కేసీఆర్ సీక్రెట్ చెప్పిన తర్వాత మోడీ ఇమేజ్ పెరిగిందా?

మీకో రహస్యం చెప్పానా? అంటూ దేశ ప్రధాని తెలంగాణ ప్రజలను ఉద్దేశించి నిజామాబాద్ సభలో చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే

Update: 2023-10-10 00:30 GMT

మీకో రహస్యం చెప్పానా? అంటూ దేశ ప్రధాని తెలంగాణ ప్రజలను ఉద్దేశించి నిజామాబాద్ సభలో చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మొదలుకొని.. గులాబీ నేతలు పలువురు తీవ్రంగా తప్పు పట్టటం తెలిసిందే. తన వద్దకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. తన కుమారుడ్ని ముఖ్యమంత్రిని చేయాలని అనుకుంటున్నానని.. తనను ఆశీర్వదించాలని కోరితే తాను తిరస్కరించినట్లుగా మోడీ చెప్పుకున్నారు.

ఈ తరహా వ్యాఖ్యలు మోడీ ఇమేజ్ ను భారీగా డ్యామేజ్ చేశాయని రాజకీయ వర్గాలతో పాటు.. మీడియాలోని పలు వర్గాల వారు విశ్లేషిస్తుంటే.. తాజాగా ఒక సర్వే రిపోర్టు మాత్రం అందుకు భిన్నమైన వాదనల్ని వినిపించటం ఆసక్తికరంగా మారింది. ప్రధాని మాటల్లో నిజాల్లేవని.. అవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. దీనికి కౌంటర్ గా బీజేపీ నేతలు సవాలు విసురుతూ.. ప్రధాని చెప్పేవన్నీ అబద్ధాలేనని సీఎం కేసీఆర్ ప్రమాణం చేస్తారా? అని నిలదీస్తున్నారు.

ఈ వాద ప్రతివాదనల సంగతి ఎలా ఉన్నా.. తెలంగాణ ఇంటెన్షన్స్ సంస్థ ఈ వ్యవహారంపై సర్వే నిర్వహించినట్లుగా పేర్కొంది. సర్వేలో పేర్కొన్న అంశాల ప్రకారం చూస్తే.. ఎన్డీయే కూటమిలో చేరేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నించటం నిజం కావొచ్చంటూ 27 శాతం ప్రజలు అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా తేలింది. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసేందుకుమోడీ ఆశీస్సుల కోసం కేసీఆర్ ప్రయత్నించారన్న దానిలో నిజమే ఉండొచ్చని.. 36 శాతం మంది అనుకుంటే.. తొమ్మిదేళ్లలో కేసీఆర్ కుటుంబం తెలంగాణ సంపదను దోచుకున్నట్లుగా 31 శాతం అభిప్రాయపడ్డారు.

కర్ణాటకలో ఎన్నికల్లో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ ఫండింగ్ చేసిన మోడీ ఆరోపణలతో 34 శాతం మంది ఓటు వేయగా.. బీజేపీ ప్రభుత్వం వస్తే.. కేసీఆర్ ఫ్యామిలీ చేసిన అవినీతిని బయటకు తీస్తానన్న మోడీ వ్యాఖ్యలను 24 శాతం మంది నమ్ముతున్నట్లుగా వెల్లడైంది. బీఆర్ఎస్ ను బీజేపీ ఓడిస్తుందని 19 శాతం మంది విశ్వసిస్తున్నట్లుగా సర్వేలో తేలగా.. నిజామాబాద్ సభలో మోడీ వ్యాఖ్యలతో ఆ పార్టీ గ్రాఫ్ మాత్రం పెరిగినట్లుగా చెబుతున్న ఈ సర్వే ఫలితాలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.

Tags:    

Similar News