గోదారి ఒడ్డున జగన్ చంద్రబాబు...అరుదైన సీన్

ఒకరు ఏపీకి ముఖ్యమంత్రి, మరొకరు ప్రతిపక్ష నాయకుడు. ఈ ఇద్దరూ కలిసింది బహు తక్కువ.

Update: 2023-08-07 11:47 GMT

ఒకరు ఏపీకి ముఖ్యమంత్రి, మరొకరు ప్రతిపక్ష నాయకుడు. ఈ ఇద్దరూ కలిసింది బహు తక్కువ. ఎవరి దోవ వారిది. ఇక జగన్ ఉంటే జిల్లా మీటింగులో లేకుండా తాడేపల్లి నివాసంలో ఉంటారు. చంద్రబాబుకు జిల్లాల టూర్లు రాత్రి బస చేయడాలూ అలవాటు. అయితే చిత్రంగా ఈ ఇద్దరూ ఒకే చోట ఒక రాత్రి బస చేయబోతున్నారు. ఇది గత పుష్కర కాలంలో ప్రత్యర్ధులుగా ఉంటూ రాజకీయాలు చేస్తున్న ఈ ఇద్దరి విషయంలో ఎక్కడా జరగలేదు.

ఇదిలా ఉంటే సోమవారం పోలవరం టూర్ పెట్టుకున్నారు చంద్రబాబు. ఆయన చింతలపూడి, పట్టిసీమల మీదుగా వెళ్ళి పోలవరాన్ని సందర్శిస్తారు. ఆ తరువాత బాబు రిటర్న్ లో గోపాలపురం మీదుగా దేవరాపల్లి చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభ ఉంటుంది. రాత్రికి రాజమండ్రికి చేరుకుని బాబు బస చేస్తారు.

ఇక జగన్ టూర్ చూసుకుంటే అల్లూరి సీతారామరాజు జిల్లాని పోలవరం నియోజకవర్గంలో సోమ, మంగళవారాలలో పర్యటిస్తున్నారు. కూనవరం మండలంలో వరద బాధితుల ప్రాంతాలలో పర్యటించిన తరువాత రాత్రికి ముఖ్యమంత్రి జగన్ రాజమండ్రీ చేరుకుంటారు. జగన్ ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో బస చేస్తూంటే చంద్రబాబు అదే రాజమండ్రీలోని బీవీయార్ ఫంక్షన్ హాలులో బస చేస్తారని తెలుస్తోంది.

అంటే అటు జగన్ ఇటు చంద్రబాబు ఇద్దరూ కూడా రాజమండ్రీలోనే ఒక రాత్రి ఉండబోతున్నారు. పైగా గోదారి ఒడ్డున ఇద్దరు నేతలూ గడపబోతున్నారు. ఇది నిజంగా రాజకీయంగా చిత్రంగానే ఉంది అంటున్నారు. మరో వైపు చూస్తే ముఖ్యమంత్రిగా జగన్ రాజమండ్రిలో రాత్రి బస చేయడం ఇదే ప్రధమం, చంద్రబాబు అయితే మహానాడుకు కొద్ది నెలల క్రితం వచ్చినపుడు రాత్రి బస చేసి ఉన్నారు.

ఇక ముఖ్యమంత్రి చుట్టూ మంత్రులు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలు ఉంటారు. అలాగే చంద్రబాబు చుట్టూ పార్టీ నాయకులు సీనియర్ నేతలు ఉంటారు. దాంతో ఈ ఇద్దరు అధినాయకులను కలవడానికి పెద్ద ఎత్తున నాయకులు వస్తారు. దాంతో రాజకీయంగా రాజమండ్రి వేడెక్కనుంది అని అంటున్నారు. ఇక చంద్రబాబు అయితే దేవరాపల్లి మీటింగులో జగన్ ప్రభుత్వాన్ని నానా రకాలుగా విమర్శించి మరీ రాజకీయ కాక రేపి రాజమండ్రి వస్తున్నారు. జగన్ అధికారిక కార్యక్రమంలో ఉన్నారు.

ఇలా ఇద్దరు ప్రముఖ నాయకులు రాజమండ్రిలో విడిది చేయడంతో అధికారులు పోలీసులు ఇపుడు బిజీగా మారిపోయారు. ఇద్దరు నేతలు రెండు పార్టీలు ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పెరుగుతున్న రాజకీయ వేడి నేపధ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సి ఉందని అంటున్నారు. మొత్తానికి ఇది అరుదైన ఘటనగాఎనే చూస్తున్నారు.

Tags:    

Similar News