లోకేష్ యాక్షన్ స్టార్ట్ అనేశారా...?
రెడ్ బుక్ అంటే అంత భయమెందుకు అంటున్నారు మంత్రి నారా లోకేష్. తప్పులు చేసిన వారే భయపడతారు అని ఆయన ఎద్దేవా చేశారు.
రెడ్ బుక్ అంటే అంత భయమెందుకు అంటున్నారు మంత్రి నారా లోకేష్. తప్పులు చేసిన వారే భయపడతారు అని ఆయన ఎద్దేవా చేశారు. తాను ఏపీ వ్యాప్తంగా పాదయాత్ర చేసినపుడు వంద సభలలో ఊరూరా తిరిగి ప్రశంగించానని ఆయన చెప్పారు. ఆ సమయంలో చట్ట వ్యతిరేకంగా వైసీపీ నేతలు చేసిన చర్యలు అన్నీ తన దృష్టికి వచ్చాయని వాటినే రెడ్ బుక్ లో పెట్టాను అని ఆయన చెప్పారు.
అందువల్ల రెడ్ బుక్ యాక్షన్ ఆగేది కాదని ఆయన తేల్చి చెప్పారు. మా రెడ్ బుక్ చూసి బ్లూ బుక్ పెడతారో మరో బుక్ తెస్తారో వారి ఇష్టమని అన్నారు. తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం రాజ్యాంగబద్ధంగా శిక్షించి తీరుతామని లోకేష్ అన్నారు
వైసీపీ నేతలు అయిదేళ్ళూ తప్పులు చేసి ఏపీని నాశనం చేశారని ఆయన మండిపడ్డారు. తప్పులు చేసినా చూస్తూ వదిలేయాలా అని ఆయన ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 120 రోజులు మాత్రమే అయిందని ఈ తక్కువ టైం లోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఆయన చెప్పారు.
తాము అభివృద్ధి చేస్తూంటే వైసీపీ అబద్ధాలు చెబుతోందని అన్నారు. ఇలా అబద్ధాలతో ఫేక్ న్యూస్ ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉంటే ఇచ్చిన 11 సీట్లు కూడా జనాలు వచ్చే ఎన్నికల్లో ఇవ్వరని ఆయన విమర్శించారు. 2014 నుండి 2019 మధ్యలో అయిదేళ్ళ కాలంలో తమ ప్రభుత్వం ఏపీకి 40కి పైగా పరిశ్రమలు తెచ్చిందని అలా ఎంతో మందికి ఉపాధి దక్కిందని అన్నారు.
వైసీపీ అయిదేళ్ళలో తెచ్చిన పరిశ్రమలు ఏమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. టీసీఎస్ తామే తెచ్చారని చెప్పడం తప్పు అని అన్నారు. వైసీపీ తరిమేసిన పరిశ్రమలతో పాటు కొత్త పరిశ్రమలను కూడా తెస్తామని ఆయన చెప్పారు. రాయలసీమలో మాన్యుఫాక్చర్ యూనిట్స్, అలాగే మొబైల్ రంగం, ట్రాన్స్ పోర్ట్ ఫీల్డ్ ని డెవలప్ చేస్తామని ఉత్తరాంధ్రను సర్వీస్ సెక్టార్ గా మారుస్తామని ఆయన అన్నారు.
అమరావతి ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందని అన్నారు. విజయవాడ వరదలకు సంబంధించి బాధితులు ఎవరైనా మిగిలి ఉంటే వారికి కూడా సహాయం చేస్తామని అన్నారు. మొత్తం 650 కోట్ల రూపాయలతో వరద సాయం అందించామని చెప్పారు.
జగన్ హాయిగా స్వేచ్చగా జిల్లాల పర్యటనలు చేయవచ్చు అని లోకేష్ చెప్పారు. రాజ్యాంగబద్ధంగా ఎవరైనా తిరిగే స్వేచ్చ ఉందని అలాగని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని ఆయన అన్నారు. పరదాలు కట్టుకుని సభలు పెడుతూ అయిదేళ్ళు తాడేపల్లికే కే పరిమితం అయిన జగన్ జిల్లాల టూర్లు చేస్తానంటే మంచిదే అని లోకేష్ ఎద్దేవా చేశారు.
తనను చూసి వైసీపీ నేతలు ఇన్స్పైర్ అవుతున్నారని ఆయన అన్నారు. రెడ్ బుక్ అని తాము అంటే వారు కూడా బుక్ తెస్తామనడం బాగుందని అన్నారు. రోడ్ల నిర్మాణం కోసం ఏకంగా నాలుగు వేల కోట్లు ఖర్చు అవుతాయని వర్షాలు తగ్గాక పనులు మొదలవుతాయని ఆయన చెప్పారు. మొత్తానికి చూస్తే లోకేష్ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తోందని చెప్పారు.