లోకేష్ హైలెట్ : టీడీపీకి...ప్లస్సా... మైనస్సా...!?

ఎప్పటికి ఏది అవసరమో చూసి దానికి వీలుగా వాలుగా చేసుకుని ముందుకు సాగడం బాబు మార్క్ పాలిటిక్స్

Update: 2023-12-20 16:34 GMT

తెలుగుదేశం పార్టీకి ఆరు నూరు అయినా ఈ రోజుకీ చంద్రబాబే అతి పెద్ద బలం. అది ఇప్పటిదాకా ఎవరైనా వేరేగా అనుకున్నా కూడా చంద్రబాబు యాభై రెండు రోజుల జైలు జీవితం టీడీపీని బాబు దూరంగా ఉంటే ఎలా పరిస్థితి ఉంటుందో కళ్ళకు కట్టినట్లుగా చూపించింది. చంద్రబాబు వ్యూహాలే టీడీపీకి బలం. చంద్రబాబుకు పొలిటికల్ గ్లామర్ లేకపోవచ్చు కానీ పొలిటికల్ గ్రామర్ చాలానే ఉంది. దాంతోనే ఆయన ఇన్నాళ్ళుగా పార్టీని అలా ముందుకు తీసుకుని వచ్చారు.

ఎప్పటికి ఏది అవసరమో చూసి దానికి వీలుగా వాలుగా చేసుకుని ముందుకు సాగడం బాబు మార్క్ పాలిటిక్స్. ఇదిలా ఉంటే చంద్రబాబు 2014లో ఎందుకు గెలిచారు అన్నది 2019 నాటికి గుర్తు చేసుకోలేదు. అందుకే ఆయనకు ఆ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైంది అని అంటున్నారు. విభజన వల్ల కునారిల్లిన ఏపీకి అనుభవం కలిగిన నాయకుడు చంద్రబాబు అని ప్రజలు ఎన్నుకుంటే ఆయన తన కుమారుడు రాజకీయ ఎదుగుదలకు బాటకు వేసుకున్నారు. ఎక్కడ కనీసం గెలవని లోకేష్ కి మూడు కీలక మంత్రిత్వ శాఖకు అప్పగించి అటు పార్టీ మీద ఇటు ప్రభుత్వం మీద పెత్తనం అప్పగించారు.

దాని వల్ల సొంత పార్టీలోనే వ్యతిరేకత రావడంలో టీడీపీ ఘోరంగా ఓటమి పాలు అయ్యారు. ఇక గత నాలుగున్నరేళ్లలో చంద్రబాబు జిల్లాల టూర్లే ఎంతో కొంత టీడీపీకి కొత్త ఊపిరులు ఊదాయి. లోకేష్ యువగళం పాదయాత్ర చేసినా ఒక మోస్తరుగానే ఫలితాలు వచ్చాయని అంటున్నారు. ఈ నేపధ్యంలో వచ్చే ఎన్నికల్లో జగన్ వర్సెస్ చంద్రబాబు అన్నట్లుగా ఫైట్ ఉంటే ఏదైనా రిజల్ట్ సానుకూలంగా టీడీపీకి వచ్చే చాన్స్ ఉంటుంది అని అంటున్నారు.

ఏపీని చంద్రబాబు ఏమైనా కొత్త మలుపు తిప్పుతారా అన్న ఆశ తటస్థులు విద్యావంతులలో అర్బన్ సెక్టార్ లో ఉంది అని అంటున్నారు. అయితే లోకేష్ ని హైలెట్ చేస్తే మాత్రం టీడీపీ లోపల కాకుండా బయట జనంలో కూడా రియాక్షన్స్ ఎలా వస్తాయి అన్నది కూడా ఇపుడు చర్చగా ఉంది. అంతే కాదు జనసేన మిత్రపక్షంగా ఉంది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అయితే చంద్రబాబు అనుభవం కావాలి అని అంటున్నారు.

అంతే తప్ప బాబు కాకుండా టీడీపీలో లోకేష్ అంటే జనసైనికుల రియక్షన్ కూడా వేరేగా ఉంటుంది అని అంటున్నారు. అయితే జరుగుతున్న ప్రచారం బట్టి చూస్తే టీడీపీలో చంద్రబాబు తరువాత లోకేష్ అన్నది తెలిసిందే. అయితే రేపటి ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే చంద్రబాబు మొత్తం అయిదేళ్ల పాలన కంప్లీట్ చేయకుండా మధ్యలో లోకేష్ కి పట్టాభిషేకం చేస్తారు అన్న ప్రచారం ఉంది.

ఇదే జనంలో ఆలోచనలో పడేస్తుంది అని అంటున్నారు. ఎందుకంటే ఏపీ పాలన అంటే చాలా కష్టం క్లిష్టం అనేది తెలిసిందే. జగన్ రూరల్ డెవలప్మెంట్ కి ప్రాధాన్యత ఇచ్చారు. చంద్రబాబు విజన్ వేరేగా ఉంటుందని అర్బన్ వాసులు అంటున్నారు. ఇక విభజన ఏపీలో ఎన్నో సమస్యలు ఎన్నో సవాళ్ళు ఉన్నాయి.

ఈ నేపధ్యంలో అయిదేళ్ల పాటు కనుక చంద్రబాబు సీఎం గా ఉంటారు అని ఆయన పట్ల అభిమానం ఉన్న జనం అనుకుని ఓటు చేస్తారు అంటున్నారు. అయితే వారసత్వ రాజకీయాలు కనుక టీడీపీలో ముదిరితే అపుడు లోకేష్ పాత్ర హైలెట్ అయితే ఇబ్బంది అని ఆలోచించే వారూ ఉంటారు. ఇక ఇటీవలే పొరుగున ఉన్న తెలంగాణాలో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ మీద విశ్వాసం లేక కాదు జనాలు ఓడించింది అన్న మాట కూడా బయటకు వచ్చింది.

ఈసారి కేసీఆర్ ని గెలిపిస్తే కేటీఆర్ కే సీఎం గా పట్టం కడతారు అని భావించి కూడా వారసత్వ పాలన వద్దు అని ఓడించారు అని అంటున్నారు. దానికి తగినట్లుగా కాంగ్రెస్ బీజేపీ వంటి విపక్షాలు చేసిన ప్రచారం కూడా బీఆర్ఎస్ కి యాంటీగా మారంది. కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు అన్నది కూడా జనంలోకి వెళ్ళిపోయింది.

జనాలు ఎపుడూ నాయకుడిని అభిమానిస్తారు వారి కుటుంబాలను కాదు, ఇక లోకేష్ విషయం తీసుకుంటే ఆయన ఇంకా చాలా రుజువు చేసుకోవాల్సి ఉంది. కానీ యువగళం ముగింపు పేరిట లోకేష్ అన్నీ అంటూ టీడీపీ కానీ దాని అనుకూల మీడియా కానీ హోరెత్తిస్తున్నారు. ఇది నిజంగా టీడీపీని మేలు చేసేది కాదు అని అంటున్నారు. టీడీపీ ఎప్పటికైనా చంద్రబాబుని ముందు పెట్టే పోరాడాలి. బాబే టీడీపీని నడుపుతారు, రేపు ప్రభుత్వం వచ్చినా నడుపుతారు అన్న అభిప్రాయం కలగాలి. అలా జరగకపోతే మాత్రం 2019 ఫలితాలను కచ్చితంగా గుర్తు చేసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు.

Tags:    

Similar News