నారా నందమూరి విజయభేరీ !
రాజకీయంగా నారా నందమూరి విజయాలను వర్ణించతరమా అనాల్సిన నేపధ్యం ఉంది
రాజకీయంగా నారా నందమూరి విజయాలను వర్ణించతరమా అనాల్సిన నేపధ్యం ఉంది. 1982 నుంచి 1995 వరకూ అన్న ఎన్టీఆర్ రాజకీయ ప్రభంజనం అయితే అనంతర కాలంలో నారా చంద్రబాబు తెలుగు రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాల్లో అద్భుతంగా నిలిచారు. చంద్రబాబుది నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం.
తాజా విజయంతో ఆయన నాలుగవ సారి ఏపీకి సీఎం కాబోతున్నారు. ఇదిలా ఉంటే జూన్ 4న వచ్చిన ఎన్నికల ఫలితాలతో నారా నందమూరి జయభేరీ రీ సౌండ్ చేసింది. ఈ రెండు కుటుంబాల నుంచి చూస్తే ఒక ముఖ్యమంత్రి, ఇద్దరు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలతో బలమైన రాజకీయ ప్రాతినిధ్యం కనిపిస్తుంది.
నారా కుటుంబం నుంచి చంద్రబాబు కుప్పం నుంచి దాదాపుగా అర లక్ష ఓట్ల తేడాతో ఘన విజయం సాధించి ఏపీకి ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆయన కుమారుడు యువ నేత నారా లోకేష్ 91 వేల పై చిలుకు భారీ మెజారిటీతో మంగళగిరిలో గెలిచి తెలుగుదేశానికి నవ సారధిగా నిలిచారు.
ఇక నందమూరి వైపు చూస్తే అన్నగారింటి ఆడపడుచు దగ్గుబాటి పురంధేశ్వరి రాజమండ్రి నుంచి భారీ మెజారిటీతో ఎంపీగా ఘన విజయం సాధించి తన సత్తా చాటారు. ఇక నందమూరి బాలకృష్ణ చిన్నలుడు శ్రీ భరత్ విశాఖ ఎంపీ సీటు నుంచి 5 లక్షల నాలుగు వేల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించి ఎంపీగా పార్లమెంట్ లో అడుగుపెట్టబోతున్నారు.
బాలయ్య అయితే హిందూపురం నుంచి 36 వేల ఓట్ల పై చిలుకు సాధించి హ్యాట్రిక్ కొట్టారు. హిందూపురం నుంచి భారీ సక్సెస్ అందుకుని బాలయ్య అసెంబ్లీలోకి మరోసారి అడుగుపెట్టబోతున్నారు. మొత్తం మీద చూస్తే నారా నందమూరి ఫ్యామిలీస్ లో ఇన్ని పోస్టులు ఉండడం ఆసక్తికరం. అదే సమయంలో ఎవరికి వారుగా తమ సొంత ప్రతిభను చాటుకుంటూ ఈ పదవులు అందుకున్నారు తప్ప ఎవరో నామినేట్ చేసి ఇచ్చినవి కావు. రాజకీయ కుటుంబాలు ఎన్ని ఉన్నా నారా నందమూరి కుటుంబాలు మాత్రం తెలుగు నాట వెరీ వెరీ స్పెషల్ అని చెప్పి తీరాల్సిందే. ఒప్పుకుని తీరాల్సిందే.