హామీలు కురిపిస్తున్న బాబు
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం చంద్రబాబుకు జీవితాశయంలా మారిపోయిందనే చెప్పాలి.
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం చంద్రబాబుకు జీవితాశయంలా మారిపోయిందనే చెప్పాలి. ఈ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే ఏపీలోనూ ఆ పార్టీ భవిష్యత్ ఆగమ్య గోచరంగా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజయం కోసం బాబు శాయశక్తులా కృషి చేస్తున్నారు.
ఓ వైపు పర్యటనలు చేస్తూనే.. మరోవైపు నియోజకవర్గాల వారీగా బాబు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పర్యటనల్లో భాగంగా బాబు ఎక్కడికి వెళ్లినా హామీల వర్షం కురిపిస్తున్నారు. ఈ హామీలే వచ్చే ఎన్నికల్లో పార్టీని గట్టెక్కిస్తాయని బాబు నమ్ముతున్నట్లు తెలిసింది. ఓ వైపు వైసీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్‌ను విమర్శిస్తూనే మరోవైపు ప్రజలను ఆకట్టుకునేందుకు హామీలిస్తూ సాగుతున్నారు.
ఇప్పటికే టీడీపీ మినీ మేనిఫెస్టో ప్రకటించి ఎన్నికల సమరానికి సిద్ధమవుతోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, 20 లక్షల ఉద్యోగాలు.. ఇలా హామీలిస్తూ పోతున్నారు. తాజాగా మరో హామీని బాబు ప్రకటించారు. టీడీపీ అధికారంలోకి వస్తే సోలార్ పవర్ తీసుకొచ్చి రెండు రూపాయాలకే యూనిట్ కరెంట్ అందిస్తామని బాబు ప్రకటించడం సంచలనంగా మారింది.
ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో కరెంటు ఛార్జీలు మోత మోగుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీంతో రెండు రూపాయలకే యూనిట్ కరెంట్ అని చంద్రబాబు ప్రకటించడం హాట్ టాపిక్‌గా మారింది. సరిగ్గా గురి చూసి జగన్‌ను బాబు కొట్టారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఈ హామీలు బాబును విజయ తీరాలకు చేర్చుతాయో లేక నిలువునా ముంచేస్తాయో చూడాలి.