బాబు పవన్ హ్యాండ్ ఇస్తే మోడీ ప్రధాని కాలేరు !

కానీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి తేడా కొట్టాయి. ముఖ్యంగా అతి పెద్ద స్టేట్ అయిన యూపీలో బీజేపీకి దాదాపుగా సగానికి సగం సీట్లు తగ్గాయి

Update: 2024-06-04 19:29 GMT

దేశంలో మూడోసారి ప్రధాని కావాలని తొలి ప్రధాని పండిట్ నెహ్రూ రికార్డుని సమం చేయాలని ఆ మీదట పదిహేనేళ్ళ పాటు సుదీర్ఘంగా పాలించి అరుదైన రికార్డుని అందుకోవాలని నరేంద్ర మోడీ చాలా ఉబలాట పడ్డారు.

కానీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి తేడా కొట్టాయి. ముఖ్యంగా అతి పెద్ద స్టేట్ అయిన యూపీలో బీజేపీకి దాదాపుగా సగానికి సగం సీట్లు తగ్గాయి. అలాగే గతసారి పశ్చిన బెంగాల్ లో 22 ఎంపీ సీట్లు బీజేపీ గెలిస్తే ఈసారి 12కే పరిమితం కావాల్సి వచ్చింది. అంటే ఇక్కడ పది సీట్లు తగ్గాయి. అలాగే మహారాష్ట్రలో బీజేపీ శివసేన కాంబో ఆనాడు మెజారిటీ సీట్లు కొల్లగొడితే ఈసారి శివసేన ఎన్సీపీ చీలిక పార్టీలు ఏమీ కాకుండా పోయాయి. బీజేపీకి ఈ విధంగా దెబ్బ గట్టిగా తగిలింది.

ఈ మొత్తం వ్యవహారం చూస్తే 2019లో 304 సీట్లు సొంతంగా గెలుచుకున్న బీజేపీకి ఈసారి 238 సీట్లు మాత్రమే దక్కాయి. అంటే 66 సీట్లు భారీ కోతకు గురి అయ్యాయి. ఇక కేంద్రంలో అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ 272 ఉంది. ఎన్డీయేలో పెద్ద పార్టీలు చూస్తే టీడీపీ 16 సీట్లతో ఉంది. ఆ తరువాత పదిహేను సీట్లతో జేడీయూ ఉంది. ఇక ఏపీ నుంచే జనసేన కూడా ఉంది. ఆ పార్టీకి రెండు సీట్లు ఉన్నాయి. ఇలా ఈ పార్టీలు కలుపుకుంటేనే మోడీ మూడోసారి ప్రధాని ముచ్చట తీరుతుంది.

మరీ స్పష్టంగా చెప్పాలీ అంటే ఏపీ అతి కీలకం ఏకంగా 18 ఎంపీ సీట్లు పవన్ ప్లస్ బాబు వద్ద ఉన్నాయి. మరి మోడీని ప్రధాని చేసే విషయంలో ఈ బలం ఇస్తున్న ఈ రెండు పార్టీలు కేంద్రం నుంచి ఏపీకి ఏమి తీసుకుని వస్తారు అన్నది అందరికీ కలుగుతున్న ప్రశ్న. కేంద్రంలో గత రెండు విడతలుగా పూర్తి మెజారిటీతో బీజేపీ ఉంది.

దాంతో ఏపీ నుంచి 22 మంది వైసీపీ ఎంపీలు ఉన్నా ఖాతరు చేసే స్థితి 2019లో లేదు. అలాగే 2014లో చంద్రబాబుకు 15 మంది ఎంపీలు ఉన్నా పట్టించుకోలేదు. కానీ ఇపుడు అలా కాదు, మోడీ ప్రధాని సీటుకే ఏపీ సీట్లు ఆక్సిజన్ గా మారుతున్నాయి. అవి లేకపోతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే ఏర్పాటు కాదు.

మరి అంతటి ప్రాణ వాయువుని బీజేపీకి అందిస్తున్న టీడీపీ జనసేనలు ఏపీకి పదేళ్ళుగా ఉన్న విభజన హామీలతో పాటు కేంద్రం నుంచి రావాల్సినవి సాధించుకుని వస్తారా అన్నదే చర్చ. ఈ విషయంలో చంద్రబాబు కానీ పవన్ కానీ బీజేపీ మెడలు వంచాల్సిన సమయం ఇదేనని అంటున్నారు. బీజేపీ ఇపుడే వంగుతుందని, ఆ పార్టీకి కండిషనల్ గానే సపోర్ట్ ఇవ్వాలని ఏపీ విభజన హామీలు నెరవేర్చేంతవరకూ ప్రభుత్వంలో కూడా చేరకుండా ఏపీ ప్రయోజనాలకు ఈ రెండు పార్టీలు కట్టుబడి ఉండాలని అంటున్నారు.

ఆ విధంగా చేస్తేనే బీజేపీకి ఫికర్ ఉంటుందని ఏపీకి ఏమి చేయాలన్నా కమలం పార్టీ కదులుతుందని అంటున్నారు. నిజంగా కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ రాకపోవడం, ఏపీలోని ఎంపీల మీద ఆధారపడడం అన్నది రాష్ట్రానికే మేలు అంటున్నారు. అయితే దానిని సాధించే క్రమంలోనే బాబు పవన్ కచ్చితంగా ఉంటే ఏపీ ప్రజానీకం ఎప్పటికీ ఈ పార్టీలను మరచిపోదు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి చేస్తారో.

Tags:    

Similar News