు ఇస్తే ఎంపీ క్యాండిడేట్ ఎవరు అన్నది కూడా ప్రశ్నగా ముందుకు వచ్చింది. ఈ మధ్యనే రాజకీయ అజ్ఞాతం వీడిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ జనసేనలో చేరారు. దాంతో ఆయనకు అనకాపల్లి ఎంపీ సీటు ఇస్తారని అంతా అనుకున్నారు.

మరో వైపు చూస్తే మెగా ఫ్యామిలీకి బాగా సన్నిహితుడు 2009లో గుంటూరు జిల్లా నుంచి ప్రజారాజ్యం తరఫున ఎంపీగా పోటీ చేసిన పారిశ్రామికవేత్త భైరా దిలీప్ చక్రవర్తి కి టికెట్ ఇస్తారని కూడా ప్రచారం సాగింది. అయితే ఈ మధ్యనే చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ సీట్ల సర్దుబాటు గురించి జరిపిన చర్చలలో అనకాపల్లి ఎంపీ సీటు కావాలని కోరారని అంటున్నారు.

జనసేనకు కాకినాడ మచిలీపట్నం ఎంపీ సీట్లు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించింది. కానీ మూడవ ఎంపీ టికెట్ గా అనకాపల్లి ఆయన కోరుతున్నారు. దాంతో అక్కడ నుంచి తన అన్న నాగబాబుని ఎంపీగా పోటీ చేయించే ప్లాన్ లో పవన్ ఉన్నారని అప్పటి నుంచే అంటున్నారు.

తాజాగా నాగబాబు పర్యటనతో డౌట్లు క్లియర్ అవుతున్నాయి. అయితే మీడియా ముందు మాత్రం తాను ఎక్కడ నుంచి పోటీ చేసేది జనసేన అధినేత పవన్ నిర్ణయిస్తారు అని నాగబాబు చెప్పారు. నాగబాబు పోటీ చేయడం ఖాయమని ఇపుడు అనకాపల్లిలో వినిపిస్తున్న మాట.

మెగా ఫ్యామిలీకి అనకాపల్లి ఎంపీ సీటు కొత్త కాదు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఇదే సీటు నుంచి పోటీ చేశారు. అయితే ఆనాడు లోకల్ నినాదం పెద్ద ఎత్తున రావడంతో పాటు కాంగ్రెస్ వేవ్ కూడా ఉండడంతో ఆ పార్టీ తరఫున పోటీ చేసిన సబ్బం హరి గెలిచి అల్లు అరవింద్ ఓటమి చవి చూశారు. ఇప్పటిదాకా చూస్తే విశాఖ ఎంపీ సీటు మాత్రమే వలస వాదులకు అడ్డాగా ఉంది.

అనకాపల్లిలో పూర్తిగా లోకల్ నినాదం ఉంటుంది. కనీసం విశాఖ నుంచి అక్కడ పోటీకి దిగినా వారు ఒప్పుకోరు. గాజువాకకే చెందిన గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తే ఆయనను నాన్ లోకల్ అన్నారు. ఇక 2014లో అవంతి శ్రీనివాసరావుని దాని కంటే ముందు గంటా శ్రీనివాసరావుని అనకాపల్లి నుంచి ఎంపీలుగా గెలిపించినా వారు స్థానికంగా స్థిరపడిన వారు అన్న భావన ఉంది.

అలా కాకుండా ఎక్కడ నుంచో వచ్చి లోకల్ గా పోటీ చేస్తే మాత్రం అనకాపల్లిలో ఓటమి ఎదురవుతోంది. గతంలో అలా జరిగింది. అయితే ఇపుడు అదే మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు పోటీకి దిగుతున్నారు అని ప్రచారంలో వాస్తవం ఎంత అన్నది కూడా చూడాల్సి ఉంది. నాగబాబుకు జనసేన అండతో పాటు టీడీపీ పొత్తు కూడా కలసివస్తుందని లెక్కలు వేస్తున్నారు.

పైగా అనకాపల్లిలో కాపు ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇలా కనుక చూస్తే రాజకీయంగా సమీకరణలు, సామాజిక సమీకరణలు సరిపోతాయి. కానీ లోకల్ నినాదం రేగితే మాత్రం దాని ముందు తట్టుకోవడం కష్టమే అని అంటున్నారు. 2019లో పవన్ కళ్యాణ్ గాజువాకలో ఓడిపోయిన చరిత్ర కూడా ఉందని గుర్తు చేస్తున్నారు. ప్రజలు తమకు మేలు చేసినా చేయకపోయినా తమ ప్రాంతంలో ఎంపీ ఎమ్మెల్యే ఉంటే చాలు అని కోరుకుంటారు.

అయితే నాగబాబు తాను అనకాపల్లిలో నివాసం ఉంటాను అని చెప్పి జనాలను ఒప్పించగలిగితే మాత్రం విజయం సాధించేందుకు మార్గాలు మెరుగు అవుతాయని అంటున్నారు. కానీ అధికార వైసీపీ ఊరుకోదని అంటున్నారు. లోకల్ కార్డుని ఆ పార్టీ ఉపయోగించడం ఖాయం అంటున్నారు. ఏది ఏమైనా అనకాపల్లి రాజకీయం నాగబాబు పోటీతో రసవత్తరంగా మారడం తధ్యమని అంటున్నారు.


Tags:    

Similar News