బాబాయ్ వర్సెస్ అబ్బాయ్.. బాబు తేల్చలేకపోతున్నారా?
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికలు టీడీపీకి చావోరేవో లాంటివే. ఈ సారి ఓడితే మాత్రం ఆ పార్టీ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ విషయం పార్టీ అధినేత చంద్రబాబుకు కూడా తెలుసు.
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికలు టీడీపీకి చావోరేవో లాంటివే. ఈ సారి ఓడితే మాత్రం ఆ పార్టీ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ విషయం పార్టీ అధినేత చంద్రబాబుకు కూడా తెలుసు. అందుకే వచ్చే ఎన్నికల నేపథ్యంలో బాబు ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ సీట్ల కేటాయింపుపై దృష్టి సారించారు. కానీ ఒక నియోజకవర్గంలో మాత్రం బాబాయ్ వర్సెస్ అబ్బాయి అన్నట్లు తయారైన టికెట్ గొడవను మాత్రం బాబు పరిష్కరించలేకపోతున్నట్లు తెలిసింది.
అదే కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం. ప్రస్తుతం ఈ నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జీగా మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యాంబాబు ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఈ సారి ఎన్నికల్లోనూ మరోసారి పోటీపడాలని చూస్తున్నారు. మరోవైపు శ్యాంబాబు బాబాయి, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ కూడా ఇదే నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో బరిలో దిగాలనే పట్టుదలతో ఉన్నారు.
ఇలా బాబాయి ప్రభాకర్, అబ్బాయి శ్యాంబాబు ఇద్దరూ ఒకే టికెట్ కోసం పట్టుబడుతున్నారని తెలిసింది. ఈ ఇద్దరిలో ఎవరూ తగ్గడం లేదని సమాచారం. చివరకు ఈ వ్యవహారం బాబు దగ్గరకు చేరింది. ఆయన చెప్పాలని చూసినా.. ఇద్దరిలో ఎవరూ కూడా టికెట్ వదులుకునేందుకు సిద్ధంగా లేమని కుండబద్ధలు కొంటారంటా! ఒకవేళ పత్తికొండను ఒకరికి ఇచ్చి.. మరొకరికి ఆలూర్ లేదా డోన్‌లో టికెట్ కేటాయించాలని చెప్పారని తెలిసింది. కానీ కేఈ కుటుంబం నుంచి ఒక్కరికే టికెట్ ఇస్తానని బాబు స్పష్టం చేసినట్లు సమాచారం. బాబు ఎటూ తేల్చలేక.. ఇంట్లోనే మాట్లాడుకోవాలని సూచించారని ప్రచారం సాగుతోంది. కేఈ కృష్ణమూర్తితో చర్చించి.. ఓ నిర్ణయానికి రావాలని ఈ ఇద్దరికీ బాబు చెప్పారని తెలిసింది.