నారా భువనేశ్వరి ఎంట్రీ... టీడీపీకి కొత్త సంకేతాలు

ఈ పరిణామంతో భువనేశ్వరి రాజకీయంగా తాను యాక్టివ్ అవుతాను అన్న సందేశాన్ని పార్టీకి పంపించారు అని అంటున్నారు.

Update: 2023-09-13 18:03 GMT

తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు పార్టీకి దూరంగా ఉండడం అన్నది ఎన్నడూ జరగలేదు. ఆఖరుకు ఆయన విదేశాల్లో ఉన్నా అక్కడ నుంచే పార్టీని సమీక్షించేవారు. లీడర్లకు దిశానిర్దెశం చేసేవారు. టీడీపీతో చంద్రబాబు అనుబంధం నాలుగు దశాబ్దాల నాటిది.

అలాంటి చంద్రబాబు జైలు గోడల మధ్య అనూహ్య పరిస్థితులలో గడుపుతున్నారు. దాంతో పార్టీ భారం బాధ్యత ఎవరిది ఎవరు మోయాలి అన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది. పార్టీకి వెన్నుదన్నుగా సీనియర్లు ఉన్నారు. కానీ ప్రాంతీయ పార్టీ ఎన్టీయార్ పెట్టిన పార్టీ నారా వారి సారధ్యంలోని పార్టీని నడపాలీ అంటే ఆ కుటుంబమే ముందు ఉండాల్సి ఉంది.

లోకేష్ అయితే చంద్రబాబు తరువాత అన్నీ అని ఇప్పటిదాకా చెప్పినా ఆయన చేతికి పగ్గాలు అందడానికి ఇంకా చాలా సమయం ఉంది అని అంతా భావించారు. కానీ అనుకోని విధంగా చంద్రబాబు జైలు పాలు కావడంతో లోకేష్ మీద అతి పెద్ద భారం పడింది.

పార్టీలో సీనియర్లు ఎంతవరకూ ఈ యువనేత మాట వింటారు అన్న డౌట్లూ ఉన్నాయి. దాంతో మంగళవారం జరిగిన ములాఖత్ సందర్భంగా చంద్రబాబు పార్టీని ఎలా నడిపించాలి అన్న దాని మీద కుటుంబ సభ్యులకు దిశానిర్దేశం చేశారు అని అంటున్నారు. పార్టీని ముందుకు నడిపే విషయంలో నారా లోకేష్ కీలక భూమిక పోషించేలా చూస్తూనే తన సతీమణికి కూడా బాబు డైరెక్షన్స్ ఆ దిశగా ఇచ్చారా అన్న చర్చ కూడా నడుస్తోంది

దీంతో నారా భువనేశ్వరి ఇపుడు టీడీపీలో కీలకం అవుతున్నారు అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశంలో లోకేష్ తో పాటు భువనేశ్వరి కూడా పాలుపంచుకొవడం ఇపుడు చర్చనీయాంశం అయింది.

ఈ పరిణామంతో భువనేశ్వరి రాజకీయంగా తాను యాక్టివ్ అవుతాను అన్న సందేశాన్ని పార్టీకి పంపించారు అని అంటున్నారు. ఇక జైలులో ఉన్న చంద్రబాబుని కలసి వచ్చిన తరువాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోనే ఆమె మాట్లాడుతూ ఇది ఎన్టీయార్ పెట్టిన పార్టీ, ఏమీ కాదు, చిరస్థాయిగా ఉంటుంది అని ఆయన కుమార్తెగా గట్టి భరోసా అయితే క్యాడర్ కి ఇచ్చారని అంటున్నారు.

అదే విధంగా చూస్తే చంద్రబాబు సతీమణిగా ఆమె ఎపుడూ రాజకీయాల్లో లేరు. ఎన్టీయార్ కుమార్తెగా ఉన్నా కూడా ఆమెకు రాజకీయం పట్టలేదు. అయితే ఇపుడు టీడీపీలో నాయకత్వ సంక్షోభం ఉంది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో పెద్ద దిక్కుగా ఆమె పార్టీకి మారుతున్నారు అని అంటున్నారు.

పార్టీ క్యాడర్ కి దిశా నిర్దేశం చేయడంలో ఆమె ముందుంటున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులతో శ్రేణులతో ఆమె ఇలా సమావేశం జరపడం కూడా ఇదే మొదటిసారి. రానున్న రోజులలో ఎలా ప్రజా పోరాటాలు చేయాలి. ఎలా పార్టీని జనంలోకి తీసుకుని వెళ్లాలి అన్న దాని మీద ఆమె చర్చించారు. ఇదే ఇపుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. రానున్న రోజులలో ఆమె ఎలా ముందుకు వెళ్తారు అన్నది కూడా చర్చకు వస్తోంది.

Tags:    

Similar News