నేను జైలులో లేను... బాబు భావోద్వేగంతో ప్రజలకు రాసిన లేఖ

టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఏపీ ప్రజలకు రాసిన బహిరంగ లేఖ పూర్తి భావోద్వేగంతో కూడుకున్నదిగా సాగింది.

Update: 2023-10-22 15:26 GMT

నేను ఉన్నది జైలులొ కాదు మీ హృదయాలలో. నేను ఉన్నది మీ మనసులలో అంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఏపీ ప్రజలకు రాసిన బహిరంగ లేఖ పూర్తి భావోద్వేగంతో కూడుకున్నదిగా సాగింది. తన అరెస్ట్ అక్రమం అంటూ బాబు ఈ లేఖ ద్వారా మరోమారు పునరుద్ఘాటించారు. తాను విలువలు విశ్వసనీయతతో నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితం గడిపాను అని ఆయన పేర్కొన్నారు.

తన మీద కుట్రలు చేశారని జైలు శిక్ష వేశారని బాబు వాపోయారు. అయినా సరే తన నిబద్ధత పట్టుదల ఎక్కడా చెదరదు బెదరదు అంటూ బాబు లేఖలో స్పష్టం చేశార్. తాను ఇంకా దృఢంగానే ఉన్నానని బాబు అంటున్నారు. తన ముందున్న సవాళ్ళు అన్నీ కూడా ప్రజల సంకల్పం ముందు పనిచేయవని ఆయన అంటున్నారు.

తాను భౌతికంగా ప్రజల ముందు ఉండకపోవచ్చు కానీ తాను తెలుగు ప్రజల ఆలోచనలలో ఉన్నానని బాబు అంటున్నారు. భౌతికంగా తాను లేని అన్నది కేవలం ఒక మాట మాత్రమే అని ఆయన చెబుతున్నారు తనది సుదీర్ఘమైన రాజకీయ జీవితం అని బాబు చెప్పుకున్నారు. తాను ప్రజల సంక్షేమం అభివృద్ధి పట్ల ఎంతగానో తపించాను, చిత్తశుద్ధితో పాటుపడ్డానని బాబు అంటున్నారు.

తాను సదా ప్రజల కోసమే పనిచేస్తూ వచ్చానని, ఇక మీదట తనది అదే బాట అన్నారు. తనను ఆ దారి నుంచి మళ్ళించే విధంగా ఎవరూ చేయలేరు అని బాబు చెప్పుకున్నారు. తాను రాజమండ్రీలో నిర్వహించిన మహానాడులో దసరా నాటికి పూర్తిగా ఎన్నికల మ్యానిఫేస్టోని రిలీజ్ చేస్తాను అని చెప్పానని, ఇపుడు అదే రాజమండ్రీ జైలులో నలభై అయిదు రోజులుగా ఉండడం బాధాకరం అన్నారు.

అయినా ఇది తాత్కాలికమేనని త్వరలోనే మంచి జరుగుతుందన్న విశ్వాసం ఆయన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం ఆలస్యం అయినా తప్పకుండా జరిగి తీరుతుందని అన్నారు. చెడు మీద మంచి విజయం సాధిస్తుందని ఆయన అంటూ తన విడుదలను తన ఆలోచనలను ఆకాంక్షలను ఆశలను అన్నీ కూడా విజయదశమి పండుగతో ముడిపెట్టారు.

ఇక మీదట తాను రెట్టింపు ఉత్సాహంతో ప్రజల కోసం పనిచేస్తాను అని కూడా హామీ ఇచ్చారు. తన అరెస్ట్ జైలు జీవితం తో తల్లడిల్లిన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రజలలో వచ్చిన స్పందన అపూర్వం అన్నారు. తన మీద అవినీతి ముద్ర ఎవరూ వేయలేరు అని బాబు చెప్పడం విశేషం.

ఈ జైలు గోడలు నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేవు అని చంద్రబాబు పేర్కొన్నారు. నా ప్రజల నుంచి నన్ను అవి ఏ మాత్రం వేరు చేయలేవని కూడా ఆయన అంటున్నారు. తాను బయటకు వచ్చిన తరువాత పూర్తి స్థాయి మ్యానిఫెస్టోని రిలీజ్ చేస్తాను అని చంద్రబాబు ప్రకటించారు.

నా ప్రజల కోసం వారి పిల్లాల భవిష్యత్తు కోసం నేను పూర్తి ఉత్సాహంతో పనిచేస్తాను అని ఆయన హామీ ఇచ్చారు. ఎల్లపుడూ జనమే తన బలం, జనమే తన ధైర్యం అని చంద్రబాబు పేర్కొనడం విశేషం. ఎపుడూ గెలిచేది మంచి మాత్రమే సత్యాన్ని చేదించేది ఏదీ లేదని ఆయన అంటున్నారు.

సూర్యుడి వెలుగు రేఖలు ప్రసరించిన నాడు కమ్ముకున్న కారు చీకట్లు కచ్చితంగా తొలగిపోతాయని బాబు స్పష్టం చేశారు. మొత్తానికి అయిదు కోట్ల ఏపీ ప్రజలకు చంద్రబాబు రాసిన లేఖ క్యాడర్ కి ఉత్తేజంగా ఉంది. అలాగే ప్రజలకు భావోద్వేగం పెంచేలా ఉంది. పార్టీకి దిశా నిర్దేశం చేసేలా ఉంది. భవిష్యత్తు మీద భరోసా కల్పించేలా ఉంది.



 


Tags:    

Similar News