అన్నగారి నాణెలకు ఆన్ లైన్ లోనే కాదు ఆఫ్ లైన్ లోనూ అంత డిమాండ్
పార్టీ ఏదైనా తెలుగోళ్లలో అత్యధికులు అభిమానించే రాజకీయ నాయకుల్లో ముందు వరసులో నిలుస్తారు నందమూరి తారకరామారావు
పార్టీ ఏదైనా తెలుగోళ్లలో అత్యధికులు అభిమానించే రాజకీయ నాయకుల్లో ముందు వరసులో నిలుస్తారు నందమూరి తారకరామారావు. దశాబ్దాలు గడుస్తున్నా ఆయన ఛరిష్మా ఎంతన్న విషయాన్ని తాజాగా విడుదల చేసిన ఆయన స్మారక నాణెల అమ్మకాలు చెప్పేస్తున్నాయి. సాధారంగా ఏ ప్రముఖుడి మీద స్మారక నాణెలు విడుదల చేసినా.. ఒక థీమ్ తోనే రూపొందిస్తారు. ఎన్టీఆర్ విషయంలో కాస్తంత భిన్నంగా మూడు థీమ్ లతో సిద్ధం చేశారు.
వంద రూపాయిల ముఖ విలువతో ఉన్న ఈ నాణెలు బయట చెల్లుబాటు కావు. అదే సమయంలో వాటి ధర రూ.3800 మొదలు కొని రూ.4500 వరకు వివిధ ధరలు ఉన్నాయి. ఈ నాణెల్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేయగా.. ప్రజలు కొనుగోలు చేయటానికి సోమవారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు. హైదరాబాద్ విషయానికి వస్తే.. సైఫాబాద్.. చర్లపల్లిలోని మింట్ లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అమ్మకాలు చేపట్టారు.
సైఫాబాద్ లోని మింట్ వద్ద ఎన్టీఆర్ అభిమానులు ఉదయం తొమ్మిది గంటలకే క్యూ కట్టారు. ఎన్టీఆర్ స్మారక నాణెలకు విపరీతమైన డిమాండ్ నెలకొంది. మొత్తం 12 వేల నాణెల్ని ముద్రించారు. మరో ఎనిమిది వేల నాణెల్ని ముద్రించనున్నారు. తొలిరోజున ఆఫ్ లైన్ లో 5వేల నాణెల్ని అమ్మకాలు జరిపారు. ఆన్ లైన్ విషయానికి వస్తే.. సోమవారం ఉదయం 10 గంటలకు అమ్మకాలు మొదలు పెట్టగా.. నిమిషాల వ్యవధిలోనే అమ్ముడైపోయి.. అవుటాఫ్ స్టాక్ బోర్డులు పెట్టేశారు. సాధారణంగా ఏదైనా స్మారక నాణెలకు పెద్దగా డిమాండ్ ఉండదు. అందుకు భిన్నంగా ఎన్టీఆర్ నాణెలకు విపరీతమైన డిమాండ్ ఉండటం ఆసక్తికరంగా మారింది.
మింట్ కు చెందిన ముఖ్య అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఏ స్మారక నాణెన్ని పది వేలకు మించి ముద్రించలేదని.. ఎన్టీఆర్ నాణెలు మాత్రం అందుకు భిన్నంగా 12వేలు ముద్రించినా సరిపోలేదన్నారు. హైదరాబాద్ లోని రెండు కేంద్రాల్లో ఐదు వేల నాణెల్ని అమ్మారు.చెక్కపెట్టలో ఉన్న నాణెనికి అధిక డిమాండ్ ఉంది. వాటి స్టాక్ తక్కువగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఏమైనా.. ఎన్టీవోడి క్రేజ్ తెలుగోళ్లలో ఎంతన్న విషయాన్ని తాజాగా మరోసారి ఫ్రూవ్ అయ్యిందని చెప్పక తప్పదు.