మోడి గట్టెక్కిస్తారా ?

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈమధ్యనే జరిగిన కర్నాటక ఎన్నికల్లో కూడా మోడీ చాలా రోడ్డుషోలు, బహిరంగసభల్లో పాల్గొన్నారు

Update: 2023-10-24 05:53 GMT

తెలంగాణాలో అవస్తలు పడుతున్న బీజేపీ ఆశలన్నీ నరేంద్రమోడీపైనే పెట్టుకున్నట్లుంది. అధికారంలోకి వచ్చే విషయంలో ఆశలన్నీ వదిలేసుకున్న బీజేపీ చివరాఖరుగా మోడీ మీదే ఆధారపడినట్లుగా అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే నెలాఖరు నుండి ఓ 10-15 రోజుల ప్రచారంలో మోడీతో ఉధృతంగా ప్రచారం చేయించాలని రాష్ట్ర పార్టీ గట్టిగా ప్రయత్నిస్తోంది. పార్టీవర్గాల సమాచారం ప్రచారం మోడీతో సుమారు 10 బహిరంగసభల్లో మాట్లాడించాలని ప్లాన్ జరుగుతోంది. అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాధ్ తదితరులను కూడా రప్పించే ప్లాన్ జరుగుతోంది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈమధ్యనే జరిగిన కర్నాటక ఎన్నికల్లో కూడా మోడీ చాలా రోడ్డుషోలు, బహిరంగసభల్లో పాల్గొన్నారు. అయితే పెద్దగా ఉపయోగం కనబడలేదు. మోడీ పాల్గొన్న రోడ్డుషోలు, బహిరంగసభల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలిచింది. దీనికి కారణం ఏమిటంటే లోకల్ లీడర్లంతా తమ శక్తి, యుక్తులను వదిలేసి భారమంతా మోడీపైనే వేసేయటం. స్ధానిక నేతల కెపాసిటికి మోడీ ఇమేజి తోడయితే ఫలితం ఉంటుంది కాని మొత్తం భారమంతా కేంద్ర నాయకత్వంమీదే వేసేస్తే ఏమిటి లాభం ?

కర్నాటకలో జరిగిన వ్యవహారం చూసిన తర్వాత కూడా తెలంగాణా నాయకత్వానికి జ్ఞానోదయం అయినట్లు లేదు. అందుకనే మోడీతో పాటు కేంద్రమంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులపైన ఆధారపడుతోంది. నిజానికి తెలంగాణా బీజేపీలో పవర్ ఫుల్లని చెప్పుకోదగ్గ నేతలు కనీసం నలుగురు కూడా లేరు. ఉన్న కొద్దిమంది నేతలు తమ నియోజకవర్గాల్లో గెలవటమే కష్టమని భావిస్తున్నట్లున్నారనే ప్రచారం పెరిగిపోతోంది. అంబర్ పేటలో కేంద్రమంత్రి, అద్యక్షుడు కిషన్ రెడ్డి గెలవడనే ప్రచారం అందరికీ తెలిసిందే.

అలాగే కరీనంగర్ ఎంఎల్ఏగా పోటీచేస్తున్న ఎంపీ బండి సంజయ్ గెలుపు కూడా అంత వీజీకాదంటున్నారు. ఇక విజయశాంతి లాంటి సీనియర్ల గురించి కూడా ఇలాంటి ప్రచారమే జరుగుతోంది. సీనియర్ల గెలుపుమీదే ఇంత అనుమానాల ప్రచారాలు జరుగుతుంటే ఇక మిగిలిన అభ్యర్ధుల గురించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఇలాంటి పరిస్ధితుల్లో అమిత్ , యోగి ఆదిత్య కాదు కదా మోడీ ఎన్నిమీటింగులు పెడితే మాత్రం ఏమిటి ఉపయోగం ?

Tags:    

Similar News