ఎవరీ నందిని పిరమిల్? అంబానీ ఫ్యామిలీతో ఆమె రిలేషన్ ఏంది?
ఇటీవల కాలంలో దేశీయ ఫార్మాలో తరచూ వినిపిస్తున్న మహిళా పారిశ్రామికవేత్త నందిని పిరమిల్.
ఇటీవల కాలంలో దేశీయ ఫార్మాలో తరచూ వినిపిస్తున్న మహిళా పారిశ్రామికవేత్త నందిని పిరమిల్. ఒక్క ఫార్మా రంగంలోనే కాదు ఫైనాన్షియల్ సర్వీసెస్.. రియల్ ఎస్టేట్ రంగాల్లో దూసుకెళుతున్న పిరమిల్ వ్యాపార సామ్రాజ్యానికి నందిని అత్యంత కీలకంగా అభివర్ణిస్తారు. ఇంతకూ ఆమె ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఆమెకు ముకేశ్ అంబానీ కుటుంబానికి ఉన్న బంధం ఏమిటి? ఆమె నెట్ వర్త్ ఎంత? లాంటి అంశాలపై ఆరా తీస్తే ఆసక్తికర సమాచారం బయటకు వస్తుంది. ఇంతకూ నందిని పిరమిల్ ఎవరో కాదు.. దేశీయ కుబేరుడు ముకేశ్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ వివాహమాడిన ఆనంద్ పిరమిల్ ఉన్నారు కదా. ఆయన కుమార్తె నందిని పిరమిల్. అంటే.. ఇషా అంబానీకి ఆడపడుచుగా చెప్పాలి.
మరోలా చెప్పాలంటే ముకేశ్ అంబానీ వియ్యంకుడైన అజయ్ పిరమిల్ కుమార్తె. పిరమిల్ గ్రూప్ డైరెక్టర్ల బోర్డులో సభ్యురాలు. నందిని తల్లిదండ్రులు అజయ్.. డాక్టర్ స్వామి పిరమిల్ కు సోదరుడు ఆనంద్ (ఈషా అంబానీ భర్త)తో కలిసి పిరమిల్ కంపెనీలో కీలక బాధ్యతల్ని నిర్వర్తిస్తోంది. ప్రస్తుతం పిరమిల్ ఎంట్ ప్రైజెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా.. పిరమిల్ ఫార్మా ఛైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్నారు. అంతే కాదు.. పిరమిల్ గ్రూప్ లో హ్యుమన్ రిసోర్సెస్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అధిపతిగా ఉన్నారు. ఓవర్ ది కౌంటర్ వ్యాపార విభాగాన్ని పర్యవేక్షించటంలో ఆమెది ప్రధాన పాత్ర.
ఆమె కెరీర్ లో 2010 అతి ముఖ్యమైనదిగా చెబుతారు. ఆ ఏడాది పిరమిల్ గ్రూపునకు చెందిన దేశీయ ఫార్ములేషన్ వ్యాపారాన్ని అబాట్ లాబొరేటరీస్ కు అమ్మేయటంలో ఆమె కీలక పాత్ర పోషించారు. సుమారు రూ.31.63 వేల కోట్ల డీల్ ను పూర్తి చేయటంలో ఆమె తన సత్తా చాటారు. మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. దేశీయ ఔషధ రంగంలో ఇదే అతి పెద్ద డీల్ గా వ్యవహరిస్తారు. నందిని ఎడ్యుకేషన్ విషయానికి వస్తే.. ఆమె కాలిఫోర్నియాలోని స్టాన్ ఫోర్డ్ వర్సిటీలో గ్రాడ్యుయేషన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. ఇంగ్లండ్ లోని ఆక్స్ ఫర్డ్ వర్సిటీ నుంచి పాలిటిక్స్.. ఫిలాసఫీ.. ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ పొందారు.
చదువు పూర్తి చేసిన తర్వాత అంటే 2006లో ఫ్యామిలీ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక.. ఆమె వ్యక్తిగత విషయాలకు వస్తే.. 2009లో ఆమె పీటర్ డీ యంగ్ ను ప్రేమించి పెళ్లాడారు. అతను పిరమిల్ గ్లోబల్ ఫార్మా సీఈవోగా.. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఇతను కూడా స్టాన్ ఫోర్డ్ వర్సిటీలోనే చదువుకున్నాడు. ఆ తర్వాత మెకిన్సే కంపెనీలో చేరాడు. ఇంతకూ నందిని నెట్ వర్త్ ఎంతన్న విసయానికి వస్తే.. సరైన సమాచారం అందుబాటులో లేదు. కానీ.. ఆమె తండ్రి అజయ్ పిరమల్ నికర విలువ రూ.23,307 కోట్లుగా చెబుతారు. అంటే.. ఆమె నికర ఆస్తి దగ్గర దగ్గర రూ.10వేల కోట్లకు పైనే ఉండొచ్చన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది.