బాబుకు విన్న‌పం: చేతులెత్తేయ‌డం కాదు.. చేత‌ల్లో చూపించాలి.. !

గ‌త రెండు రోజులుగా రాష్ట్రంలో విద్యుత్ ధ‌ర‌లు పెరుగుతున్నాయ‌ని.. దీనికి కార‌ణం వైసీపీ పాల‌నేన‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది.

Update: 2024-10-07 10:53 GMT

గ‌త రెండు రోజులుగా రాష్ట్రంలో విద్యుత్ ధ‌ర‌లు పెరుగుతున్నాయ‌ని.. దీనికి కార‌ణం వైసీపీ పాల‌నేన‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. రెండు ర‌కాలుగా విద్యుత్ చార్జీలు పెర‌గ‌బోతున్నాయ‌ని ప్ర‌భుత్వ అనుకూల మీడియా సంస్థ‌లే వెల్ల‌డిస్తున్నాయి. ఒక‌టి డిజిట‌ల్ మీట‌ర్ల కోసం చేసుకున్న ఒప్పందం మేరకు భారం ప‌డుతోంద‌ని అంటున్నారు. అదేస‌మ‌యంలో సౌర విద్యుత్‌కు సంబంధించి కూడా జ‌గ‌న్ స‌ర్కారు ఒప్పందం చేసుకుంది.

అంటే.. ఇటు జ‌ల విద్యుత్‌కు, అటు సౌర విద్యుత్‌కు సంబంధించి కూడా వినియోగ‌దారుల‌పై వ‌చ్చే రోజుల్లో భారం ప‌డ‌నుంద‌న్న‌ది అంద‌రూ చెబుతున్న మాట‌. అయితే.. దీనిని జ‌గ‌న్‌పై తోసేసి.. గ‌త స‌ర్కారు చేసుకున్న ఒప్పందాల ఫ‌లితంగానే ఇప్పుడు ప్ర‌జ‌ల‌పై భారం ప‌డుతోంద‌ని కూట‌మి స‌ర్కారు చెబుతుండ‌డ‌మే విరుద్ధంగా ఉంది. ఎందుకంటే.. ఎలాంటి ఒప్పందం అయినా.. స‌మీక్షించేందుకు ప్ర‌తి ప్ర‌భుత్వానికీ అవ‌కాశం ఉంది.

ఒక‌వేళ అలా కూడా అవ‌కాశం లేక‌పోతే.. కోర్టుల‌కు వెళ్లొచ్చు. ట్రైబ్యున‌ళ్ల‌కు కూడా వెళ్ల‌చ్చు. కానీ, అస‌లు ఈ భారం నుంచి ప్ర‌జ‌ల‌కు విముక్తి క‌ల్పించేలా చ‌ర్య‌లు తీసుకోకుండా.. కేవ‌లం వైసీపీపై నెపం నెట్టేస్తుం డడ‌మే ఇక్క‌డ చ‌ర్చ‌కు దారితీస్తున్న విష‌యం.

అస‌లు రెండు ఒప్పందాలు ఏంటి..?

1) డిజిట‌ల్ మీట‌ర్ల‌ను ఏర్పాటు చేయ‌డం: ఈ ఒప్పందం గ‌త వైసీపీ హ‌యాంలోనే జ‌రిగింది. ప్ర‌ముఖ వ్యాపార వేత్త అదానీతోనే ఈ ఒప్పందం చేసుకున్నారు. ఆయ‌న విదేశీయుడు కాదు. భారతీయుడు. పైగా.. దేశంలో అనేక వ్యాపారాలు కూడా ఉన్నాయి. మ‌న రాష్ట్రంలోనే అనేక పోర్టులు కూడా ఆయ‌న నిర్వ‌హ‌ణ‌లోనే ఉన్నాయి. వీటిని కేంద్ర‌మే అప్ప‌గించింది. అలాంట‌ప్పుడు డిజిట‌ల్ మీట‌ర్ల వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు న‌ష్టం వ‌స్తున్న‌ప్పుడు.. ఆయ‌న‌ను కూర్చోబెట్టి.. ఒప్పందాన్ని స‌మీక్షించుకునే అవ‌కాశం ప్ర‌భుత్వానికి లేదా? అంటే.. ఖ‌చ్చితంగా ఉంటుంది. ఒక‌వేళ లేక‌పోయినా.. న్యాయ స్తానాన్ని ఆశ్ర‌యించుకుని ర‌ద్దు చేసుకోవ‌చ్చు. లేదా.. మార్పులు చేసుకోవ‌చ్చు. ప్ర‌జ‌లపై భారం త‌గ్గించ‌వ‌చ్చు. కానీ.. స‌ర్కారు ఆ దిశ‌గా అడుగులు వేయ‌లేదు.

2) సౌర విద్యుత్‌: వైసీపీ హ‌యాంలోనే ఈ ఒప్పందం కూడా జ‌రిగింది. ఇది పూర్తిగా సౌర విద్యుత్‌కు సంబంధించిన ఒప్పందం. దీనిని నేరుగా ప్ర‌భుత్వ రంగ సంస్థ సోలార్ ఎన‌ర్జీ కార్పొరేష‌న్‌తోనే జ‌గ‌న్ ఒప్పందం చేసుకున్నారు. ఆదిలో ఈ సంస్థ త‌క్కువ ధ‌ర‌ల‌కే సౌర విద్యుత్ ఇస్తామ‌ని అంద‌రికీ చెప్పింది. ఏపీతోపాటు తమిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, కేర‌ళ రాష్ట్రాలు కూడా ఒప్పందం చేసుకున్నాయి. అయితే.. మ‌ధ్య‌లో కేంద్రం ఈ విధానాన్ని స‌మీక్షించి.. జీఎస్టీ విధించింది. అదేవిధంగా మిగులు ప‌రిక‌రాల ఖ‌ర్చును కూడా మోపింది. దీంతో యూనిట్ రూ.2.65 నుంచి రూ.6.4 వ‌ర‌కు పెరిగింది. సో.. ఇది కూడా ఏపీ ప్ర‌జ‌ల‌కు భార‌మే అయితే.. దీనిని ర‌ద్దు చేసుకునే అవ‌కాశం ఉంది. కేంద్ర ప్ర‌భుత్వంతో చ‌ర్చించి.. మాకు ఈ ధ‌ర‌ల‌కు అవ‌స‌రం లేదు.. అని చెప్ప‌డం ద్వారా అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ చేయ‌డం లేదు.

ఎందుకు..?

జ‌ల విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేప‌థ్యంలో ఇప్పుడు సౌర విద్యుత్ ఒప్పందం ర‌ద్దు చేసుకునే ప‌రిస్థితి లేదు. ఇదొక కార‌ణం. ఇక‌, డిజిట‌ల్ మీట‌ర్ల‌ను పెట్టుకుంటే.. కేంద్రం అప్పుల రూపంలో ఇచ్చే వెసులు బాటు వ‌చ్చే 25 సంవ‌త్స‌రాల వ‌ర‌కు వినియోగించుకునే అవ‌కాశం ఉంది. ఈ రెండు కార‌ణాలే.. అప్పుడు జ‌గ‌న్‌కైనా.. ఇప్పుడు కూట‌మికైనా క‌లిసి వ‌స్తున్నాయి. ఇదే స‌మ‌యంలో జ‌గ‌న్‌పై నెట్టేయ‌డం ద్వారా కూట‌మికి రాజ‌కీయ ప్ర‌యోజ‌నం కూడా ద‌క్క‌నుంది.

Tags:    

Similar News