ప‌రువు న‌ష్టం దావా.. కోర్టుకు కింగ్ నాగార్జున!

తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్య‌ల‌పై టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే.

Update: 2024-10-07 09:47 GMT

తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్య‌ల‌పై టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే. నాగార్జున దాఖలు చేసిన ప‌రువు న‌ష్టం దావాపై సోమ‌వారం నాంప‌ల్లి మ‌నోరంజ‌న్ కోర్టులో విచారణ జరిగింది. నాగార్జున తరపున సీనియర్ కౌన్సిల్ అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు. ఆ అంశంలో మంగళవారం పిటిషనర్ నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని కోర్ట్ తెలిపింది. నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాలను కూడా రేపే నమోదు చేయాలని న్యాయ‌వాది అశోక్ రెడ్డి న్యాయస్థానాన్ని కోరారు. తదుపరి విచారణను నాంపల్లి కోర్ట్ రేపటికి వాయిదా వేసింది. దీంతో నాగార్జున మంగళవారం కోర్ట్‎కు హాజరై తన వాంగ్మూలం నమోదు చేయనున్నారు.

హీరో హీరోయిన్లు నాగచైతన్య, సమంత విడాకులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ కారణమంటూ మంత్రి కొండా సురేఖ తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఎన్‌ కన్వెన్షన్‌ను కూల్చివేయకుండా ఉండేందుకు సమంతను కేటీఆర్ దగ్గరికి పంపించేందుకు హీరో నాగార్జున, నాగచైతన్య బలవంతపెట్టారని.. దీనికి సమంత నిరాకరించడం విడాకులకు దారితీసిందని సురేఖ తీవ్ర ఆరోపణలు చేసింది. అక్కినేని ఫ్యామిలీని సమంతను ప్రస్తావిస్తూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయటంతో పెద్ద దుమారం రేగింది. మంత్రి వ్యాఖ్యలకు అక్కినేని నాగార్జున తీవ్రంగా స్పందించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు జాగ్రత్తగా మాట్లాడాలని, సముచితమైన పదజాలాన్ని ఉపయోగించాలని ఎక్స్ వేదికగా సూచించారు. అలాగే కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఈ క్రమంలోనే ఆమెపై గత గురువారం రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు.

కొండా సురేఖ రాజకీయ దురుద్దేశంతో తమ ఫ్యామిలీపై నిరాధార వ్యాఖ్యలు చేసారని, వాటి వల్ల తమ కుటుంబంపై ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయని నాగార్జున తన పిటిషన్ లో పేర్కొన్నారు. నిజా నిజాలు తెలుసుకోకుండా తమ పరువుకు నష్టం కలిగించేలా, తమ కుటుంబ గౌరవాన్ని ప్రతిష్టను దెబ్బతీసేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రిపై తక్షణమే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. అయితే న్యాయమూర్తి సెలవులో ఉండటంతో ఈరోజు సోమవారానికి విచారణ వాయిదా పడింది. నాగార్జున స్టేట్మెంట్ ను రికార్డ్ చేయమని సూచించిన న్యాయస్థానం.. రేపు మంగళవారం విచారణను కొనసాగించనుంది.

ఇకపోతే కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్ర నిరసలు రేగాయి. టాలీవుడ్ ప్రముఖులు, సినీ అభిమానులు ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సినిమా వాళ్లపై ఆధారాలు లేకుండా కామెంట్స్ చేస్తే మౌనంగా చూస్తూ ఊరుకోబోమని ఆగ్రహం వ్యక్తం చేసారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని, మంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు. ఈ నేపథ్యంలో కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. కానీ అందులో కేవలం సమంతను మాత్రమే ట్యాగ్ చేస్తూ, అక్కినేని ఫ్యామిలీని ప్రస్తావించలేదు. దీంతో నాగార్జున తమ పరువుకు నష్టం కలిగిందటూ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు.

అంతకముందు మంత్రి వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున ఎక్స్ లో స్పందిస్తూ.. ''గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవి లో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నాను'' అని పేర్కొన్నారు. అక్కినేని అమల, నాగచైతన్య, అఖిల్ సైతం కొండా సురేఖ కామెంట్స్ పై తీవ్రంగా స్పందించారు.

Tags:    

Similar News